Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court) కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కు అప్పగిస్తూ ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. నిస్సందేహంగా, న్యాయసమ్మతమైన, పక్షపాతరహిత విచారణ అనేది పౌరుల హక్కు అని ఈ సందర్భంగా జస్టిస్ జె.కె. మహేశ్వరి(Justice J.K. Maheshwari), జస్టిస్ ఎన్.వి. అంజారియా(Justice N.V. Anjaria)తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దేశ సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. కాగా, సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్ జిల్లాలో టీవీ(TVK)కే అధినేత విజయ్(Vijay) నేతృత్వంలోని ర్యాలీలో తొక్కిసలాట జరిగి, 41 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ టీవీకే పార్టీ వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం.. సీబీఐ విచారణకు ఆదేశించింది.
పౌరుల హక్కు
ఈ ఘటన ‘దేశ మనస్సాక్షిని కదిలించింది’ అని, పౌరులకు నిష్పాక్షికమైన దర్యాప్తు పొందే హక్కు ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో స్వతంత్రమైన దర్యాప్తు అవసరాన్ని నొక్కి చెబుతూ, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తు పురోగతిని పర్యవేక్షించేందుకు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి(Justice Ajay Rastogi) నేతృత్వంలో త్రిసభ్య పర్యవేక్షణ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. జస్టిస్ రస్తోగి ఇద్దరు సీనియర్ ఐపీఎస్(IPS) అధికారులను ఈ కమిటీకి ఎంపిక చేయనున్నారు. ఈ కమిటీకి సీబీఐ ఎప్పటికప్పుడు దర్యాప్తు నివేదికను అందించాల్సి ఉంటుంది.
Also Read: Telangana: బీసీ రిజర్వేషన్ల పేటెంట్ రైట్ .. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిదే
తీవ్ర అసంతృప్తి
రాజకీయ ర్యాలీల కోసం ప్రామాణిక కార్యాచరణ విధానం రూపొందించాలని మాత్రమే కోరిన పిటిషన్‌ను విచారించి, రాష్ట్ర పోలీసు అధికారులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసిన మద్రాస్ హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసు మధురై బెంచ్ పరిధిలోకి వస్తుందని, ప్రధాన న్యాయమూర్తి అనుమతి లేకుండా సింగిల్ బెంచ్ ఎలా విచారించిందని ప్రశ్నించింది. తొక్కిసలాట జరిగిన తర్వాత సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారని, సంతాపం వ్యక్తం చేయలేదని టీవీకే పార్టీ, విజయ్‌పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలపైనా సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ కేసును క్రిమినల్ రిట్ పిటిషన్‌గా ఎలా నమోదు చేశారో వివరణ ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు కోరింది. మరోవైపు.. ఈ తీర్పుపై టీవీకే అధ్యక్షుడు విజయ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ‘న్యాయం జరుగుతుంది’ అని పోస్ట్ చేశారు.
Also Read: Gadwal District: ఇందిరమ్మ ఇళ్ల ఇసుక టిప్పర్ల నిలిపివేత.. కమిషన్ కోసమే అడ్డుకుంటున్నారా?
