Komatireddy Venkat Reddy: నల్లగొండ జిల్లా కేంద్రాన్ని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తరహాలో అత్యున్నతంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో రూ. 18.7 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ బీ చంద్రశేఖర్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు ఇప్పటికే సుమారు రూ. 2,000 కోట్ల నిధులను మంజూరు చేయించామని, ఇందులో భాగంగా అనేక పనులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో కొనసాగుతున్నాయని తెలిపారు. మరికొద్ది రోజుల్లోనే రూ. 1,054 కోట్ల విలువైన పనులు కొత్తగా ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.
పనులను వేగవంతం చేశాం
అమృత్-2 పథకం కింద రూ. 216 కోట్లతో నీటి ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ పనుల ద్వారా ఇంటింటికీ తాగునీటి సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు రూ. 56.75 కోట్లతో మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం, రూ. 100 కోట్లతో ధర్వేశిపురం – మునుగోడు రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేశామని మంత్రి వివరించారు. నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులతో పాటు జిల్లాలోని ఇతర పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిధుల కొరత లేకుండా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్, ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

