Kavitha: పెద్దోళ్లను వదిలి పేదలపై ప్రతాపమా?.. కవిత (Kavitha) కీలక వ్యాఖ్యలు పెద్దోళ్లను వదిలి పేదలపై ప్రతాపమా?..కోర్టు చెప్పినా సరే ఇళ్లు కూల్చుతారా? అని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి (Telangana Jagruti) సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ప్రభుత్వాన్ని నిలదీశారు. హైడ్రా హడావుడిగా వచ్చి పెద్ద వాళ్ల జోలికి పోకుండా…పేదల ఇళ్లను రాత్రికి రాత్రికి కూలగొట్టటం దారుణం అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం గాలిపోచమ్మ బస్తీలో కూల్చివేతల బాధితులను పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పేదల ఉసురు తీసుకోకవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రూ. 50 వేలు సాయం అందించాలన్నారు. మళ్లీ హైడ్రా బుల్డోజర్ వస్తే నేనే అడ్డుగా నిలుచుంటానన్నారు.
Also Read: Kishan Reddy: డ్రగ్స్ ఫ్రీ కంట్రీగా దేశాన్ని చూడటమే లక్ష్యం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
అరెకపూడి గాంధీ కబ్జా చేసిన 12 ఎకరాల సంగతేంది?
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కబ్జా చేసిన 12 ఎకరాల సంగతేంది? అని ప్రశ్నించారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వైఎస్ ప్రభుత్వంలో భూములు ఇచ్చారని, ఆనాడే కంచె వేసి ఉంటే ఈ భూములు కబ్జా అయ్యేవి కావన్నారు. పోచమ్మ బస్తీ చుట్టు పక్కల ఉన్న దాదాపు 4 వందల ఎకరాల్లో కబ్జాలు జరిగాయని, చాలా ప్రభుత్వాలు మారినప్పటికీ భూముల రక్షణను పట్టించుకోలేదన్నారు. చిన్న పిల్లలు ఉన్నారు.. మరోపక్క పండుగ ఉంది.. ఈ సమయంలో వారి ఇళ్లు కూలగొట్టటం అమానుషం అన్నారు. గతంలోనే కోర్టు శని, ఆదివారాలు ఎవరి జోలికి వెళ్లవద్దని స్పష్టంగా చెప్పిందని, వాళ్లకు న్యాయం కోసం కోర్టుకు వచ్చే అవకాశం ఇవ్వాలని కోరిందని, అయినప్పటికీ ఆదివారం రోజు ఇళ్లను కూలగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
హైడ్రా బుల్డోజర్ కు అడ్డంగా నేను నిలుచుంటా
గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్లు ఉన్న వాళ్ల ఇళ్లను కూడా కూలగొట్టారని మండిపడ్డారు. బాధితులకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వండి.. తక్షణ సాయం కింద రూ. 50 వేలు ఇవ్వండి అని డిమాండ్ చేశారు. పేదలకు అన్యాయం చేస్తే ప్రభుత్వానికి ఉసురు తాకుందన్నారు. మళ్లీ ఈ నెల 6 లోపు హైడ్రా వాళ్లు వస్తామని చెప్పారంటా.. ఆ లోపు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలన్నారు. లేదంటే హైడ్రా బుల్డోజర్ కు అడ్డంగా నేను నిలుచుంటానని స్పష్టం చేశారు. బాధితులతో కలిసి వారి వివరాలు తీసుకొని నేనే వస్తా.. ఎక్కడకి రమ్మంటారో చెప్పండి అని డిమాండ్ చేశారు. రెండేళ్లలో ముఖ్యమంత్రి ఒక్కసారి మాత్రమే ప్రజాపాలన వద్దకు వచ్చాడన్నారు. అసలు ప్రజలు తమ బాధలు ఎవరికీ చెప్పుకోవాలి. బాధితుల వివరాలు తీసుకుంటున్నామన్నారు. కూలీ చేసుకొనే వాళ్ల ఇళ్లను కూల్చేస్తూ హీరోయిజం చూపిస్తున్నారా? అని నిలదీశారు. బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
తెలంగాణ జాగృతిలో బతుకమ్మ సంబురాలు
తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో సోమవారం బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. బతుకమ్మను పేర్చి జాగృతి మహిళా నేతలు, మహిళలతో కలిసి ఆడిపాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పండుగ బతుకమ్మ అన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి పండుగ మనకుందన్నారు. ఇలాంటి పండుగ రోజు ఆడబిడ్డలను ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఒకటి కాదు, రెండు చీరలిస్తామని గతంలో చెప్పిందని, కానీ మొత్తానికి ఎగ్గొట్టిన ఘనత సాధించిందని దుయ్యబట్టారు.
ఆడబిడ్డలందరికీ స్కూటీలు ఇవ్వాలి
ఆడబిడ్డలను గౌరవించటమంటే కేవలం బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పటం కాదన్నారు. ఆడబిడ్డలకు మాట ఇచ్చినట్లు నెలకు రూ. 2500 లతో పాటు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ చీర పేరుతోనే ఇవ్వాలని కోరారు. ఎంత కష్టమైనా, సంతోషమైనా సరే ఈ పండుగను నిలబెట్టుకోవాలని ఆడబిడ్డలను విజ్ఞప్తి చేశారు. జాగృతి తరఫున ఇప్పటికే 110 బతుకమ్మ పాటలను విడుదల చేశామన్నారు. బతుకమ్మ పండుగను నిలబెట్టేందుకు జాగృతి తరఫున నిరంతర ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందన్నారు.
Also Read: Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు