Telangana BJP (imagecredit:twitter)
Politics

Telangana BJP: బీజేపీలో మరోసారి బయటపట్ట ఆధిపత్య పోరు

Telangana BJP: బీజేపీలో ముసలం మరింత ముదిరింది. నేతల మధ్య వైరం మరింత ఎక్కువైంది. ఇన్నిరోజులుగా జరిగిన అంతర్యుద్ధం కాస్త బహిర్గతమైంది. కాషాయ నేతల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) వర్సెస్ ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) అన్నట్లుగా పరిస్థితి మారింది. సిద్ధాంతాలకు మారుపేరుగా ఉండే కమలం పార్టీలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయికి రావడం పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త చర్చకు దారితీసింది. భవిష్యత్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీలో.. పరిస్థితి రానురాను దారుణంగా తయారవుతుండటంతో వారి కల నెరవేరుతుందా? లేదా? కలగానే మిగిలిపోతుందా? అనే చర్చ మొదలైంది.

బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు
బీజేపీలో మొదలైన ఈ అంతర్యుద్ధం ఎక్కడికి దారితీస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీలో ఇప్పటికే నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ఆధిపత్య పోరు, కొత్త, పాత నేతల మధ్య చిచ్చుకు తోడు తాజాగా బండి వర్సెస్ ఈటల మధ్య పరోక్షంగా యుద్ధం మొదలైంది. తాజాగా హుజురాబాద్ పర్యటనలో భాగంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఒక కారణంగా తెలుస్తోంది. దానికి తోడు సోషల్ మీడియాలో ఈటల రాజేందర్ పై జరుగుతున్న దుష్ప్రచారానికి కారణం కూడా బండి వర్గీయులే అనే చర్చ జరుగుతోంది. జై సంజయ్ అంటే టికెట్లు రావని పరోక్షంగా ఈటలనుద్దేశించే చేశారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా గ్రూపులు లేవని చెబుతూనే గ్రూప్ రాజకీయాలకు తెరతీశారని బండిపై ఈటల వర్గీయులు విమర్శలు చేస్తున్నారు.

రాంచందర్ రావు ఎన్నిక
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఈటల రాజేందర్ గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ చివరకు రాంచందర్ రావుకు జాతీయ నాయకత్వం పగ్గాలు అప్పగించింది. దీంతో ఈటల తీవ్ర అసంతృప్తికి లోనైననట్లు తెలుస్తోంది. ఈటలకే పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ఆశించిన ఆయన వర్గీయులు సైతం తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే రాంచందర్ రావు ఎన్నిక అంశంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కీలకంగా వ్యవహరించారనే ప్రచారం జరుగుతుండటంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవడంతో రగిలిపోతున్న వారిపై కారం చల్లినట్లయింది.

Also Read: Jogulamba Gadwal district: ఇంటి పన్ను‌‌ కట్టించుకుంటున్నారు‌.. కాని మంచి నీళ్ల గురించి పట్టించుకోరా?

ఈటల వర్గీయులు అగ్గిమీద గుగ్గి
కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుజురాబాద్ లో సైతం సైకిళ్ల పంపిణీ పేరిట ఎంటరయ్యారు. ఈ అంశం ఈటల వర్గీయులను ఏమాత్రం మింగుడుపడలేదు. సైకిళ్ల పంంపిణీ కార్యక్రమానికి ఈటల వర్గీయులకు ఆహ్వానం అందకపోగా పరోక్​షంగా వార్నింగ్ ఇవ్వడమేంటని ఈటల వర్గీయులు అగ్గిమీద గుగ్గలిమవుతున్నారు. ఆయన సైకిళ్లు పంపిణీ చేస్తే తమకొచ్చిన ఇబ్బంది లేదని, కానీ తమకు పదవులు ఇవ్వబోమని పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడమేంటని ఈటల వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు. ఈటల వర్గీయులకు ప్రాధాన్యత ఇవ్వకపోవగా ఆయన అంటే గిట్టనివారికి పదవులు ఇప్పించడంలో బండి హస్తముందనే ప్రచారం జరుగుతోంది.

ఎంతో కష్టపడి పనిచేస్తున్నా
పార్టీలో ఈటలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఇటీవల ఆయన వర్గీయులు సమావేశమయ్యారు. ఈటల వెంట ఉంటే పార్టీలో పదవులు రాబోవనే హెచ్చరికలు వెళ్లిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న నేత గౌతమ్ రావు పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎందుకంటే తాము కింద స్థాయిలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నా గుర్తింపు దక్కడంలేదని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే పార్టీలో రాజీనామాలతో కుదుపు మొదలైంది. ఇటీవల రాజాసింగ్ రాజీనామా చేశారు. కొద్దిరోజులకే మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసిన బీజేపీ(BJP) అభ్యర్థి పంజా విజయ్ సైతం రాజీనామా చేశారు. రాజాసింగ్(Raja Singh) తో మొదలైన ఈ పర్వం ఎక్కడి వరకు వెళ్తుందనేది చూడాలి.

స్థానిక సంస్థల ఎన్నికలు
తెలంగాణ బీసీ సామాజికవర్గంలో ముదిరాజ్ ల ప్రాబల్యం ఎక్కువ. అలాంటిది తమకు పొలిటికల్ గా ప్రాధాన్యతనివ్వకపోవడం, ఈటల రాజేందర్(Etala Rajender)ను అవమానాలకు గురిచేయడంపై ఆ సామాజికవర్గం మొత్తం ఏకమవుతున్నట్లు సమాచారం. ఈటలకు మద్దతుగా వారంతా నిలిచే అవకాశముందని చర్చించుకుంటున్నారు. ఇంత బలమైన సామాజికవర్గం ఉండి అవమానాలు ఎదుర్కోవడం ఎందుకనే యోచనలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో ముదిరాజ్ సామాజికవర్గం వన్ సైడ్ అయితే కాషాయ పార్టీకి ఆ సామాజికవర్గం ఓట్లు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. బండి వర్సెస్ ఈటల ఇష్యూలో పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఇరు వర్గీయులు ఈ యుద్ధంపై అంతా హైకమాండ్ చూసుకుంటుందని ధీమాతో ఉన్నారు. మరి జాతీయ నాయకత్వం దీన్ని ఎలా డీల్ చేయనుందనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: Water Rocket: వాటర్ రాకెట్ తయారు చేసిన చైనా విద్యార్థులు.. వీడియో ఇదిగో

బండి, ఈటల వ్యవహారంపై స్పందిస్తే షోకాజ్
పార్టీ అంతర్గత వ్యవహారాలపై బీజేపీలో ఆంక్షలు మొదలయ్యాయి. మొన్నటికి మొన్న రాజాసింగ్ ఇష్యూపై ఎవరూ స్పందించవద్దని పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. కాగా తాజాగా బండి సంజయ్, ఈటల వ్యవహారాంపైనా ఆంక్షలు విధించింది. ఈ అంశంపై మీడియాతో ఏ నేత మాట్లాడవద్దని రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. పార్టీ ఆదేశాలు దాటి మీడియాతో మాట్లాడిన నేతలకు షోకాజ్ నోటీసులు ఇస్తామని రాష్ట్ర నాయకత్వం హెచ్చరించింది.

 

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?