CM Jagan: ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర చేపడుతుండగా శనివారం విజయవాడలో ఆయనపై దాడి జరిగింది. దుండగులు ఆయన పై దాడి చేయగా ఎడమ కంటికిపై భాగాన బలమైన గాయమైంది. ఆయనకు అదే రోజు రాత్రి కుట్లు పడ్డాయి. ఈ ఘటన గురించి తెలియగానే జనసే, టీడీపీ, బీజేపీ నాయకులు ఖండించారు. దోషులను వెంటనే పట్టుకుని శిక్షించాలని, నిర్లక్ష్యం వహించిన లేదా బాధ్యుతలైన అధికారులపై యాక్షన్ తీసుకోవాలని కోరారు. ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, జగన్ చెల్లి షర్మిల కూడా ఘటనను ఖండించారు. కానీ, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఈ ఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. రాజమండ్రిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై అనుమానాలను వెలిబుచ్చారు. గతంలో ఎన్నికల సమయంలోనే కోడి కత్తి ఘటన జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ కోడి కత్తి కేసు ఇప్పటి వరకూ తేలనేలేదని పేర్కొన్నారు.
Also Read: బీజేపీ మ్యానిఫెస్టోపై ఖర్గే ఏమన్నారు?
అంతేకాదు, సీఎం జగన్ పై జరిగిన దాడి నిజమేనా? అనే సందేహాలూ ఉన్నట్టు ఆయన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పై జరిగిన దాడి నిజమే అయితే తాను ఆ దాడిని ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిగిన తర్వాతే మాట్లాడుతానని చెప్పారు.
అధికారులు ఘటనపై దర్యాప్తు వేగవంతం చేశారు. క్లూ టీం రంగంలోకి దిగింది. నిందితులను గుర్తింపు ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ఇప్పుడు ఏపీలో రాజకీయ దుమారం రేగుతున్నది. అధికార పక్ష నాయకులు ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కాగా, ప్రతిపక్షాలు కూడా ఈ దాడిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు.