- బెంగాల్, ఏపీ ఎన్నికల్లో ఘర్షణలు
- నాలుగో విడత పోలింగ్ 67.71 శాతం
- శ్రీనగర్‌లో మూడు దశాబ్దాల్లో గరిష్టం
- బెంగాల్, ఏపీలో ఉద్రిక్తతలు.. మిగిలిన చోట ప్రశాంతం
- మే 20న ఐదో విడత పోలింగ్
Elections: 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లలో పోలింగ్ వేళ హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మిగిలిన చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసినా పలుచోట్ల ఆ తర్వాత కూడా ఓట్లు వేశారు. 96 నియోజకవర్గాల్లో మొత్తంగా 67.71 శాతం పోలింగ్ నమోదైంది.
పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 75.91 శాతం, మధ్యప్రదేశ్‌లో 68.48 శాతం, జమ్ము కశ్మీర్‌లో 36.58 శాతం, మహారాష్ట్రలో 52.63 శాతం పోలింగ్ నమోదైంది. ఏపీలో 78 శాతం, యూపీలో 57.76 శాతం, తెలంగాణలో 61.29 శాతం పోలింగ్ జరిగింది.
చాలా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగినా.. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ వర్కర్ల మధ్య, ఏపీలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. బెంగాల్‌లో బీరబం, బర్దమాన్- దుర్గాపూర్ సీట్లల్లో ఘర్షణలు చోటుచేసుకోగా.. ఏపీలో పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.
Also Read: ఉరుకుతూ వెళ్లారు..ఉత్సాహంగా చేరారు
జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో శ్రీనగర్ లోక్ సభ నియోజకవర్గానికి పోలింగ్ జరిగింది. ఇక్కడ సాయంత్రం 5 గంటల వరకు 36.58 శాతం పోలింగ్ నమోదైంది. ఇది గత 28 ఏళ్లలో గరిష్టం కావడం గమనార్హం. బుడ్గాం, గందర్బాల్, పుల్వామా, షోపియాన్ జిల్లాలు ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ 2019 లోక్ సభ ఎన్నికల్లో 14.43 శాతం పోలింగ్ నమోదైంది.
తొలి మూడు విడతల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. నాలుగో విడతలో మాత్రం పోలింగ్ శాతం పెరుగుతుందని ఈసీ అంచనా వేసింది. చాలా నియోజకవర్గాల్లో పోలింగ్ రాత్రి వరకు జరిగింది. రాత్రి 11.45 నిమిషాలకు పూర్తి ఓటింగ్ శాతాన్ని వెల్లడిస్తామని ఈసీ పేర్కొంది. తొలి విడతలో 66.14 శాతం, రెండో విడతలో 66.71 శాతం, మూడో విడతలో 65.68 శాతం పోలింగ్ నమోదైంది. ఐదో విడత పోలింగ్ మే 20వ తేదీన జరగనుంది. అన్ని విడతల ఓట్లను జూన్ 4వ తేదీన లెక్కిస్తారు.