KTR ( image credit: swetcha reporteR)
Politics, లేటెస్ట్ న్యూస్

KTR: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మూసీకి వరదలు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మూసీకి వరదలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. 1,50,000 కోట్ల దోపిడీ కోసమే హైదరాబాద్ (Hyderabad) ప్రజలను ప్రభుత్వం మూసీ వరదలో ముంచిందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం కిరాతక మనస్తత్వంతోనే వేలాది ప్రజల ఇండ్లు, ఆస్తులు మూసీ వరదలో చిక్కుకున్నాయని మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో శనివారం కొడంగల్ కు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్‌లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో దోపిడీ

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ కు వరద ముప్పును తగ్గించేందుకు వందేళ్ల క్రితం నిజాం ప్రభుత్వం నిర్మించిన ఉస్మాన్ సాగర్, గండిపేట చెరువులను వాతావరణ శాఖ హెచ్చరికలు రాగానే ఖాళీ చేసి మూసీ వరద నీటిని నిల్వ చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. కానీ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో దోపిడీకి పాల్పడేందుకు ఆ ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయాలన్న దురుద్దేశంతో ప్రభుత్వం ఆ చెరువులను ఖాళీ చేయించలేదని ఆరోపించారు. అందుకే చరిత్రలో తొలిసారిగా ఇమ్లిబన్ బస్టాండ్‌ను వరద ముంచెత్తిందన్నారు. కొడంగల్ ప్రజలు ఎలాగైనా కాంగ్రెస్ ను ఓడించాలని కంకణం కట్టుకుని ఉన్నారన్నారు. కొడంగల్‌ లో వస్తున్న వ్యతిరేకతను గుర్తించిన రేవంత్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమన్నారు.

 Also Read: Minister Sridhar Babu: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్: మంత్రి శ్రీధర్ బాబు

కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మంచి పని కూడా చేయలేదు 

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు. రాహుల్, రేవంత్, భట్టి సంతకంతో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు.కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లు వేసేటప్పుడు రైతుబంధు పైసలు పడేవన్న కేటీఆర్, రేవంత్ రెడ్డి మాత్రం ఓట్లు వేసేటప్పుడు మాత్రమే రైతుబంధు పైసలు వేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఉద్దేశంతో 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి పక్కన పెట్టారని ఆరోపించారు.

అదే సమయంలో కమీషన్ల కోసం 4500 కోట్లతో కొడంగల్‌ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మొదలుపెట్టారని విమర్శించారు. అయితే అల్మట్టి ఎత్తు పెంచితే జూరాల ప్రాజెక్టు కు చుక్క నీళ్లు కూడా రావని, కేవలం కమిషన్ల కోసమే ఈ పనులను మెగా కృష్ణారెడ్డికి, శ్రీనివాస్ రెడ్డికి అప్పజెప్పారని ఆరోపించారు. అయితే రేవంత్ రెడ్డి దోపిడీ కోర్టుకు అర్థమయి, ఆ పనులకు స్టే ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ బుద్ధి చెప్పడానికి మూడేళ్లు ఎదురుచూడాల్సిన అవసరం లేదని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కొడంగల్‌లో స్విచ్ బంద్ చేస్తే ఢిల్లీలో లైట్లు బంద్ అవుతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని గెలిపిస్తే ప్రమోషన్ ఇస్తామని, కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసే జైత్రయాత్ర కొడంగల్ నుంచే మొదలుపెట్టాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ మోసాలను వివరించేందుకు ‘బాకీ కార్డ్’ ఉద్యమం

అధికారం కోసం అడ్డమైన హామీలిచ్చి, గద్దెనెక్కిన తర్వాత వాటిని గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించింది. తెలంగాణ భవన్‌లో శనివారం కేటీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తదితరులతో కలిసి‘బాకీ కార్డు’పోస్టర్ ను విడుదల చేశారు. కాంగ్రెస్ చేసిన మోసాలే నేడు ప్రజల చేతిలో పాశుపతాస్త్రాలుగా మారాయన్నారు. రాబోయే పంచాయతీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ది చెప్పాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటి తలుపుతట్టి, కాంగ్రెస్ బాకీల బండారాన్ని ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ కార్డుకు విరుగుడే ఈ ‘బాకీ కార్డు’ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన దోఖాకు బదులు తీర్చుకునే సరైన మోకా తెలంగాణ ప్రజలకు వచ్చిందన్నారు.

కాంగ్రెస్‌ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి

ఏ వర్గానికి కాంగ్రెస్ ఎంత బకాయి పడ్డదో నిలదీసి నిగ్గదీసి అడగడానికే ఈ బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. రాష్ట్రస్థాయి నాయకుల నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్డును ఇంటింటికీ తీసుకెళ్తారని చెప్పారు. వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్‌ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మోసపోతే గోస పడతామని ఎన్నికలకు ముందు కేసీఆర్ పదే పదే చెప్పారు, అదే ఇవాళ నిజమైందన్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు.. ఇలా అన్ని వర్గాల ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అచ్చంపేట నియోజకవర్గం, చారగొండ మాజీ ఎంపీపీ, సర్పంచ్ గుండె నిర్మల – విజేందర్ గౌడ్ దంపతులు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 

Also Read: Sonam Wangchuk: పాక్ ఇంటెలిజెన్స్‌కు టచ్‌లో సోనమ్ వాంగ్‌చుక్!.. వెలుగులోకి సంచలనాలు

Just In

01

Medak Heavy Rains: ఆ జిల్లాల్లో దంచికొట్టిన వర్షం.. జలదిగ్బంధంలో ఏడుపాయల దుర్గమ్మ ఆలయం

Cyber Crime: డిజిటల్ అరెస్ట్ పేరిట బెదిరింపు.. గుండెపోటుతో బాధితురాలి మృతి

Mirai Movie: మరో ఆఫర్ ప్రకటించిన ‘మిరాయ్’ నిర్మాత.. పండగ కానుక అదిరింది!

Hydra: వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన హైడ్రా!

TVK Rally Stampede: తమిళ హీరో విజయ్ ర్యాలీలో భారీ తొక్కిసలాట.. పెద్ద సంఖ్యలో మరణాలు