Kavitha( image CREDIT: SWETCHA REPORTER OR TWITTER)
Politics

Kavitha: ఈ ఇద్దరి అవినీతి వల్లే కేసీఆర్‌పై సీబీఐ విచారణ.. కవిత సంచలన కామెంట్స్

Kavitha: మేకవన్నె పులులు మాజీ మంత్రి హరీష్ రావు,(Harish Rao) మాజీ ఎంపీ సంతోష్ రావు(Santhosh Rao) లు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) అన్నారు. ఆ ఇద్దరి అవినీతి వల్లే మా నాన్న కేసీఆర్ ‌పై సీబీఐ విచారణ అని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్(Hyderabad) లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో  మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నుంచి సస్పెండ్ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ పదవికి, బీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

నాన్నా దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతోందో చూసుకోండి. నేను కూడా మీలా ముక్కుసూటి మనిషిని కాబట్టి నన్ను పార్టీ నుంచి బయటకు పంపి బలిచేశారు.  రేపు మీకు, రామన్నకు కూడా ఇలాంటి ప్రమాదమే పొంచి ఉందని, బీఆర్‌ఎస్‌ పార్టీ(BRS Party)ని హస్తగతం చేసుకునేందుకు కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే నన్ను పార్టీ నుంచి బయటకు పంపారని’ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌తో నాది కుటుంబం.. రక్త సంబంధం అని స్పష్టం చేశారు. పదవులు, పార్టీతో ముడిపడిన బంధం మాది కాదని వెల్లడించారు. కానీ పార్టీలో ఉంటూ డబ్బులు సంపాదించుకుని వ్యక్తిగత లబ్దిపొందాలనే వ్యక్తులకు మేము బాగుండటం ఇష్టం లేదని, మా కుటుంబం విఛ్చిన్నమైతేనే వారికి అధికారం వస్తుందనే నన్ను బయటకు పంపారని, ఇది ఇంతటితో ఆగదని కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.

 Also Read: Kavitha: గులాబీ నేతల్లో కవిత బాంబులు.. ఎవరి పేరు బయటపడుతుందో భయం?

తెలంగాణ నినాదం బీఆర్ఎస్ కు వ్యతిరేకమా?

నాపై అక్రమ కేసులు పెట్టి తీహార్ జైల్లో ఐదున్నర నెలలు ఉంచారు. బయటకు రాగానే 2024, నవంబర్ 23తేదీ నుంచి ప్రజా క్షేత్రం లోకి వచ్చి అనేక కార్యక్రమాలు చేస్తున్నాను నేను చేసిన పనుల్లో మొట్ట మొదటిదని ఓ బిడ్డ హాస్టల్‌లో చనిపోతే అక్కడి వెళ్లాను. గురుకులాల్లో జరుగుతున్న అక్రమాల గురించి మాట్లాడాను. బీసీ లకు జరుగుతున్న అన్యాయం గురించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన 42 శాతం హామీ కోసం పెద్ద ఎత్తున పని చేశా మహిళలకు 2500 ఇవ్వాలని పోస్టు కార్డు ఉద్యమం చేశాను’ అని అన్నారు. సామాజిక తెలంగాణకోసం కట్టుబడి ఉన్నా దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇది కాదా సామాజిక తెలంగాణ నినాదం బీఆర్ఎస్ కు వ్యతిరేకమా? బంగారు తెలంగాణ అంటే ఏంది? ప్రతి సమాజం బాగుంటేనే సమాజిక తెలంగాణ సాధ్యం’ అన్నారు.

నాకు జన్మనిచ్చి ప్రాణభిక్ష పెట్టిన నా తండ్రి

47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అనుమతితో గులాబీ జెండా కండువా కప్పుకుని ప్రజా సమస్యలు, అంశాలపై పోరాటం చేశానన్నారు. నాకు జన్మనిచ్చి ప్రాణభిక్ష పెట్టిన నా తండ్రి చిటికెన వేలు పట్టుకుని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన నేను సామాజిక తెలంగాణ కోరుకోవడం కొందరికి నచ్చలేదన్నారు. హరీష్‌రావు,,(Harish Rao) సంతోష్‌ నాపై పనికట్టుకుని సామాజిక తెలంగాణ పేరిట పార్టీ పెడుతున్నట్లు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్‌, సంతోష్‌ ఇళ్లలో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా?. నా మీద జరుగుతున్న కుట్రల విషయంలో తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టినా పార్టీ వర్కింగ్‌ ‍ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించలేదని అన్నారు. మీ చెల్లి, మహిళా ఎమ్మెల్సీని అయిన నాపై కుట్రలు జరుగుతున్నాయంటే బేటా ఏమైందని నాకు ఫోన్‌ చేయరా.

కేసీఆర్‌ నుంచి నేను స్పందన కోరుకోలేదు, కానీ మీరు స్పందించాలి కదా? రామన్నా.. నా మీద ఎవరేం చెప్పారో తెలియదని, నా ప్రాణం పోయినా కేసీఆర్‌, కేటీఆర్‌కు హాని జరగాలని కోరుకునే ఆడపిల్లను కాదన్నారు. ఎన్ని జన్మల పుణ్యముంటే కేసీఆర్‌ లాంటి తండ్రి నాకు దొరికాడు. పార్టీకి ద్రోహం చేస్తున్న వారిని ఎందుకు క్షమిస్తున్నారన్నదే నా ఆవేదన అని పేరకొన్నారు. కేసీఆర్‌ ఆరోగ్యాన్ని, పార్టీని కాపాడుతూ ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కోరుకుంటున్నట్లు వెల్లించారు.

హరీష్‌, సంతోష్‌ మీతో బాగున్నట్లు నటించవచ్చు

హరీష్‌రావు, సంతోష్‌ పాల్పడిన అవినీతి వల్లే మా నాన్న కేసీఆర్‌పై సీబీఐ విచారణ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సీఎం రేవంత్‌(‘CM Revanth)తో కలిసి హరీష్‌ హైదరాబాద్‌ ఢిల్లీ విమాన ప్రయాణంలో కలిసి కాళ్లు పట్టుకున్న నాటి నుంచి మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు మొదలయ్యాయని తెలిపారు. హరీష్‌, సంతోష్‌ మీతో బాగున్నట్లు నటించవచ్చు. కానీ వాళ్లు మన కుటుంబం, తెలంగాణ మంచి కోరుకునే వారు కాదు. వాళ్లను పక్కన పెట్టి కార్యకర్తలను అక్కున చేర్చుకుని ప్రజల్లోకి వెళ్తేనే పార్టీ బతికి బట్టకడుతుందని వెల్లడించారు. హరీష్‌ రావుకు సంబంధించిన పాల వ్యాపారం, రంగనాయక సాగర్‌ వద్ద భూ ఆక్రమణలు, మాజీ ఎంపీ సంతోష్‌పై మద్యం షాపుల కేసు తదితరాలన్నీ రేవంత్‌తో ఉన్న అవగాహన ఒప్పందంతోనే తెరమరుగయ్యాయని ఆరోపించారు.

మాజీ ఎంపీ సంతోష్‌ రావు ధన దాహంతో నేరెళ్లలో దళితులపై పోలీసులు దాడి చేస్తే కేటీఆర్‌(KTR)కు చెడ్డపేరు వచ్చిందన్నారు. హరితహారంకు నకిలీ కార్యక్రమం గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ పేరిట సినీ నటులను మోసపూరితంగా రప్పించి అటవీ భూములను కొల్లగొట్టేందుకు సంతోష్‌ ప్రయత్నించాడు. హరిత హారం పేరుతో కొన్ని వందల కోట్ల రూపాయలు సంతోష్ రావు సంపాదించాడని ఆరోపించారు. సంతోష్ రావు కోసం ప్రత్యేక జీవోలు విడుదల చేసేవారన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సంతోష్‌ అనుచరుడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మెఘా శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మోకిలలో రూ.750 కోట్ల బ్లూఫిన్‌ విల్లా ప్రాజెక్టు చేస్తున్నారు. అవి అవినీతి డబ్బులు కాదా? సంతోష్‌ను మరో ఎమ్మెల్సీ నవీన్‌రావు తన గురువుగా చెప్పుకుంటున్నాడు.

 Also Read: Hyderabad Water Board: తాగునీటి వృథా చేస్తే జరిమాన తప్పదు.. జలమండలి ఎండీ ఆదేశం

ఏసీబీకి వీరి అడ్రస్‌లు దొరకడం లేదా?

