KCR Meeting: గులాబీ అధినేత కేసీఆర్(KCR) వరుసగా ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. ఏం చర్చిస్తున్నారనేది మాత్రం సస్పెన్స్‌గా ఉంచారు. పార్టీని గాడిలో పెడతారా, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యచరణ చేపడుతున్నారా, ఇప్పటికే గులాబీ పార్టీ బీజేపీలో విలీనం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఏ ప్రణాళికలతో ముందుకెళ్తారనేది చర్చకు దారితీసింది. ఏయే అంశాలతో ప్రజల్లోకి వెళ్లనున్నారు, ఇప్పటి నుంచే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమయ్యే ప్లాన్ చేస్తున్నారా అనేది కూడా హాట్ టాపిక్ అయింది.
Also Read: Gadwal: గురుకుల హాస్టల్ సిబ్బందిపై వేటు
ఫాంహౌస్‌లో మంతనాలు
ఎర్రవెల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్ (KCR) పార్టీలో కీలకంగా ఉన్న కేటీఆర్,(KTR) హరీశ్ రావు,(Harish Rao)జగదీశ్ రెడ్డితో పాటు సీనియర్ నేతలతో భేటీ అవుతున్నారు. గత వారం రోజులుగా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తుండడంతో హాట్ టాపిక్ అయింది. ఎందుకు భేటీ అవుతున్నారు, సమావేశంలో ఏయే అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు, ఎప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్తారు, పార్టీ బలోపేతంపై ఎప్పటి నుంచి దృష్టి సారిస్తారనే అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు సమాచారం. వ్యవసాయ రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదే విధంగా బనకచర్ల ప్రాజెక్టు, కాళేశ్వరం, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. అయితే, బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో పోరాట కార్యక్రమాలు చేపట్టలేదు. పార్టీ బలోపేతానికి ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తారనేది ఇప్పుడు చర్చకు దారితీసింది.
జగదీశ్ రెడ్డికి ప్రమోషన్
ఈ మధ్యకాలంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని కేసీఆర్, (KCR) కేటీఆర్(ktr) ప్రమోట్ చేస్తున్నారు. గతానికి భిన్నంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై నల్లగొండ ఉమ్మడి జిల్లాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వంపై ఘాటుగా స్పందిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం అంతా కాంగ్రెస్ వెన్నంటి ఉండడంతోనే బీఆర్ఎస్ పార్టీవైపు మళ్లించేందుకు జగదీశ్ రెడ్డిని ప్రమోట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. దీనికి తోడు సమావేశాల వేదికపైనా కేటీఆర్ సైతం పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే వరుస సమావేశాల్లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభ తేదీలపై క్లారిటీ రాలేదని సమాచారం. జూన్ లోనే సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామని కేటీఆర్ సైతం ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు చేపట్టలేదు. కమిటీలపైనా స్పష్టత రాలేదని తెలిసింది.
కవిత సంగతేంటి?
కేసీఆర్ వద్ద ఎమ్మెల్సీ కవిత(Kavitha) అంశం ప్రస్తావనకు రాలేదని సమాచారం. ఆమె వరుస కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి వెళ్తున్నప్పటికీ కనీసం చర్చించలేదని, ఆమెను కావాలని దూరం పెట్టారనే ప్రచారం జరుగుతున్నది. ఇక, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశంపై ఏపీ ఎంపీ సీఎం రమేశ్ ఈ మధ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దూమారం రేపాయి. తాజా రాజకీయాలపై చర్చిస్తున్న కేసీఆర్ వద్ద ఈ వ్యాఖ్యలు సైతం చర్చకు వచ్చినట్లు సమాచారం. వాటిని పట్టించుకోవద్దని, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అండగా నిలడుతుందని ఏపార్టీలో విలీనం ప్రసక్తే లేదని మరోసారి కేసీఆర్ తేల్చినట్లు సమాచారం.
ప్రిపేర్ చేస్తున్నారా?
కేసీఆర్(KCR) రోజురోజుకు శారీరకంగా వీక్ అవుతున్నారనే ప్రచారం ఊపందుకుంటున్నది. గతంలో ఉన్నంత యాక్టీవ్‌గా లేరని, అందుకే కేటీఆర్,(KTR) హరీశ్ రావు, జగదీశ్ రెడ్డిలతో భేటీ అవుతూ రాజకీయ మెళకువలు చెబుతున్నారని సమాచారం. ప్రధాన ప్రతిపక్షంగా ఏం చేయాలి, ప్రజల్లోకి ఏయే అంశాలపై వెళ్లాలి, ప్రభుత్వానికి ఎలా ఇరుకున పెట్టాలి, ప్రజా సమస్యలపై ఎలా స్పందించాలి, రాజకీయ నేతలకు ఉండాల్సిన లక్షణాలు, ఇలా ప్రతి అంశాన్ని వివరిస్తున్నట్లు సమాచారం. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై ఉద్యమ కార్యచరణపైనా ప్లానింగ్ ఇస్తున్నట్లు తెలిసిది. ఏది ఏమైనప్పటికీ రాబోయే స్థానిక సంస్థల్లో మెజార్టీ సీట్ల సాధన కోసం బీఆర్ఎస్ ఏయే అంశాలతో ప్రజల్లోకి వెళ్తుందనేది ఇప్పుడు కేడర్‌లో చర్చకు దారితీసింది.
Also Read: Child Marriage: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. 13 ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో వివాహం!