– బీజేపీ డ్రామాలు, బీఆర్ఎస్ కుట్రలు
– తిప్పికొట్టాలని పిలుపిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
– కళ్యాణం కాకముందే అక్షింతలు ఊరూరా ఎలా తిప్పుతారు?
– ఇది రాముడిని అవమానించడం కాదా?
– దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి
– రాముడి పేరుతో రాజకీయం తగదు
– బీజేపీ, బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా జనం నమ్మరు
– తెలంగాణకు మోదీ ఇచ్చింది గాడిద గుడ్డే
– ఇంకోసారి బీజేపీ గెలిస్తే రిజర్వేషన్ల రద్దు ఖాయం
– మాది ప్రజల ప్రభుత్వం
– ఆగస్ట్ 15లోగా రుణమాఫీ కచ్చితంగా చేస్తాం
– జమ్మికుంట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: ఎన్నికలొచ్చిన ప్రతీసారి బీజేపీ దేవుడి పేరుతో రాజకీయం చేస్తుందనే విమర్శలున్నాయి. ముఖ్యంగా రాముడి ప్రస్తావన తెస్తూ హిందూవుల్లో సెంటిమెంట్ రాజేసి ఓట్లు దండుకుంటూ ఉంటుందని ప్రతిపక్షాలు అంటుంటాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు అయోధ్య రామాలయాన్ని గట్టిగా వాడేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ తీరును తప్పుబట్టారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలన్నారు. రాములవారి కళ్యాణం కాక ముందే అక్షింతలు ఊరూరా ఎలా తిప్పుతారని ప్రశ్నించారు. కళ్యాణం జరుగకముందే అక్షింతలు పంచి రాముడుని బీజేపీ అవమానించిందని మండిపడ్డారు. మేం హిందూవులు కాదా? గ్రామాల్లో శ్రీరామ నవమి జరుపుకుంటలేదా? గ్రామ దేవతలకి బోనాలు చేయడం లేదా? అంటూ బీజేపీ తీరును ఎండగట్టారు.
ఇదే అసలైన ఫైనల్
కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ కళాశాలలో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ జరిగింది. దీనికి సీఎం రేవంత్ సహా మంత్రి పొన్నం ప్రభాకర్, పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కరీంనగర్ చైతన్యవంతమైన జిల్లా అని తెలిపారు. రాష్ట్రాన్ని సాధించాలన్న పట్టుదలతో ఎన్నికలలో, ఉప ఎన్నికలలో కేసీఆర్‌కి అండగా నిలబడ్డారని, కానీ, ఆయన ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కరీంనగర్, పాలమూరు కేసీఆర్ కబంధ హస్తాలలో మోసపోయాయని తెలిపారు. డిసెంబర్‌లో వచ్చిన ఫలితాలు సెమీ ఫైనల్స్ అయితే, ఫైనల్‌లో గుజరాతీలని ఓడించే బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉందని చెప్పారు.
Also Read: బీజేపీ ‘ఫేక్’ గేమ్
తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డే!
మోడీ, బండి సంజయ్ కరీంనగర్‌కి ఇచ్చింది, తెచ్చింది ఏమీ లేదని విమర్శించారు సీఎం. తెలంగాణ బిల్లుని కూడా అవమాననపరిచే విధంగా మాట్లాడారని, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని తప్పు పడితే బండి సంజయ్ ఏం చేశారని ప్రశ్నించారు. పదేళ్ళలో మోడీ తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ సెటైర్లు వేశారు. గాడిద గుడ్డు ఇచ్చినందుకు గుండు, అరగుండుకి ఓటు వేయాలా? అని అరవింద్, సంజయ్‌ని ఉద్దేశించి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదని, 400 సీట్లు వచ్చి బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రద్దు అవుతాయని ఆరోపించారు. రిజర్వేషన్ల రద్దు కావాలా? బీజేపీ ఓడాలా మీరే నిర్ణయం తీసుకోండని కోరారు.
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్రలు
తాను టీవీలలో మాట్లాడితే ఢిల్లీ నుండి పోలీసులు వచ్చారని, తనను వేధించిన కేసీఆర్ నడుం విరిగి మూలకుపడ్డారన్న విషయాన్ని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. కారు షెడ్డుకు పోయింది కాబట్టే బస్సు యాత్ర చేస్తున్నారని, చీకటి ఒప్పందంతో బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్‌ని ఓడగొట్టాలని చూస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ఇంటిమీద వాలిన కాకి తమ ఇంటి మీదకి వస్తే కాల్చి పారేస్తామని హెచ్చరించారు. నిధులు వద్దు మోదీ ప్రేమ ఉంటే చాలని మాట్లాడింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. తమది ప్రజల ప్రభుత్వమని, ప్రతీ పేదవాడి ఇంట్లో ఆనందం చూడాలని అనుకుంటున్నామని తెలిపారు. రామప్ప దేవాలయంలోని శివుడి సాక్షిగా మాట ఇస్తున్నా, ఆగస్ట్ 15 లోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.