Raghunandan Rao: బీఆర్ఎస్ నేతలపై కవిత చెప్పింది చాలా తక్కువని, ఆమె ఇంకా చాలా విషయాలు చెప్పాల్సిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కవిత చెప్పిన అంశాల్లో కొత్తగా మోకిల ప్రాజెక్ట్ మాత్రమే కొత్తదని ఆయన పేర్కొన్నారు. మోకిల ప్రాజెక్ట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ జరపాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావుపై చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: Prabhas: అనుష్క కోసం ప్రభాస్.. ఇది ప్రేమా లేక ఫ్రెండ్షిప్పా?
హరీష్ రావు రూ.60 లక్షలు పంపింది వాస్తవం
కవిత మాట్లాడిన తీరు చూస్తే ఇక బీఆర్ఎస్(BRS) లోకి తిరిగి వెళ్లే ఉదేశ్యం లేదన్నట్లుగా ఉందని పేర్కొన్నారు. తాను ఎప్పుడో చెప్పిన విషయాలు కవిత ఇప్పుడు మాట్లాడుతోందని రఘునందన్ రావు(Raghunandan Rao) తెలిపారు. దుబ్బాకకు హరీశ్ చేసిన అన్యాయంపై తాను ఆనాడే మాట్లాడినట్లు గుర్తుచేశారు. కవిత ఇదే మాట కొత్తగా చెప్తూ దీనివల్లే ఏదో జరిగిందని భావిస్తున్నారని చురకలంటించారు. దుబ్బాక ప్రజలు హరీశ్ రావుపై వ్యతిరేకతో తనను గెలిపించారని రఘునందన్ (Raghunandan Rao) చెప్పారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాలపై గెలవలేదన్నారు. కవిత మాట్లాడింది నూటికి నూరు శాతం నిజమేనని, కేటీఆర్ ఓటమికి సిరిసిల్లకు హరీశ్ రావు రూ.60 లక్షలు పంపింది వాస్తవమని తెలిపారు.
నవీన్ రావు అక్రమాలకు అడ్డు, అదుపు లేదు
రేవంత్, హరీష్ రావు ఒకే ఫ్లైట్ లో వచ్చారని గతంలో తాను చెప్పానని, అదే విషయాన్ని కవిత చెప్పారే తప్పా అందులో కొత్తేమీ లేదన్నారు. ప్రెస్ మీట్ లో తన పేరు తలిచింది కాబట్టే తాను కవిత పై మాట్లాడుతున్నట్లుగా వెల్లడించారు. కవిత వెళ్తూ వెళ్తూ అందరిపై బురద చల్లి పోదామని అనుకున్నారని వ్యాఖ్యానించారు. టానిక్ పై ఎఫ్ఐఆర్ చిన్న విషయమేనని, నవీన్ రావు అక్రమాలకు అడ్డు, అదుపు లేకుండా పోయిందన్నారు. బీఆర్ఎస్ పెద్దలు చేసిన అవినీతిపై కవిత మరో ప్రెస్ మీట్ లో మాట్లాడుతుందని ఆశిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. కవిత.. సంతోష్ పేరు చెప్పి టాస్క్ ఫోర్స్ డీసీపీ సందీప్ రావు పేరును మర్చిపోయారని వ్యాఖ్యానించారు.
అక్రమాలు ఎన్ని?
సందీప్ రావు తనను చాలా ఇబ్బందులు పెట్టారని రఘునందన్ వెల్లడించారు. ఆయన్ను ముద్దాయిగా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇతను నార్సింగ్ ఏరియాలో చేసిన అక్రమాలు ఎన్ని ఉన్నాయో.. వాటిపై సిట్ అధికారులు విచారణ చేయాలని కోరారు. అసలు ఆయన ఎవరు? ఎక్కడెక్కడ పోస్టింగ్ లు చేశారు? ఆయనకు ప్రధాన ఏరియాలో పోస్టింగ్ ఎవరిచ్చారనే అంశాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం కేసును సీబీఐకి ఎప్పుడో ఇవ్వాల్సిందని రఘునందన్ రావు తెలిపారు. నర్సాపూర్ అడవిని డెవలప్ చేస్తానని హెటిరో ఫార్మా నుంచి సంతోశ్ రూ.10 కోట్లు తీసుకున్నారని, కానీ అక్కడ ఒక్క రూపాయి అభివృద్ధి కూడా జరగలేదని తెలిపారు. లోకల్ ఎమ్మెల్యేకు తెలియకుండా అప్పటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాత్రికి రాత్రే ఒక బోర్డు పాతి వెళ్లారని ఆరోపించారు. కవితను బీజేపీలో చేర్చుకునే అంశంపై స్పందించిన రఘునందన్ రావు.. అవినీతిపరులను బీజేపీ చేర్చుకోదని కరాఖండిగా తెలిపారు.
Also Read: Srisailam Dam: డేంజర్‌లో శ్రీశైలం ప్రాజెక్ట్.. 2 గేట్లకు లీకేజీలు.. భద్రతపై తీవ్ర ఆందోళనలు