KTR: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, గత ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం, నేతలు పదేపదే చెబుతున్న ‘కాకి లెక్కల’ డొల్లతనం కాగ్ నివేదిక ద్వారా బట్టబయలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కాగ్ నివేదిక అక్టోబర్ నెల కోసం విడుదల చేసిన లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు అప్పులు వాటికి కడుతున్న వడ్డీలను తన నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొన్నదన్నారు. ప్రతి నెలా రూ. 6,000 నుంచి రూ. 7,000 కోట్లు వడ్డీల కోసమే చెల్లిస్తున్నామని ప్రభుత్వం పదే పదే చెబుతుందన్నారు. కాగ్ లెక్కల ఏప్రిల్ 2025 నుంచి అక్టోబర్ 2025 వరకు ప్రభుత్వం కట్టిన మొత్తం వడ్డీ కేవలం రూ.16,529.88 కోట్లు. అంటే నెలకు సగటున కేవలం రూ. 2,361.41 కోట్లు మాత్రమేనన్నారు.
Also Read:KTR: తెలంగాణ చరిత్రలో గొప్ప ఘట్టానికి గుర్తుగా దీక్షా దివస్: కేటీఆర్
2 లక్షల 30 వేల కోట్ల అప్పులు
పార్లమెంట్ లెక్కల ప్రకారం పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 2.80 లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తే, 23 నెలల కాలంలోనే దాదాపు 2 లక్షల 30 వేల కోట్ల అప్పులను కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందన్నారు. ఆనాడు మిషన్ భగీరథ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, మిషన్ కాకతీయ వేలకోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం వంటి అనేక ఉత్పాదక ఆస్తులను సృష్టించిందన్నారు. కానీ, ఈ ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకం లేకుండానే, ఒక్క ప్రాజెక్టు ప్రారంభం కూడా చేయకుండానే, కనీసం మౌలిక వసతుల కోసం ఒక్క ఇటుక పేర్చకుండానే 2 లక్షల 30 వేల కోట్ల అప్పులు తీసుకువచ్చి ఏం చేసిందని ప్రశ్నించారు.
ఏ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశారో వెంటనే వివరాలు చెప్పాలి
గత 23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్ఆర్‌బీఎం పరిధి దాటి తెచ్చిన రూ. 2.23 లక్షల కోట్ల అప్పులు ఏ ఏ పథకాలకు, ఏ ఏ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశారో వెంటనే వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అప్పుల పేరు చెప్పి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను, 420 హామీలను అమలు చేయకుండా తప్పించుకుంటే కుదరదని, కాంగ్రెస్ పార్టీ చెబుతున్న అప్పుల కాకి లెక్కలు ప్రజలు నమ్మరన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అప్పులతో ప్రజలకు సంక్షేమ పథకాలను రాష్ట్ర భవిష్యత్తు కోసం మౌలిక వసతుల నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టాలని డిమాండ్ చేశారు.
Also Read: KTR on Land Scam: దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు
