Local Body Elections: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలనిర్వహణలో భాగంగా ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జీవో 9ను శుక్రవారం జారీ చేసింది. ఆజీవోను అనుసరించి పంచాయతీరాజ్ శాఖ జీవో ఎంఎస్ నెంబర్ 41ను జారీ చేసి రిజర్వేషన్ల సీలింగ్ ను ఎత్తివేసింది. జడ్పీటీసీ(ZPTC), ఎంపీటీసీ(MPTC), ఎంపీపీ(MPP), జడ్పీ(ZP) లకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు వర్తింపజేయనున్నారు. అదే విధంగా ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC) మహిళల రిజర్వేషన్ల కోసం అన్ని జిల్లాల్లో శనివారం ఆయా జిల్లాల కలెక్టర్లు లాటరీ తీసి ఎంపిక చేయనున్నారు.
మధ్యాహ్నం వరకు రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను అందజేయాలని కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ సూచించింది. జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్లపై గెజిట్ విడుదల చేసిన అనంతరం పంచాయతీరాజ్ శాఖకు అందుకు సంబంధించిన ఫిజికల్ కాపీలను పంపించనున్నారు. ఆకాపీలు అందిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ అధికారులు అన్ని జిల్లాలకు సంబంధించిన సమగ్ర రిజర్వేషన్ వివరాలను ఎన్నికల కమిషన్ కు అందజేయనున్నారు. ఆతర్వాత ఎన్నికల కమిషన్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ జారీ చేయనున్నది.
Also Read: Act Into Force: వ్యక్తిగత డేటా లీక్ చేస్తే కోట్లలో జరిమానా.. అమల్లోకి కొత్త చట్టం
పంచాయతీరాజ్ శాఖ..
అదే విధంగా వార్డు సభ్యులు, సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింప చేస్తూ జీఓ ఎంఎస్ నెంబర్ 42ను పంచాయతీరాజ్ శాఖ జారీ చేసినది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల కోసం మార్గదర్శకాలు జారీచేసింది. ప్రభుత్వం తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడుత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించనున్నది.రాష్ట్రంలో 12760 గ్రామపంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జడ్పీటీసీలు, 5763 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఆ తర్వాత పరోక్ష పద్దతిన 565 ఎంపీపీలు, 31 జడ్పీలకు చైర్మన్లు, చైర్ పర్సన్ల ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఈసీ సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే రిజర్వేషన్లపై జీవోను సైతం జారీ చేసింది. శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశం నిర్వహిస్తుంది. సమావేశానికి హాజరుకావాలని సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, పంచాయతీరాజ్ శాఖ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సమాచారం ఇచ్చింది. సమావేశం అనంతరం ఈసీ కీలక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. నేడు సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నిక షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం.
Also Read: OTT Movie: వైరస్‌తో ప్రపంచం నాశనమైన 28 ఏళ్ల తర్వాత.. ఏం థ్రిల్ ఉంది గురూ..