BRS: బీఆర్ఎస్ వరుస ఓటములకు కారణాలు ఇవే
BRS ( image credit: twitter)
Political News

BRS: బీఆర్ఎస్ వరుస ఓటములకు కారణాలు.. ఇవేనంటూ కార్యకర్తల ఆగ్రహం!

BRS: బీఆర్ఎస్ పార్టీ తీరుపై కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై అధిష్టానానికి విన్నవించినా స్పందించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే తీరుతో వ్యవహరిస్తే రాబోయే కాలంలో మనుగడ కష్టమేనని అభిప్రాయపడుతున్నారు. పార్టీని చక్కబెట్టాల్సి ఉన్నప్పటికీ చర్యలు చేపట్టకపోవడంతో విమర్శలకు దారి తీసింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమిపై సమీక్షా సమావేశంలో పార్టీ తీరును కేడర్ ఎండగట్టింది. ఎందుకు దృష్టి సారించడం లేదని మండిపడింది. ఇంకా నేతలు, కేడర్ మధ్య సమన్వయం చేయడంలోనూ పార్టీ విఫలమైందని అభిప్రాయపడింది.

తెలంగాణ భవన్‌లోనే నిలదీత

బీఆర్ఎస్ వరుస ఓటముల పాలవుతున్నా అధిష్టానం బలోపేతంపై దృష్టి సారించడం లేదు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై అధ్యయనం చేయడం లేదు. కేడర్ అభిప్రాయాలను తెలుసుకొని ప్రక్షాళన చేయడం లేదు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైనే దృష్టి సారించింది. దీంతో రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా గులాబీకి ప్రజలు బాసటగా నిలువడం లేదని స్పష్టమవుతున్నది. తాజా ఉప ఎన్నికలోనూ అది రుజువైంది. అయినప్పటికీ పార్టీపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. కేడర్‌కు సైతం భరోసా ఇచ్చిన దాఖలాలు లేవని పలువురు బహిరంగంగానే పేర్కొంటున్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమిపై ముఖ్య నేతలు, కీలక కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

కార్యకర్తలను పట్టించుకోలేదు 

ఈ సమావేశంలో కేడర్ తీవ్రస్థాయిలో పార్టీ తీరును తప్పుబట్టింది. నేతల మధ్య సమన్వయం లేదని, కేడర్ అభిప్రాయాలను, సూచనలను సైతం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ ఇన్‌ఛార్జులు సైతం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించాలని అలాంటప్పుడు ఎలా గెలుస్తామని ప్రశ్నించారు. సీనియర్లు సైతం ప్రచార సమయంలో కార్యకర్తలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉండే తమకు సమస్యల పైన అవగాహన ఉంటుందని కనీసం తమతో అభిప్రాయాలను షేర్ చేసుకోలేదని పేర్కొన్నారు.

Also Read: BRS: బీఆర్ఎస్ కష్టపడినా రాని ఫలితం.. కలిసి రాని ప్రభుత్వ వ్యతిరేకత!

లోకల్ ఇన్‌ఛార్జ్‌లకు పూర్తిగా సమన్వయ లోపం

ఇతర పార్టీలను నిలదీసే అవకాశం ఉన్నా మద్దతు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు డివిజన్ ఇన్‌ఛార్జ్‌లకు, లోకల్ ఇన్‌ఛార్జ్‌లకు పూర్తిగా సమన్వయ లోపం కనిపించిందని పలువురు అభిప్రాయపడ్డారు. కొన్ని సందర్భాల్లో కార్యకర్తలను ఇతర పార్టీ వాళ్లు ఇబ్బందులకు గురి చేస్తున్నా నేతలు పట్టించుకోవడం లేదని అలాంటప్పుడు ఎలా పని చేస్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా పోలింగ్ జరిగే రోజూ డివిజన్ ఇన్‌ఛార్జ్‌లు సైతం లేరని, లోకల్ నాయకుల్లో సమన్వయం కొరవడిందన్నారు. ఇతరుల విమర్శలను తిప్పి కొట్టడంలో పూర్తిగా విఫలం అయ్యామని ఇది కూడా అధిష్టానం వైఫల్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ద్వితీయ శ్రేణి లీడర్లు ఏరి?

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలనే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లుగా పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో మరో వ్యక్తి ద్వితీయ నాయకుడుగా ఎదగ లేదు. అంతేకాదు మండలమైనా, డివిజన్‌లో నైనా చివరకు నియోజకవర్గమైనా ఏదైనా యాక్టీవ్ నేత తయారు అవుతున్నాడని అనుకుంటే ఎమ్మెల్యేలు చెక్ పెట్టారు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకత్వ లేమి కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. పార్టీ మారిన నియోజకవర్గాల్లో, ఎవరైనా పెద్ద లీడర్ చనిపోయిన నియోజకవర్గాల్లోనూ ఇది తేటతెల్లం అయింది. మరో బలమైన నేత లేకపోవడంతో ఆ కుటుంబాలకు చెందిన వారికే మళ్లీ టికెట్ ఇవ్వడం పరిపాటిగా మారింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలను ఇన్‌ఛార్జ్‌లుగా పెట్టడం అందుకు నిదర్శనం. పదేళ్లు రాష్ట్రంలో పాలన సాగించిన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంత దారుణంగా ఉన్నదని పార్టీ నేతలే బహిరంగంగా పేర్కొంటున్నారు.

నాయకులకు పార్టీ పదవులు ఏవి?

ఉద్యమకాలం నుంచి పని చేస్తున్న పార్టీ నేతలు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కనీసం కమిటీల్లో చోటు దక్కితే చాలని ఎదురు చూసే నేతలు ఉన్నారు. అయినప్పటికీ వారికి పదవులు ఇవ్వడంలో అధిష్టానం నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నది. క్షేత్రస్థాయి నుంచి సైతం కమిటీలు లేకపోవడంతో నిరాశతోనే ఉన్నారు. ఎన్నికలు వస్తే మాత్రం అందరూ సమిష్టిగా పని చేయాలని ఆదేశాలు ఇస్తుండడంతో ఆ స్థాయిలో పని చేయడం లేదని రాష్ట్రంలో జరిగిన ఎన్నికలే స్పష్టం చేస్తున్నాయి. దీనికి తోడు కొంతమంది పార్టీలోనే కోవర్టులు ఉన్నారని వారిని అరికట్టడంలోనూ అధిష్టానం ఫెయిల్ అయిందనే ప్రచారం జరుగుతున్నది.

సమీక్షతోనే ముగిస్తారా?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలు, కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. కొందరు పేపర్లపై అభిప్రాయాలను రాసి ఇవ్వగా కొందరు సమావేశంలోనే లోపాలు ఎత్తి చూపారు. అన్నీ నోట్ చేసుకున్నామని కేటీఆర్, హరీశ్ రావు, మాజీ మంత్రులు సైతం వాటిపై దృష్టి సారిస్తామని, పార్టీని గాడిలో పెడతామని హామీ ఇచ్చారు. కానీ, ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఘోర ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా సమీక్షలు నిర్వహించారు. అభిప్రాయాలు తెలుసుకున్నారు, మమ అనిపించారు. ఆ తర్వాత దానిపై మళ్లీ చర్చ లేదని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీని బలోపేతం చేయకుండా ఏం చేసినా ఏం లాభమని మండిపడుతున్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ అధిష్టానం క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తుందా లేదా చూద్దాం.

Also Read: BRS Plans: జూబ్లీహిల్స్ ఫలితంపై 18న గులాబీ నేతల భేటీ.. కేడర్‌కు ఎలాంటి భరోసా ఇవ్వనున్నారు?

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం