Raja Singh: కాషాయ పార్టీలో కరుడుగట్టిన హిందుత్వవాదిగా ముద్రపడిన రాజాసింగ్(Raja Singh) ప్రస్థానం ముగిసింది. 12 రోజులుగా పెండింగ్ లో ఉన్న ఆయన రాజీనామా అంశంపై పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. చివరకు రాజాసింగ్ కు పార్టీ రాం.. రాం.. చెప్పేసింది. రిజైన్ లెటర్‌ను ఆమోదిస్తున్నట్లుగా జాతీయ పార్టీ కార్యాలయ కార్యదర్శి అరుణ్ సింగ్(Arun Singh) స్పష్టంచేశారు. గత నెల 30వ తేదీన రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు.11 సంవత్సరాల క్రితం జూలైలోనే పార్టీలో చేరిన రాజాసింగ్ ఆయన చేరిన నెలలోనే పార్టీ రాజీనామా ఆమోదించడం గమనార్హం. ఈ నిర్ణయంపై హిందుత్వవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీకి నష్టమని వారంతా భావిస్తున్నారు.
బీజేపీ తరుపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్
రాజాసింగ్ టీడీపీ కార్పొరేటర్ గా 2009లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వరుసగా మూడుసార్లు బీజేపీ(BJP) నుంచి పోటీచేసి గోషామహల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో బీజేపీ తరుపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ శాసనసభ పక్షనేతగా పనిచేశారు. కాగా 2022లో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పార్టీ తీవ్రంగా స్పందించి ఆయన్ను సస్పెండ్ చేసింది. తీరా 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు సస్పెన్షన్‌ను ఎత్తేసింది. అప్పటి నుంచే రాజాసింగ్ సైలెంట్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి స్వయంగా ప్రధాని మోడీ(PM Modi), కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah) వచ్చినా ఆయన గైర్హాజరయ్యారు. 2023 ఎన్నికల్లో గెలిచాక శాసనసభ పక్షనేతగా మళ్లీ అవకాశం వస్తుందని భావించారు. కానీ పార్టీ ఏలేటికి అప్పగించింది. దీంతో పార్టీపై మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు.
Also Read; Two Died: వైద్యం వికటించి ఒకే రోజు ఇద్దరు మృతి
రబ్బర్ స్టాంప్ అంటూ విమర్శనాస్త్రాలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)కి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవ్వడంపైనా రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. అవకాశం వచ్చిన ప్రతిసారి కిషన్ రెడ్డిపై విమర్శల పర్వం కొనసాగిస్తూనే వచ్చారు. ఎవరు అధికారంలో ఉంటే వారితో కొందరు కీలక నేతలు టచ్ లో ఉంటారని పరోక్షంగా ఆయన బాంబు పేల్చారు. మేకప్ మెన్ అంటూ చురకలంటించారు. రబ్బర్ స్టాంప్ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇటీవల కొత్తగా స్టేట్ చీఫ్‌గా ఎన్నికైన రాంచందర్ రావుకు కూడా ఆయన సవాల్ విసిరారు. ఫాతిమా కాలేజీ కూల్చివేతపై పోరాడి తాను డమ్మీ కాదని నిరూపించుకోవాలని రాజాసింగ్ స్పష్టంచేశారు. గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) లో బీజేపీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాజాసింగ్ రాజీనామాను ఆమోదించడంపై పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. రాజాసింగ్ లాంటి కరుడుగట్టిన హిందుత్వవాదిని పార్టీ వదులుకోవడం నష్టమని హిందుత్వవాదులు చెబుతుంటే ఇంకొందరు మాత్రం ఎవరున్నా.. లేకున్నా పార్టీ మాత్రం కొనసాగుతుందని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.
గోషామహల్ బాధ్యతలు ఎవరికి
పార్టీకి రాజీనామా చేసి 10 రోజులు దాటినా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఇటీవల అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన రాజాసింగ్.. ఢిల్లీ(Delhi)లో పార్టీ పెద్దలను కలిసినట్లు ప్రచారం జరిగింది. ఢిల్లీ పెద్దలను కలిసినట్లు పలువురు చెబుతున్నా రాజాసింగ్ పై పార్టీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజీనామా ఆమోదం నేపథ్యంలో గోషామహల్ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. అయితే రాజాసింగ్ మాత్రం చివరి శ్వాస వరకు హిందుత్వవాదం కోసమే పనిచేస్తానని క్లారిటీ ఇచ్చారు. ఇదిలాఉండగా గతనెల 30న పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్.. తనను డిస్ క్వాలిఫై చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసినట్లు చెప్పారు. అయితే ఆయన తన పదవికి కూడా రాజీనామా చేయాలనుకుంటే నేరుగా స్పీకర్ నే సంప్రదించాలని పార్టీ స్పష్టం చేసింది. ఎట్టకేలకు రాజీనామాపై సస్పెన్స్ వీడటంతో ఆయన తన పదవికి రాజీనామా చేస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: Telangana: ఇండియా మ్యాప్‌లో తెలంగాణను మరిచారా.. అక్కర్లేదా?