Seethakka: మైనార్టీలను కాంగ్రెస్ మోసం చేసిందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క (Seethakka) గట్టి కౌంటర్ ఇచ్చారు. ముస్లింలకు మేలు చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. అన్ని మతాలను సమానంగా గౌరవించే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, దేశ ఏకత్వం, సమానత్వం కోసం ఎప్పుడూ అగ్రగామిగా నిలిచిందని గుర్తు చేశారు. ‘మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాయి.
మౌలానా ఆజాద్ స్కాలర్‌షిప్‌లను అమలు
కేంద్రంలో మైనార్టీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను 2006లో ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. మైనార్టీల వెనకబాటు తనాన్ని అధ్యయనం చేయడానికి జస్టిస్ సచ్చార్ కమిటీని ఏర్పాటు చేసి, వారి అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను ప్రారంభించింది. తెలంగాణలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ రిజర్వేషన్ల వల్ల వేలాది మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు, ఉద్యోగులుగా ఎదిగే అవకాశం పొందారు. ఉన్నత విద్యలో కొనసాగుతున్న విద్యార్థుల కోసం మౌలానా ఆజాద్ స్కాలర్‌షిప్‌లను అమలు చేసింది కూడా కాంగ్రెస్” అని మంత్రి పేర్కొన్నారు.
12 శాతం రిజర్వేషన్ ఇస్తాం
బీఆర్ఎస్ ముస్లింలకు, మైనార్టీలకు చేసినదేమీ లేదని, 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని మోసం చేసిన పార్టీగా ప్రజలు గుర్తించారని మంత్రి అన్నారు. జూబ్లీహిల్స్ లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ, అన్ని మతాలకు సమాన గౌరవం ఇచ్చే పార్టీ అని తెలిపారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతున్న వారందరినీ స్వాగతిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితమై సిరాజ్ పార్టీకి చేరడం సంతోషకరమని పేర్కొన్నారు. పదేళ్లు పవర్ లో ఉన్నా.. చెప్పుకునే అభివృద్ధి బీఆర్ఎస్ కు దొరకడం లేదన్నారు. నవీన్ కు ఒక్క అవకాశం కల్పిస్తే..అభివృద్ధి ఏమిటో కాంగ్రెస్ చూపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి తదితరులు ఉన్నారు.
Also Read: Seethakka: ఏడాదిన్నరలోనే 80 వేల కొలువులు ఇచ్చాం.. పదేళ్ల నిరీక్షణకు ఇప్పుడు ఫలితం : మంత్రి సీతక్క
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు.. మంత్రి సీతక్క
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున మత్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని మంత్రి సీతక్క కోరారు. మొంథా తుఫానుపై ఆధికారులతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మహబూబాబాద్, ములుగు జిల్లా అధికారులతో పాటు పంచాయతీరాజ్ అధికారులతోనూ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంథా తుఫాను నేపథ్యంలో తలెత్తే పరిణామాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగ సీతక్క మాట్లాడుతూ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, అత్యవసర చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. చలిగాలులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
రైతులు, పశువుల కాపరులు తమ పశువులు, పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు వాగులు, చెరువులు దాటే ప్రయత్నం చేయరాదని, నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరారు. పలు చోట్ల రైళ్లు నిలిచిపోయినట్లు సమాచారం అందుతున్న నేపథ్యంలో, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు ఆహారం, తాగునీరు వంటి అవసరాలు తీర్చాలని సూచించారు. తుఫాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని కోరారు.
