BRS: బీఆర్ఎస్ పార్టీ బీసీల రాగం అందుకోవడం వెనుక మైండ్ గేమ్ ఉందనే వాదన జరుగుతున్నది. ఢిల్లీలో రాష్ట్రపతిని కలుస్తామని కేసీఆర్ సైతం వస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ బీసీ రిజర్వేషన్ల పోరు బాటలోకి కేసీఆర్ ఎంట్రీ ఎప్పుడు? రాష్ట్రపతిని కలుస్తారా? కేవలం బీసీ వర్గాలను ఆకర్షించేందుకు రంగంలోకి దిగుతారా? స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్‌గా పెట్టుకున్నారా? రాజకీయంగా కాంగ్రెస్,(Congress) బీజేపీలను ఇరుకున పెట్టి రెండు జాతీయ పార్టీలను బూచిగా చూపించనున్నారా? ఇంతకు అసలు ఢిల్లీకి కేసీఆర్( KCR)వెళ్తారా? లేకుంటే బీసీలను మభ్యపెట్టేందుకే మైండ్ గేమ్ ఆడుతున్నారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Also Read: Leopard Attack: శ్రీశైలంలో చిరుత కలకలం.. చిన్నారిని ఈడ్చుకెళ్లి.. ఊరి చివర వదిలేసింది!
సెప్టెంబర్ 30 డెడ్ లైన్
రాష్ట్రంలో ప్రస్తుతం బీసీలకు 42శాతం రిజర్వేషన్ల ప్రక్రియ హాట్ టాపిక్‌గా మారింది. అత్యధిక జనాభా ఉన్న బీసీ వర్గాల ప్రజల ఓట్లే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. రాష్ట్రంలో సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు డెడ్ లైన్ విధించింది. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కాంగ్రెస్(Congress) హామీ మేరకు అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపించింది.
దీంతో పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టాలని, కేబినెట్ ఆర్డినెన్సుపై రాష్ట్రపతి సంతకంతో రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో హస్తినలో కాంగ్రెస్ పోరుబాట నిర్వహించింది. కాంగ్రెస్ తీరుపై మండిపడుతూ 20 నెలలుగా జాప్యం చేస్తూ ఇప్పుడు పోరుబాట చేయడమేంటని బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెట్టింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా బీసీలను పట్టించుకోవడం లేదని దీంతో కాంగ్రెస్, బీజేపీలే టార్గెట్‌గా కేసీఆర్‌తో యాక్షన్ ప్లాన్ చేశారని గులాబీ నేతలు పేర్కొంటున్నారు. బీసీ రిజర్వేషన్ల సాధనకై హస్తినకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు ముఖ్య నేతలంతా పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం ఊపందుకున్నది.
రెండు పార్టీలను ఇరికించే ప్లాన్
ఇప్పటికే కాంగ్రెస్(Congress) తెచ్చిన ఆర్డినెన్స్ ద్వారా కాకుండా చట్టబద్దంగా రిజర్వేషన్ల సాధనకై ఇందిరా పార్క్ వద్ద బీసీ ధర్నా నిర్వహించారు. ఆ ధర్నాతో కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకురావడంలో సక్సెస్ అయ్యామని బీఆర్ఎస్(brs) భావిస్తున్నది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్(Brs) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్(BRS) బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ముమ్మరం చేస్తున్నది.
ఒకవైపు బీసీ రిజర్వేషన్ల బిల్లు, (BC Reservations) ఆర్డినెన్సులపై మత కోణంలో చూస్తూ ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు(BC Reservations) ఎందుకని బీజేపీ(bjp) ప్రశ్నిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని, మరోవైపు కాంగ్రెస్ సహితం ఆర్డినెన్సు పేరుతో ఢిల్లీలో డ్రామాలు చేస్తూ బీసీలను మోసం చేస్తున్నదని, రెండు పార్టీల నిజస్వరూపాన్ని బయటపెట్టాలని బీఆర్ఎస్(brs) యోచిస్తున్నది. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే టార్గెట్‌గా కేసీఆర్‌ను హస్తినకు తీసుకెళ్లాలనే పార్టీ నేతలు లక్ష్యంతో ఉన్నారు. ఫాంహౌస్‌లో కేసీఆర్(KCR)తో ఈ మధ్యకాలంలో కేటీఆర్, హరీశ్‌తో పాటు బీసీ సీనియర్ నేతలు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. కేసీఆర్‌తో కలిసి రాష్ట్రపతిని కలిస్తే పార్టీకి మైలేజ్ వస్తుందని, రాబోయే ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గ ప్రజలకు పార్టీ మరింత దగ్గరయ్యే సువర్ణావకాశం ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
కేసీఆర్ బయటకొస్తారా?
మరోవైపు, కేసీఆర్ హస్తిన టూర్‌కు వెళ్తారా లేదా అనేది కూడా చర్చకు దారితీసింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన దగ్గర నుంచి ఆయన ఢిల్లీ వెళ్లలేదు. ఎవరినీ కలిసిన దాఖలాలు లేవు. ప్రజా సమస్యలపై ఉద్యమ బాట పట్టిన సందర్భాలూ లేవు. కేవలం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రచార సభల్లో పాల్గొన్న కేసీఆర్, ఆ తర్వాత ఒక్క నల్లగొండలో జరిగిన సభకు మాత్రం హాజరయ్యారు. ఆ తర్వాత పార్టీ నేతలతో భేటీలకే పరిమితం అయ్యారు. ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు గుప్పించిన దాఖలాలు లేవు. పోరాట బాటపట్టిన రోజులు లేవు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలుస్తారా లేదా అనేది హాట్ టాపిక్ అయింది. అధినేత వెళ్తే పార్టీ కేడర్ లో మరింత జోష్ పెరగడంతో పాటు రాబోయే ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి లాభం చేకూరుతుందని పలువురు నేతలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. ఈ తరుణంలో బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేసి సాధిస్తారా? కేసీఆర్ ఎంట్రీతో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో కదలిక వస్తుందా? అనేది చూద్దాం.