Jupally KrishnaRao: లిక్కర్ దందాకు బ్రాండ్ అంబాసిడర్లు కేసీఆర్(KCR) ఫ్యామిలీ అని మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కూతురు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసి అడ్డంగా దొరికిపోయారని విమర్శించారు. స్కామ్‌లు, కమీషన్లు వంటి చరిత్ర కేసీఆర్ ఫ్యామిలీకి ఉన్నదని, లిక్కర్ దందాకు పేటెంట్ హక్కు వాళ్లకే ఉన్నదని మండిపడ్డారు. గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ గతంలో డబ్బులు లేవని లక్ష రూపాయలకు కారు అమ్ముకున్న చరిత్ర కేసీఆర్‌దేనని జూపల్లి విమర్శించారు.
అమరవీరుల చావులతో..
గతంలో కేసీఆర్(KCR) ఫ్యామిలీ ఆస్తులు ఎన్ని ఉన్నాయని, ఇప్పుడు వేల కోట్లకు ఎలా ఎదిగారని ప్రశ్నించారు. దమ్ముంటే చర్చిద్దాం అని సవాల్ విసిరారు. కేటీఆర్(KTR) పిచ్చికూతలు బంద్ చేయాలని జూపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. లిక్కర్ విషయంలో రాజకీయ పబ్బం కోసం అడ్డదిడ్డంగా మాట్లాడటం సరికాదన్నారు. అమరవీరుల చావులతో సాధించుకున్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి నాటకాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
Also Read: Mahabubabad District: ఆ పట్టణ కేంద్రంలో వరుస ప్రమాదాలు.. అధికారుల నిర్లక్ష్యమే కారణమా?
రిజ్వీ వీఆర్‌ఎస్‌పై క్లారిటీ
ఐఏఎస్ అధికారి రిజ్వీ వీఆర్‌ఎస్(Rizvi VRS)కు తాను అడ్డుతగలడం కారణం కాదని జూపల్లి క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్‌కు సంబంధించిన హోలోగ్రామ్స్ కాంట్రాక్ట్‌ను టెండర్లు లేకుండానే ఒకే కంపెనీకి వరుసగా ఇచ్చారని, తన దృష్టికి రాగానే ఆపేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. లేటెస్ట్ టెక్నాలజీతో టెండర్లు పిలవాలని చెప్పినా, రిజ్వీ స్పందించలేదని, కమిటీకి ఛైర్మన్‌గా ఉండి కూడా టెండర్లు కన్ఫర్మ్ చేయలేదన్నారు. ప్రభుత్వ విధి, విధానాలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయనే కారణంతోనే అక్టోబరు 11న తాను సీఎస్‌కు లేఖ రాశానని వివరించారు. రిజ్వీ వీఆర్‌ఎస్‌కు ఈ అంశానికి సంబంధం లేదని, ఆయనకు ఏఐజీ హాస్పిటల్‌లో నెలకు రూ.10 లక్షల జీతంతో ఉద్యోగ ఆఫర్ వచ్చిందన్నారు. దీంతో పాటు ఢిల్లీలో పలు అగ్ర కంపెనీల్లో అత్యధిక వేతనాలతో కూడిన జాబ్ ఆఫర్స్ ఉన్నాయన్నారు. అయితే ఆయన వీఆర్‌ఎస్ ఆమోదించవద్దని తానే స్వయంగా సీఎస్‌కు చెప్పినట్లు మంత్రి తెలిపారు. ఇవన్నీ తెలియకుండా కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Also Read: Mahabubabad Police: గంజాయి, మత్తు పదార్థాల.. నిర్మూలనే పోలీసుల లక్ష్యం!

