MLC Kavitha: రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రభుత్వం ఎన్నికలకు పోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) అన్నారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్(Hyderabad) లోని రాష్ట్ర జాగృతి కార్యాలయంలో పలువురు బీసీ నాయకులు బీఆర్ఎస్(BRS) లో చేరారు. కవిత వారికి జాగృతి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. 2001 నుంచి కేసీఆర్ వెంట తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచిన జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ గోపు సదానందం, సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోల శ్రీనివాస్, అరె కటిక సంఘం సురేందర్ తమ అనుచరులతో కలిసి జాగృతిలో చేరారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కల్వకుంట్ల కవిత చేస్తున్న కృషిని గుర్తించే తాము జాగృతిలో చేరుతున్నామని వారు ప్రకటించారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని వారు పేర్కొన్నారు.
నేతలతో కవిత భేటీ
42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. పలు రాజకీయ అంశాలు, బీసీ(BC)లకు జరుగుతున్న అన్యాయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, కామారెడ్డి డిక్లరేషన్(Kamareddy Declaration) ను అమలు చేయకుండానే కాంగ్రెస్(Congress) పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉందని ఆరోపించారు. తెలంగాణ జాగృతి, బీసీ సమాజం ఒత్తిడికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ, కౌన్సిల్ లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ బిల్లులు పాస్ చేసిందే తప్ప వాటికి రాష్ట్రపతి ఆమోదం కోసం చిన్న ప్రయత్నం కూడా చేయలేదన్నారు.
Also Read: Ramchander Rao: అవినీతిపరులను మా పార్టీలో చేర్చుకోం: రాంచందర్ రావు
కేంద్రం వద్ద బిల్లులు
ప్రధాని వద్దకు అఖిలపక్షం తీసుకెళ్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చి మాట తప్పిందన్నారు. కేంద్రం వద్ద బిల్లులు పెండింగ్ లో ఉండగానే రాష్ట్ర కేబినెట్ రిజర్వేషన్ల పెంపునకు చట్ట సవరణ చేస్తున్నట్టుగా ప్రకటించి ఆ ప్రతిపాదనలు గవర్నర్ కు పంపిందన్నారు. అటు కేంద్రం, ఇటు గవర్నర్ ను కలిసి రిజర్వేషన్లు సాధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కనీస ప్రయత్నాలు చేయలేదన్నారు. రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను, కేంద్రం, కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్ తొక్కిపెట్టినా న్యాయపోరాటం చేసి ఒత్తిడి తెచ్చే ప్రయత్నమేది చేయలేదన్నారు. బీసీలను మభ్యపెట్టేందుకు ఇటీవల అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి చట్ట సవరణ పేరుతో మళ్లీ మోసపూరిత రాజకీయాలకు తెరతీసిందన్నారు. రిజర్వేషన్ల సాధన కోసం బీసీ నాయకులు, వివిధ కులాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
Also Read: KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు