Kavitha: చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదం అత్యంత దురదృష్టకరమని, ఈ ప్రమాదానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. ఆమె ప్రమాదంలో గాయపడిన బాధితులను, మరణించిన వారి కుటుంబాలను ఆసుపత్రులలో, వారి ఇళ్ల వద్ద పరామర్శించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, రోడ్డు నిర్మాణం సకాలంలో జరిగి ఉంటే ఈ స్థాయిలో ప్రమాదం జరిగేది కాదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం బాధితులకు సరిపోదని, పెంచాలని డిమాండ్ చేస్తూ, చనిపోయిన కుటుంబానికి రూ. కోటి, గాయపడిన వారికి రూ.10 లక్షల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.
ధర్నా చేసిన వ్యక్తులపై నమోదైన కేసులను ఎత్తివేయాలి
జాతీయ రహదారిని తక్షణమే మరమ్మత్తులు చేయాలని స్థానికులు ధర్నా చేస్తే, వారిపై కేసులు పెట్టడం సరియైన పద్ధతి కాదని కవిత అన్నారు. చేవెళ్ల ప్రమాదం రాష్ట్రాన్ని మొత్తం కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్డుపై అనుమతి లేని భారీ లోడ్ వాహనాలు అధికంగా ప్రయాణిస్తున్నాయన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తక్షణమే ధర్నా చేసిన వ్యక్తులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పర్యావరణ అనుమతులే కారణం
గత ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణం కోసం పర్యావరణ అనుమతులే కారణమని కవిత వివరించారు. ప్రజల బాగోగులను దృష్టిలో పెట్టుకుని నావల్ రాడార్‌కు గత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం రాడార్ పర్మిషన్ ఇచ్చి వికారాబాద్ జిల్లా ప్రజలను ఇబ్బంది పెడుతోందని ఆమె ఆరోపించారు. జిల్లా ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Also Read: Kalvakuntla Kavitha: నేను వాళ్ల, వీళ్ల బాణాన్ని కాదు.. తెలంగాణ ప్రజల బాణాన్ని.. కవిత సంచలన కామెంట్స్
