Adluri Laxman: పదేళ్ల పాటు గురుకులాలు విస్మరణకు గురయ్యాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) పేర్కొన్నారు. ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ తామే రాజులం మంత్రులంటూ పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ (Brs) లీడర్లు ప్రభుత్వాన్ని ధ్వంసం చేశారన్నారు. వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారన్నారు. విద్యా, సంక్షేమం రెండు వ్యవస్థలు భ్రష్టుపట్టాయన్నారు. గత ప్రభుత్వంలో విద్యార్ధుల సంఖ్య 67,113 వద్దే నిలిచిపోగా, ప్రజాప్రభుత్వంలో 71 వేలకు పెరిగిందన్నారు. ప్రస్తుతం గురుకులాల్లో 3.27 లక్షలకు పైగా విద్యార్దులు చదువుతున్నారన్నారు.
సంక్షేమంపై ఎంత భారం పడ్డా పేద కుటుంబాలకు భరోసా
ఎస్సీ గురుకులాల్లో ఇంటర్‌లో 62,334 మంది, డిగ్రీలో 8,710 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. విద్యార్థుల మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడంతో ప్రభుత్వానికి అదనంగా రూ.46,438.84 లక్షలు భారం పడుతుందన్నారు. సంక్షేమంపై ఎంత భారం పడ్డా పేద కుటుంబాలకు భరోసా, అండగా నిలిచేది తమ ప్రభుత్వమే అంటూ క్లారిటీ ఇచ్చారు. కానీ బీఆర్ఎస్ నేతలు చిల్లర రాజకీయాలతో విద్యార్థుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఇప్పటికీ సరిదిద్దలేని స్థితిలో ఉన్నదన్నారు. బీఆర్ ఎస్ హయంలో శాశ్వత భవనాలు లేవని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బాచుపల్లి, గొల్లపల్లి (జగిత్యాల) ప్రాంతాల్లో కొత్త భవనాల నిర్మాణం ప్రారంభమైందన్నారు. విద్యార్థుల భోజనం, వసతి, పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
ఐటీ విద్యార్థులు ఆహారం నాణ్యతలేమిపై రాత్రంతా మెస్‌లో జాగారం
ఇక గతంలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆహారం నాణ్యతలేమిపై రాత్రంతా మెస్‌లో జాగారం చేయగా, అప్పుడు ఒక్క మంత్రి కూడా అక్కడకు వెళ్లలేదన్నారు. ఇప్పుడు తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. 2022లో జరిగిన ఆందోళనల్లో విద్యార్థులు అన్నం తినకుండా నిరసన వ్యక్తం చేశారని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వ హాయంలో సివిల్ సర్వీసుల్లో గురుకులాల ప్రతిభ చాటుతున్నారన్నారు. 2024 సివిల్స్ ప్రిలిమ్స్‌లో 24 మంది, మెయిన్స్‌లో 3 మంది సెలెక్ట్ అయ్యారన్నారు. 2025లో 26 మంది విద్యార్థులు సివిల్స్ ప్రిలిమినరీలో క్వాలిఫై అయ్యారన్నారు.
5 మంది విద్యార్థులు విజయం
ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ప్రిలిమినరీలో 5 మంది విద్యార్థులు విజయం సాధించారన్నారు. సీఎం శ్రీ రేవంత్ రెడ్డి దూరదృష్టితో గురుకులాల్లో అత్యవసర ఇబ్బందుల పరిష్కారం కోసం రూ.60 కోట్లు అత్యవసర నిధులు విడుదల చేశారన్నారు. ప్రతి సొసైటీ సెక్రటరీకి నిధుల వినియోగంపై పూర్తి అధికారం ఇచ్చారన్నారు. ఫాస్ట్ యాక్షన్ మెకానిజం ఏర్పాటు చేసి, ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకునే విధానం అమల్లోకి వస్తోందన్నారు. పెండింగ్ లోని నిధులను త్వరలోనే రిలీజ్ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read: Jangaon: జనగామలో 108 ఆలస్యం.. ఆటోలోనే అరుదైన డెలివరీ చేసిన ఆశ వర్కర్లు!
