Thummala Nageswara Rao: రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నదని కొన్ని పార్టీలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని, అది వారి అవివేకమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. ఆయన శాసనసభలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకున్న యూరియా సరఫరాలో జరిగిన జాప్యం, అలాగే పంట కాలం సమయంలో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) మూతపడటంతో గత ఖరీఫ్ సీజన్‌లో కొంత ఇబ్బంది ఏర్పడినట్లు తెలిపారు. అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ, అవసరమైన ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి మొత్తం 9.79 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయగలిగామన్నారు. ఇది 2024–25 ఖరీఫ్‌తో పోల్చితే 13 వేల మెట్రిక్ టన్నులు అధికం అని వెల్లడించారు.
4.52 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయం
2018–19 నుండి 2023–24 వరకు యూరియా అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, రబీ సీజన్‌లో ఏ సంవత్సరంలోనూ డిసెంబర్ 31 నాటికి 3 లక్షల మెట్రిక్ టన్నులకు మించి అమ్మకాలు జరగలేదని, అయితే ఈ రబీ సీజన్‌లో మాత్రం డిసెంబర్ 31 నాటికి 3.93 లక్షల మెట్రిక్ టన్నులు, ఈ రోజు వరకు మొత్తం 4.52 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని స్పష్టం చేస్తూ, 05.01.2026 నాటికి యూరియా – 1,67,884 మెట్రిక్ టన్నులు, డీ.ఏ.పీ – 51,458 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు – 2,67,661 మెట్రిక్ టన్నులు, ఎస్.ఎస్.పీ – 22,367 మెట్రిక్ టన్నులు, ఇతర ఎరువులు – 30,880 మెట్రిక్ టన్నులు నిల్వల్లో ఉన్నాయని వెల్లడించారు. రైతులకు అవసరమైనంత ఎరువులు ఎక్కడా కొరత లేకుండా అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నదన్నారు.
Also Read: Thummala Nageswara Rao: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
5 జిల్లాల్లో ఫెర్టిలైజర్ యాప్‌ను అమలు
ఎరువుల సరఫరాలో పారదర్శకత తీసుకురావడానికి ఫెర్టిలైజర్ యాప్‌ను ప్రయోగాత్మకంగా 5 జిల్లాల్లో అమలు చేస్తున్నామని, ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా 1.59 లక్షల మంది రైతులు 4.55 లక్షల యూరియా బస్తాలు కొనుగోలు చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. యాప్ అమలులో ఉన్న జిల్లాల రైతులు, డీలర్లు యాప్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. యాప్ విజయవంతం కాగానే అన్ని జిల్లాల్లో యాప్ అమలులోనికి తీసుకువస్తామన్నారు. యాప్ ద్వారా రైతుల అవసరం మేరకు యూరియాను, వారికి సౌకర్యవంతమైన సమయంలో కొనుగోలు చేసే విధంగా చేస్తున్నామన్నారు. కొన్ని పత్రికలు, రాజకీయ పార్టీలు వీటి మీద కూడా అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.

