MP Nama | పోటీ నుంచి నామా తప్పుకున్నారని వార్తలు
Khammam BRS Candidate Nama Has Dropped Out MP Seat
Political News

MP Nama : పోటీ నుంచి నామా తప్పుకుంటారా..?

– నామా పోటీ నుంచి తప్పుకున్నారని వార్తలు
– ప్రచారం ఆరంభించకపోవటంపై అనుమానాలు
– అయోమయంలో గులాబీ పార్టీ శ్రేణులు
– కావ్య బాటలో నామా తప్పుకుంటే.. పరిస్థితేంటనే చర్చ

Khammam BRS Candidate Nama Has Dropped Out MP Seat: లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీకి ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అనంతర పరిణామాలు తలనొప్పిగా మారుతున్నాయి. వరంగల్ సీటును సీనియర్ నేత, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు బీఆర్ఎస్ కేటాయించగా, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తాను పోటీలో నిలవనని ప్రకటించి తప్పుకున్న సంగతి తెలిసిందే. కుమార్తె బాటలోనే శ్రీహరి కూడా పయనించటంతో వరంగల్ అభ్యర్థి కోసం తిరిగి వెతుక్కోవాలనే పరిస్థితి. ఒకరోజు వ్యవధిలో సరిగ్గా ఇదే పరిస్థితులు ఖమ్మం సీటు విషయంలోనూ తలెత్తటంతో బీఆర్ఎస్ అధినాయకత్వం ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతోంది.

లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనలో భాగంగా ఖమ్మం సీటును ఇప్పటికే నామా నాగేశ్వర రావు పేరును బీఆర్ఎస్ ప్రకటించింది. ఆయన పేరు ప్రకటించి దాదాపు నెల రోజులు అవుతున్నా ఇంకా ఆయన ప్రచారం మొదలుపెట్టనే లేదు. కనీసం ప్రచారానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్న వాతావరణం కూడా కనిపించకపోవటంతో ఖమ్మం పరిస్థితిపై లోకల్ నేతలు అధిష్ఠానాన్ని నిలదీశారు. ఒక దశలో ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య కుదిరిన పొత్తులో భాగంగా ఖమ్మం సీటును బీజేపీకి కేటాయిస్తారని, అక్కడ నామాను బరిలో దించుతారనే వార్తలు వచ్చాయి. కానీ, ఖమ్మం సీటును బీజేపీ తాండ్ర వినోద్ రావుకు కేటాయించటం, ఆయన ప్రచారం మొదలుపెట్టటంతో అవన్నీ పుకార్లేనని తేలిపోయింది. కుమారుడి వివాహ పనుల్లో బిజీగా ఉండటం వల్లనే తమ నేత ఇంకా ప్రచారం మొదలుపెట్టలేదని నాగేశ్వరరావు అనుచరులు వివరణ ఇచ్చినా, ఖమ్మం బీఆర్ఎస్‌లో కొనసాగుతున్న వర్గపోరు, నేతల మధ్య అనైక్యత కారణంగా పోటీపై నామా పునరాలోచనలో పడ్డారని, పోటీ నుంచి తప్పుకున్న వరంగల్ అభ్యర్థి కావ్య బాటలోనే నామా పయనించనున్నారనే వార్తలు వస్తున్నాయి.

Read Also: సుపరిపాలన

అయితే.. ఖమ్మం బరి నుంచి నామా నాగేశ్వరరావు తప్పుకుంటే ఆయనకు ఖమ్మం సీటు ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ ఉందనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఖమ్మం లోక్‌సభ పరిధిలోని ఏడు స్థానాల్లో ఆరింటిని కాంగ్రెస్ గెలవటం, కొత్తగూడెంలో మిత్రపక్షమైన సీపీఎం గెలుపుతో ఇక్కడ ఎవరికి సీటిచ్చినా గెలుపు ఖాయమనే వాతావరణం నెలకొన్నందున ఈ సీటుకు కాంగ్రెస్‌లో గట్టిపోటీ ఏర్పడింది. ఈ టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి, మంత్రులు తుమ్మల, పొంగులేటి కుటుంబ సభ్యులు రేసులో ఉన్నందున వీరిలో ఎవరికి ఇచ్చినా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందనీ, దీనిని కొత్త వ్యక్తికి ఇవ్వాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ మారి నామా నాగేశ్వరరావు వస్తే, ఆయనకు ఈ సీటు ఇవ్వొచ్చని, చేవెళ్ల, మల్కాజిగిరిలో ఇప్పటికే కాంగ్రెస్ ఈ ప్రాతిపదికన సీట్లు కేటాయించిందనీ రాజకీయ విశ్లేషకులు భావిస్తు్న్నారు.

Just In

01

Bigg Boss Telugu 9: ఐదుగురు హౌస్‌మేట్స్‌తో ఎమోషనల్ డ్రామా మొదలైంది.. సంజన, తనూజ ఔట్!

MyGHMC App: ‘మై జీహెచ్ఎంసీ’ యాప్‌లో చక్కటి ఫీచర్.. మీ చుట్టూ ఉన్న సౌకర్యాలు ఇట్టే తెలుసుకోవచ్చు

Funky: విశ్వక్ ‘ఫంకీ’ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. వాలెంటైన్స్ వీకెండ్ టార్గెట్‌గా!

VV Vinayak: ‘ఉస్తాద్‌ భగత్ సింగ్‌‌’లో వివి వినాయక్.. ఈ ఫొటోకి అర్థం అదేనా?

Jio New Year offers: హ్యాపీ న్యూఇయర్ ప్లాన్స్ ప్రకటించిన రిలయన్స్ జియో