Lok Sabha Elections Effect: లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌ల మీద షాక్‌లు తగుతున్నాయి. తాజాగా.. వరంగల్ జిల్లా వర్థన్నపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్‌ను వీడిన కొద్దిగంటల్లోనే అదే పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇదే బాట పడుతూ.. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన రోజే కవిత అరెస్టు కావటం, మరోవైపు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న నేతలంతా ఒక్కొక్కరిగా బీఆర్‌ఎస్ పార్టీని వీడటం ఇప్పుడు బీఆర్ఎస్‌లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
లోక్‌సభ ఎన్నికల వేళ అన్ని పార్టీలూ ఎన్నికల ప్రచారంలో దిగి ఓటర్లను ఆకర్షిస్తుండగా, తమ పరిస్థితి రోజు రోజుకూ దిగజారటంపై బీఆర్‌ఎస్ పార్టీ నేతలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో సహా పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Read More: అది బీజేపీ తరం కాదు: రాహుల్ గాంధీ
ఇదిలా ఉండగా, ఆదివారం ఉదయం దీనికి తోడు నేడు సీఎం రేవంత్ రెడ్డి వలసల మీద చేసిన ప్రకటన బీఆర్ఎస్ నేతలను మరింతగా కలవరపరుస్తోంది. తాము గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్ప, ఎవరూ కూడా ఆ పార్టీలో మిగలరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వలసలు ఇప్పట్లో ఆగవనీ, వలసల మీద తమ పార్టీ నేతలు చేతులెత్తేశారనీ, పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటైనా దక్కటం అనుమానమేనని బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణులు వాపోతున్నాయి.