Telangana Good Governance In India Cm Revanth Reddy
Politics

CM Revanth Reddy : సుపరిపాలన

– ట్యాపింగ్ చేశామని కేటీఆర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు
– కొందరివే చేశామంటే దాని అర్థం ఏంటి?
– ట్యాపింగ్‌కు పాల్పడిన వారికి చర్లపల్లి జైలే
– బీఆర్ఎస్ పాలనలో అంతా విధ్వంసమే
– ఉద్యోగులకు ఒకటవ తేదీనే జీతాలిస్తున్నాం
– కొత్త ఉద్యోగాలను భర్తీ చేసుకుంటున్నాం
– వంద రోజుల్లోనే మంచి పాలన అందించాం
– వాల్మీకి బయోలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

Telangana Good Governance In India Cm Revanth Reddy: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గాంధీ భవన్‌లో వాల్మీకి బోయలతో ఆయన సమావేశమయ్యారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసానిచ్చారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత సంక్షేమంలో, అభివృద్ధి, విద్యలో సముచిత స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని తెలిపారు. వాల్మీకి బోయలు కాంగ్రెస్‌కు అండగా నిలబడాలని, వంద రోజుల్లో మంచి పరిపాలన అందించామని వివరించారు.

పరిపాలనలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని అన్నారు రేవంత్ రెడ్డి. వంద రోజులు పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు. మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వంపై ఉద్యోగులు విశ్వాసం కోల్పోయారని చెప్పారు. ఉద్యోగులకు మొదటి తారీఖు జీతాలు ఇచ్చి తాము విశ్వాసం కల్పించామని చెప్పుకొచ్చారు. గడీలను బద్దలు కొట్టి ప్రజా పాలన తీసుకొచ్చామని తెలిపారు రేవంత్. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి భయపడేలా ఉండకూడదని అన్నారు.

Read Also : బీఆర్‌ఎస్ పార్టీ త్వరలో ఖాళీ

గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌తో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిందని విమర్శించారు. కొద్ది మందివే విన్నామని సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలా బరి తెగించి ఎవరైనా మాట్లాడుతారా? అని అడిగారు. కేటీఆర్ అతిగా మాట్లాడుతున్నారని, దాని ఫలితం ఆయన అనుభవిస్తారని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వాళ్లు చర్లపల్లి జైలులో ఊచలు లెక్కబెడతారని అన్నారు. భారీ ఆధిక్యంతో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ గెలవబోతున్నామని, బీజేపీ, బీఆర్ఎస్ గూడుపుఠానీ చేయకపోతే ఆలంపూర్, గద్వాల గెలిచే వాళ్లమని చెప్పారు.

బీజేపీలో ఉన్న డీకే అరుణ ఆర్డీఎస్ ద్వారా కర్ణాటక నుంచి నీళ్లు తెచ్చారా? తుమ్మిళ్ల ప్రాజెక్టు పూర్తి చేశారా? జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి తెచ్చుకున్న ఆమె పాలమూరు రంగారెడ్డికి ఎందుకు జాతీయ హోదా తీసుకురాలేదు? బీజేపీ, బీఆర్ఎస్ కాంగ్రెస్‌ను దొంగ దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నాయంటూ ఫైరయ్యారు. ఏం ముఖం పెట్టుకుని మహబూబ్ నగర్‌లో బీజేపీ నేతలు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.