Urea Shortage: యూరియా కొరత సమస్య తీరుతుందా?
Urea Shortage ( image credit: swetcha reporter)
Political News

Urea Shortage: యూరియా కొరత సమస్య తీరుతుందా? సర్కారు తీసుకొస్తున్న యాప్‌తో సక్సెస్ అవుతుందా?

Urea Shortage: యాసంగి సాగు ప్రారంభమైంది. రైతులు నాట్లకు సిద్ధమవుతున్నారు. యూరియా కొరత (Urea Shortage) ఏర్పడకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏ మేరకు సఫలికృతమవుతాయని సర్వత్రా చర్చకు దారితీసింది. ఈ యాసంగికి 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర 2.60 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్ ఉన్నది. కేంద్రం నుంచి యూరియా సరఫరాను ఎప్పటి వరకు తీసుకొస్తారు. రైతులకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ముందస్తుగానే కేంద్రాన్ని అలర్ట్ చేసే ప్లాన్

ఈ యాసంగి సైతం భారీగా వరి సాగు నమోదు కానున్నది. సుమారు 55 లక్షల ఎకరాల సాగు అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడం, ప్రాజెక్టులు, చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో సాగు విస్తీర్ణం గత యాసంగి కంటే ఈసారి పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి తగినట్లుగా అధికారులు సైతం యూరియా కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అక్టోబర్ నుంచి మార్చి వరకు 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుందని అధికారులు ప్రణాళిక రూపొందించారు. రాష్ట్రంలో 4.55 లక్షల టన్నుల యూరియా అవసరం ఉండగా, ప్రస్తుతం 2.60 లక్షల మెట్రిక్ టన్నులు స్టాక్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ డిసెంబర్ నెల చివరి నుంచి యాసంగి వరి నాట్లు ప్రారంభం కానున్నాయి.

తొలుత వ్యవసాయ నాట్లు

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తొలుత వ్యవసాయ నాట్లు ప్రారంభమవుతాయని అందుకు తగినట్లుగా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, కొంచెం ఆలస్యంగా మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి ఇతర జిల్లాల్లో వరి నాట్లు ప్రారంభమవుతాయని అందుకు తగినట్లుగా ప్రణాళికలు అధికారులు రూపొందిస్తున్నట్లు తెలిసింది. అయితే, కేంద్రంపై ముందస్తుగానే ఒత్తిడిని తీసుకొచ్చి ప్రతి నెల కేటాయించాల్సిన యూరియాను తెప్పించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే కేంద్రానికి వ్యవసాయ శాఖ అధికారులు దీనిపై లేఖలు రాశారు.

Also Read: Urea Shortage: రైతులను వీడని యూరియా కష్టాలు.. ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో ఆందోళన

యాప్‌పై లేని అవగాహన

వానాకాలం సాగు విస్తీర్ణం పెరగడం, వ్యవసాయ అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించకపోవడం, సాగును సైతం అంచనా వేయకపోవడంతో రాష్ట్రంలో తీవ్రంగా యూరియా కొరత ఏర్పడింది. రైతులు రోడ్డెక్కారు. యూరియా కోసం ధర్నాలు చేశారు. పగలు రాత్రి అనకుండా క్యూలో నిలబడ్డారు. దీంతో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ యాసంగిలో యూరియా కొరత ఏర్పడకుండా పక్కా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉన్నది.

అయితే, కొరత నివారించడానికి ఈ – యాప్‌ను తీసుకొస్తున్నది. దీనిపై ప్రజల్లో అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతాయని అనుమానాలు ఉన్నాయి. దీంతో రైతులకు యూరియాను అందుబాటులోకి ఎలా తీసుకొస్తారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. కొరత ఏర్పడకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యల్లో భాగంగానే యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. ఎక్కువ మంది రైతులకు పూర్తిస్థాయిలో యాప్‌పై అవగాహన కలిగేసరికి యాసంగి సాగు ముగుస్తుందని, మరోవైపు గిరిజన తండాలు, మారుమూల గ్రామాల్లోని రైతులు ఎలా యాప్‌ను ఉపయోగిస్తారు అనేది చర్చకు దారి తీసింది.

అతిగా యూరియా వాడకుండా అవగాహన

ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పదివేల సేల్స్ పాయింట్స్ ఏర్పాటు చేశామని, ఇందులో 3,000 ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేవి ఉన్నాయని, మిగిలిన 7,000 ప్రైవేట్ డీలర్స్‌కు చెందినవని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని అన్ని యూరియా సేల్స్ పాయింట్స్‌ను డీసెంట్రలైజ్డ్ చేసి ఎప్పటికప్పుడు స్టాక్ వివరాలను యాప్‌లో తెలియజేస్తామని అధికారులు పేర్కొంటున్నప్పటికీ, వాస్తవ రూపంలో ఏ మేరకు సాధ్యమవుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రస్తుతం రైతులు ఎకరా వరి సాగుకు 4 నుంచి 5 బస్తాల యూరియా వాడుతున్నారు. మిర్చికి ఆరు బస్తాలకు పైగా వాడుతున్నారు. యూరియాను రాష్ట్ర రైతాంగం ఎక్కువగా వినియోగిస్తున్నట్లు అధికారుల సైతం పలు సందర్భాల్లో పేర్కొంటున్నారు. ఆ యూరియా వాడకం తగ్గించేందుకు అధికారులు ప్రచారం చేయాలని, ప్రభుత్వం సైతం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే కొరత రాకుండా వరి సాగు ఎకరానికి రెండున్నర బస్తాలు, మిర్చి సాగుకు ఐదు బస్తాలు వాడేలా అవగాహన పెంచుతున్నట్టు అధికారులు తెలిపారు.

ఎకరాకు మూడు బస్తాలు?

వరి సాగు ఎకరాకు మూడు బస్తాలు సరిపోతుందని వ్యవసాయ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అందుకు అనుగుణంగా రైతులను వారికున్న ఎకరాలను బట్టి మూడు విభాగాలుగా విభజించారు. ఒకటి నుంచి రెండు ఎకరాల మధ్య ఉన్నవారికి ఎకరాకు మూడు బస్తాలు చొప్పున ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించారు. రెండు ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు ఉన్నవారికి రెండుసార్లు సరఫరా చేయాలని ప్రణాళికలు రూపొందించారు. అదేవిధంగా ఐదు నుంచి 20 ఎకరాల లోపు వారికి మూడు విడుతలుగా యూరియా సరఫరా చేయాలని నిర్ణయించారు. అయితే, ప్రభుత్వం వేసిన అంచనాలు ఏ మేరకు విజయవంతం అవుతాయనేది చూడాలి.

ప్రస్తుతం 5 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం

యాసంగి సాగులో జనవరి, ఫిబ్రవరి కీలకం. జనవరిలోనే వరి నాటు ముమ్మరం అవుతుంది. ఆ సమయంలో 3.5 లక్షల టన్నుల యూరియా అవసరం అవుతుంది. ఈ డిసెంబర్‌లోనే 1.5 లక్షల టన్నులు అవసరం అవుతుందని సమాచారం. రెండు నెలలు కనీసం 5 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం కాగా ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్నది 2.60 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. ఇలాంటి సమయంలో ఫిబ్రవరిలో రైతులకు అవసరానికి అనుగుణంగా ఏ మేరకు యూరియాను అందుబాటులో ఉంచుతారనేది చర్చనీయాంశమైంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ రాష్ట్రంలోనే ఉన్నప్పటికీ అక్కడ తయారీ అవుతున్న 40 నుంచి 50 శాతం మాత్రమే రాష్ట్రానికి సరఫరా చేస్తుండడంతో కొరతకు కారణమవుతున్నది.

Also Read: Urea Shortage: రాష్ట్రంలో యూరియా కొరత.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతన్నలు

Just In

01

IND vs SA 4th T20I: లక్నోలో నాల్గో టీ-20.. సిరీస్‌పై కన్నేసిన భారత్.. దక్షిణాఫ్రికాకు అసలైన పరీక్ష!

Hyderabad Police: నమ్మించి పని మనుషులుగా ఉద్యోగాల్లో చేరి.. బంగారు ఆభరణాలు చోరీ!

Ustaad BhagatSingh : ‘దేఖలేంగే సాలా..’ సాంగ్ చూసి వీవీ వినాయక్ హరీష్‌కు చెప్పింది ఇదే.. ఇది వేరే లెవెల్..

Jupally Krishna Rao: బంగ్లాదేశ్ అవతరణకు కారణం అదే.. ఇందిరా గాంధీ నాయకత్వాన్ని గుర్తుచేసిన జూపల్లి!

GHMC Council: వాడివేడిగా కౌన్సిల్ సమావేశం.. పార్టీలకతీతంగా పునర్విభజనపై సభ్యుల ప్రశ్నల వర్షం!