పేకాటలో నవీన్ రావు తండ్రిని పట్టుకుంటే రేవంత్ దగ్గరకు వెళ్లి మాఫీ చేయించుకుండని అన్నారు. ఏసీబీకి వీరి అడ్రస్‌లు దొరకడం లేదా? అని ప్రశ్నించారు. రేవంత్‌ ప్రభుత్వంపై బరిగీసి కొట్లాడుతున్నందుకే మా కుటుంబంపై కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని జలగల్లాగా హరీష్ రావు, సంతోష్ రావు పట్టి పీడిస్తున్నారని ఆరోపించారు. మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయని, కేటీఆర్ కు సంబంధించిన వారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని.. శ్రవణ్‌రావుతో కలిసి హరీష్‌రావు, సంతోష్‌, శ్రవణ్ లే ఫోన్లను కూడా ట్యాప్‌ చేయించారని మండిపడ్డారు.

టీఆర్‌ఎస్‌ ప్రారంభం నుంచి హరీష్‌ లేరని, టీడీపీ నుంచి కేసీఆర్‌ రాజీనామా చేసి బయటకు వస్తున్న సమయంలో రూ.కోటన్నరతో వ్యాపారం చేసుకునేందుకు వెళ్లారన్నారు. పది నెలల తర్వాత తిరిగి వచ్చిన హరీష్‌ను క్షమించిన కేసీఆర్‌ ఆయన ఎమ్మెల్యే కాకముందే మంత్రి పదవి ఇచ్చారన్నారు. హరీష్‌రావు ట్రబుల్‌ షూటర్‌ కాదు.. బబుల్‌ షూటర్‌ అని మండిపడ్డారు. ఆయనే ట్రబుల్స్‌ సృష్టించి వాటిని పరిష్కరించినట్లు చెప్పుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాసోజు శ్రవణ్‌ ఎమ్మెల్సీ ఎన్నిక సమయంలో రెండో అభ్యర్థిని బరిలోకి దింపి బీజేపీ ఎమ్మెల్యేలతో బేరసారాలకు హరీష్‌ దిగిన విషయం కేసీఆర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లాం.. పార్టీలో అనేక మంది సొంత ఎజెండాతో కాంగ్రెస్‌, బీజేపీతో సంబంధాలు కలిగి ఉన్నాడన్నారు.

 కేటీఆర్‌ను ఓడించేందుకు హరీష్‌ రూ.60లక్షలు

2018 అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్‌రావు 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలకు పార్టీ నిధితో పాటు అదనపు నిధులు కూడా ఇచ్చాడు. కాళేశ్వరం అవినీతిలో సంపాదించిన సొమ్ముతో తన మనుషులు కొందరు ఎమ్మెల్యేలుగా ఉండాలనుకున్నాడని, పార్టీఅటు ఇటు అయితే కీలకం కావచ్చని భావించారన్నారు. పార్టీ ఉన్న తర్వాత ఎందుకు ఆ ఆలోచన వచ్చిందని ప్రశ్నించారు. 2009లో కేటీఆర్‌ను ఓడించేందుకు హరీష్‌ రూ.60లక్షలు పంపారని, కేసీఆర్‌ను కూడా గజ్వేల్‌లో ఓడించాలని చూశారని ఆరోపించారు. నిజామాబాద్‌ లోక్‌సభ స్తానం పరిధిలో ఎమ్మెల్యేలను ప్రభావితం చేసి నన్ను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలని ప్రయత్నంచేశారని, ఇలాంటి వారిని పక్కన పెట్టుకుని నన్ను బయటకు పంపితే పార్టీ బాగు పడుతుందా? అని ప్రశ్నించారు. కలికాలం కాబట్టి అబద్దాలు చెప్పేవారిదే నడుస్తదన్నారు. నేను కర్మ సిద్దాంతాన్ని బలంగా నమ్ముతానన్నారు.

