Bandi Sudhakar Goud: బీసీలను రౌడీలు అనడం కేసీఆర్ దొరకు అలవాటేనని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ విమర్శించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబాన్ని రౌడీ కుటుంబం అని కేసీఆర్ అగ్రకుల దురహంకారంతో మాట్లాడటం తగదని తీవ్రంగా ఖండించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల కేసీఆర్ దొర పాలనలో నవీన్ యాదవ్ పై ఎన్ని కేసులున్నాయో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కొత్త రూల్స్.. రాజకీయ పార్టీలకు ఈసీ కీలక సూచనలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు
ఉప ఎన్నిక జరుగుతున్న ఈ సమయంలో రౌడీషీటర్లను, పోక్సో కేసులున్న వారిని బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారో కేసీఆరే సమాధానం చెప్పాలన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలను సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, ప్రజల ఆదరణ పొందుతుంటే ఓర్వలేకనే ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ సంపదను రాబందుల్లా దోచుకున్న కేసీఆర్ కుటుంబీకులు, ఖజానాను ఖాళీ చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించారని ఆయన దుయ్యబట్టారు. కేంద్రంలోని బీజేపీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలతో ఆదరణ కోల్పోయిందన్నారు. ఓట్ల కోసం జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి వచ్చే బీఆర్ఎస్, బీజేపీ నాయకులను ప్రజలు నిలదీయాలని, అధికార కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలని బండి సుధాకర్ గౌడ్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కెనడీ, జాన్, జోసెఫ్, పీటర్, చందు తదితరులు పాల్గొన్నారు.

