Roja on Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన కామెంట్స్ చేశారు. ఓ దశలో ప్రాయశ్చిత్తం కోసం ప్రాకులాడే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ అంటూ రోజా కామెంట్ చేయడం విశేషం. తిరుమల గోశాలలో గోవులు చనిపోతున్నాయని ఆరోపిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు.
ఇటీవల తిరుమల గోశాలలో గోమాతలు చనిపోతున్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు ఈ ఆరోపణలపై కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ మధ్య తీవ్ర విమర్శలు సాగుతున్నాయి. అయితే 17వ తేదీన ఉదయం 10 గంటలకు తిరుమల గోశాల వద్దకు మాజీ సీఎం జగన్, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిలు ఇద్దరు రావాలని టిడిపి ఛాలెంజ్ విసిరింది.
ఈ ఛాలెంజ్ ను భూమన కరుణాకర్ రెడ్డి స్వీకరించగా, తిరుమల గోశాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఒక్కరే రావాలని వేల మందిని తీసుకురావడం తగదని టిడిపి సూచించింది. ఎట్టకేలకు పోలీసులు రంగ ప్రవేశం చేసి రెండు వర్గాల మధ్య పరిస్థితిని సద్దుమణిగించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే తనను గోశాలకు అనుమతించాలని భూమన కరుణాకర్ రెడ్డి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు.
అన్నకు నీకు పదవి ఇస్తే సరిపోతుందా?
భూమన కరుణాకర్ రెడ్డి తో పాటు మాజీ మంత్రి రోజా సైతం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని కాపాడుతానని, రక్షిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి లేదని, ఇప్పుడు నోరు మూగ బోయిందంటూ రోజా సీరియస్ కామెంట్ చేశారు.
అంతటితో ఆగక మీకు, మీ అన్నకు ప్యాకేజీలు, పదవులు ఇస్తే సరిపోతుందా అంటూ రోజా కామెంట్స్ చేయడం విశేషం. గోమాతలను పూజించే సాంప్రదాయం గల మన దేశంలో గోమాతల మరణాలను ఏపీలో చూస్తున్నామని రోజా ఆరోపించారు. అందుకు కారకులైన వారిని శిక్షించాలని, తాము కోరుతుంటే తమపై కేసులు నమోదు చేస్తున్నారంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కు తెలిసొచ్చింది
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి జోలికి వెళితే ఏమి జరుగుతుందో సీఎం చంద్రబాబుకు తెలుసని, ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కూడా తెలిసి వచ్చిందని రోజా కామెంట్స్ చేయడం వివాదంగా మారింది. ఇటీవల పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు అగ్నిప్రమాదం లో అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పడంతో, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే రోజా ఈ కామెంట్స్ చేసినట్లు జనసేన పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే కేసులు పెడితే భయపడే ప్రసక్తే లేదని, ఎట్టి పరిస్థితులలో తమ పోరాటం ఆగదని రోజా అన్నారు.
Also Read: Trump In AP: ఏపీకి డొనాల్డ్ ట్రంప్ రాక.. పిల్లలతో గోళీలాట..
అలిపిరి మెట్లు కడగండి
అంతటితో ఆగక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నా తిరుమలకు రావాలని రోజా సూచించారు. గతంలో తిరుమల లడ్డు విషయంలో ప్రాయాశ్చిత్త దీక్ష చేపట్టి, విజయవాడలో అమ్మవారి ఆలయ మెట్లను కడిగిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం తిరుమల కు వచ్చి అలిపిరి మెట్లను శుభ్రం చేయాలని రోజా సూచించారు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో బిరియానీలు, గంజాయిలు, చెప్పులు వేసుకుని తిరగడాలు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని రోజా సూచించారు. మొత్తం మీద రోజా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.