వెన్నుపోటు పొడిచేందుకు సిద్దం

ఈ రోజు ఆరడుగుల బుల్లెట్‌ నన్ను గాయపరిచింది. రేపు కేసీఆర్‌, కేటీఆర్‌లో ఎవరిని గాయపరుస్తుందో రామన్నా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించారు. హంపిలో భేటీ అయిన కొందరు నేతలు అవమానకరంగా మాట్లాడి కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచేందుకు సిద్దమైన సందర్భంలో కేటీఆర్‌ చేతులు పట్టుకుని హరీష్‌ బ్రతిమిలాడారు. అక్కడ మాట్లాడిన వారిని పార్టీ నుంచి బయటకు పంపారు. అందులో భాగంగానే ఈటల రాజేందర్‌ బయటకు వెళ్లారు. హరీష్‌ వల్లే జగ్గారెడ్డి, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, రఘునందన్‌రావు, మైనంపల్లి, విజయశాంతి, విజయ రామారావు తదితరులు పార్టీ నుంచి బయటకు వెళ్లారన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో హరీష్‌ వల్లే బీఆర్‌ఎస్‌ ఓటమి పాలైందని మండిపడ్డారు. హుజూరాబాద్ లో ఈటలను గెలిపించారు. అప్పటి నుంచి రేవంత్, హరీష్ రావు బంధ కోసం కొనసాగుతుందని తెలిపారు. ఈ నక్కజిత్తులు అప్పటి నుంచే ఉన్నాయన్నారు. మీడియా మేనేజ్ లో హరీష్ రావు సూపర్ రామన్న యూట్యూబ్ మేనేజ్ అన్నారు.

పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కు నష్టం చేకూర్చేపార్టీ ఉంటే ఎంత?లేకుంటే ఎంతా అని అన్నాను. నా జీవితంలో ఇంకోపార్టీకి ఓటువేయమని చెప్పలేదని స్పష్టం చేశారు. కంప్యూటర్‌లో బీఆర్‌ఎస్‌ హార్డ్‌వేర్‌ అయితే తెలంగాణ జాగృతి సాఫ్ట్‌వేర్‌ అన్నారు. తెలంగాణ జాగృతి ద్వారా పార్టీ అభివృద్దిలో నా కంట్రిబ్యూషన్‌ ఉందని వెల్లడించారు. కేసీఆర్‌(KCR)పై ఒత్తిడి తెచ్చి నన్ను సస్పెండ్‌ చేయించారని నమ్ముతున్నానని, కేసీఆర్‌(KCR) నిర్ణయాన్ని శిరసావహిస్తా అయితే నా లేఖను లీక్‌ను లీక్‌ చేసిన వారిపై వంద రోజులు కావస్తున్నా ఎలాంటి చర్యలు లేవు అని ఆవేదన వ్యక్తం చేశారు.

రాఖీ పండుగ ముందు మెసేజ్‌ పెట్టినా రామన్న బిజీ

లేఖ లీక్‌ విషయాన్ని కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన సందర్భాల్లో హరీష్‌, సంతోష్‌ గ్యాంగ్‌లు నా తండ్రి కలవలేదంటూ వార్తలు రాయించారని మండిపడ్డారు. నా కుటుంబంలో జరిగిన అనేక అంశాలు బయటకు చెప్పలేను.. నేను మొండిదాన్ని కాబట్టే తట్టుకుని నిలబడి రాజకీయ అంశాలు మాత్రమే మాట్లాడుతున్నానన్నారు. నేను ఏ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి కార్యకర్తలు, మేధావులు, బీసీలు, సామాజిక తెలంగాణ కోసం పనిచేసే వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. రాఖీ పండుగ ముందు మెసేజ్‌ పెట్టినా రామన్న బిజీగా ఉండటంతో కుదరలేదని, నా లేఖ లీక్‌ కానంత వరకు నేను మాట్లాడలేదు.. భవిష్యత్తులో అవసరమైన మరిన్ని విషయాలు బయట పెడతానన్నారు. పార్టీ తనపై సస్పెన్షన్ వేటు వేయడంతో.. తన పుట్టింటికి వెళ్లే పరిస్థితి లేదని.. తానకు అమ్మ అంటే చాలా ఇష్టమని కంటతడి పెట్టారు. అమ్మను కలవలేక పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మా తల్లికి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం అన్నారు.

 Also Read: Kavitha: కవిత వ్యూహాత్మక అడుగులు సస్పెన్షన్ తర్వాత గులాబీ పార్టీకి షాక్?

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం