Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్‌లో సిట్ దూకుడు పెంచడంతో గులాబీ పార్టీ నేతలకు గుబులు పట్టుకున్నది. పదేళ్ల అధికారంలో ఉన్న సమయంలో ఫోన్లు ట్యాప్ చేశారని అందులో భాగస్వాములు అయిన వారిని, ఆదేశించిన వారిపై సిట్ చర్యలకు సిద్ధమైంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ (BRS)) ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ అధికారులు విచారించారు. ఆ తర్వాత మాజీ మంత్రి హరీశ్ రావుకు నోటీసులు ఇచ్చి ఈ నెల 20న సుమారు ఏడున్నర గంటలపాటు సుదీర్ఘంగా అధికారులు విచారించారు. ఇదే క్రమంలో కేటీఆర్‌కు నోటీసులు వెళ్లాయి. దీంతో పార్టీ అధినేత కేసీఆర్‌కు సైతం నోటీస్ ఇచ్చి విచారణకు పిలుస్తారనే ప్రచారం ఊపందుకున్నది. ఇది పార్టీ నేతలతో పాటు క్యాడర్‌లోనూ ఆందోళనకు దారి తీసింది.
నోటీసులు వస్తాయని తెలిసే వ్యాఖ్యలా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు వస్తాయని ముందస్తుగానే తెలిసే కేటీఆర్ విమర్శల స్పీడ్ పెంచారనే చర్చ కూడా జరుగుతున్నది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, పాలన చేయకుండా, హామీలను అమలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆరోపిస్తున్నారు. రాజకీయ వేధింపులు తప్ప విచారణలో ఏముండదని, ఇదో లొట్ట పీసు కేసు అని ఘాటు విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు ముందస్తుగానే కేసీఆర్ సైతం నోటీసులు ఇస్తారని వ్యాఖ్యలు సైతం చేశారు. అంటే ఇది ప్రజల్లో సానుభూతి పొందేందుకేనా, లేకుంటే పార్టీ బలహీన పడకుండా క్యాడర్‌ను ముందస్తుగానే సంసిద్దులను చేయడానికా అనేది చర్చకు దారి తీసింది.
కేసీఆర్ ప్యామిలీలోని కీలకమైన వ్యక్తులకు సైతం?
కేసీఆర్ ఫ్యామిలీలోని కీలక వ్యక్తులందరికీ సిట్ నోటీసులు ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే హరీశ్ రావు, కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత కేసీఆర్‌తో పాటు సంతోశ్ కుమార్, కవిత, అనిల్‌కు సైతం ఇవచ్చే అవకాశం ఉన్నదని గులాబీ నేతలే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కీలకంగా వ్యవహరించడం, ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండడంతోనే ఫోన్ ట్యాపింగ్‌కు సైతం సంబంధం ఉండే అవకాశం ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు కవిత సైతం మీడియా ముందు తనతో పాటు తన భర్త అనిల్ ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ఆమెను విచారణకు పిలిచి వాగ్మూలం తీసుకునే అవకాశం ఉన్నదని, ఆమె చెప్పే అంశాలను బట్టి తదుపరి విచారణను చేపట్టే అవకాశం ఉన్నదని అనుకుంటున్నారు.
గులాబీ నేతల్లో గుబులు
ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కీలక నేతలందరినీ సెట్ వరుసగా విచారణకు పిలుస్తుండడంతో గులాబీ నేతల్లో ఆందోళన మొదలైంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తాము మాట్లాడిన మాటలన్నింటినీ విన్నారా, వింటే పార్టీలో తమ పరిస్థితి ఏంటనేది ఒక వైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కీలక నేతలపై కేసులు నమోదు అవుతుండడంతో భవిష్యత్‌లో పార్టీ పరిస్థితి ఏంటి? ఒక వేళ పార్టీలో ఉంటే భవిష్యత్ ఉంటుందా? ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడితే ఏం చేయాలి? పార్టీ ఆదుకుంటుందా? అనే సందేహాలు సైతం తొటి నేతలతో షేర్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ సిట్ దూకుడుతో గులాబీ నేతలను కలవరపెడుతున్నది.
Also Read: Phone Tapping Case: ఆ కీలక నేత ఎవరో నాకు తెలియదన్న హరీష్ రావు.. త్వరలో మరికొందరికి నోటీసులు

