Mallikarjun Kharge: ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసింది. సంకల్ప్ పత్ర్ పేరుతో లోక్ సభ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించింది. ఈ మ్యానిఫెస్టోపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. బీజేపీపై, నరేంద్ర మోడీపై విమర్శలు సంధించారు. గత పదేళ్లలో దేశ ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా ప్రధాని మోడీ చేయలేదని విరుచుకుపడ్డారు. వారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతులు ఢిల్లీలో ధర్నా చేసిందని, కొందరు అన్నదాతలు ప్రాణ త్యాగం కూడా చేశారని గుర్తు చేశారు. వారు ఇచ్చిన హామీల పరిస్థితే ఇలా ఉన్నదని, ఇక సంకల్ప్ పత్ర్ గురించి చెప్పేదేముందని పేర్కొన్నారు. ఈ మ్యానిఫెస్టో హామీలను నమ్మరాదని సూచించారు.
‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు. కనీస మద్దతు ధరను పెంచుతామని, దానికి చట్టపరమైన హామీ ఇస్తామని నమ్మబలికారు. ఇవన్నీ వారు ఇచ్చిన హామీలే. దేశవ్యాప్తంగా ఉన్న రైతులు కూడా ఈ డిమాండ్లను నెరవేర్చాల్సిందిగా ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు’ మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
‘యువత ఉద్యోగాల కోసం చూస్తున్నది. వారు ఉపాధి లేక రోడ్ల మీదికి వస్తున్నారు. ఇక ద్రవ్యోల్బణం అదుపుతప్పింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ, మోడీకి వీటిపై ఆలోచనలు లేవు. వీటి గురించి ఆందోళన లేదు. గత పదేళ్ల కాలంలో దేశ ప్రజలకు ఉపయోగపడే పనులేవీ ఆయన చేయలేదు. ప్రజలకు ఆయన ఇచ్చే హామీలను వట్టివేనని ఇవి చూస్తే అర్థం అవుతుంది’ అని ఖర్గే వివరించారు. బీజేపీ మ్యానిఫెస్టోను నమ్మలేమని విలేకరులకు తెలిపారు.
Also Read: జైలుకు పక్కా!.. భార్యాభర్తల మాటలు చాటుగా వినడం సిగ్గుచేటు
అనంతరం ఆయన తన ఎక్స్ హ్యాండిల్‌లో 14 ప్రశ్నలు సంధించారు. మోడీ గ్యారంటీ అంటే అబద్ధపు వారంటీ అని ఖర్గే విమర్శించారు. ఈ రోజు 14వ తేదీ కాబట్టి.. 14 ప్రశ్నలు వేస్తున్నట్టు పేర్కొన్నారు.
‘1. యువతకు యేటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది?
2. రైతుల ఆదాయం రెట్టింపు మాట ఏమైంది?
3. కనీస మద్దతు ధర ఏది?
4. ప్రతి బ్యాంకు ఖాతాలో 15 లక్షలు వేయలేదేం?
5. ఎస్సీ, ఎస్టీలపై 48 శాతం నేరాల ఎందుకు పెరిగాయి?
6. మహిళా రిజర్వేషన్ అమలు చేయలేదేం? మహిళలపై అత్యాచారాలను అడ్డుకునేందుకు ఏం చేశారు?
7. 100 కొత్త స్మార్ట్ సిటీలు ఏవి?
8. 2020 వరకు గంగా నదిని శుద్ధి చేయలేదేం?
9. 2022 వరకు ప్రతి కుటుంబానికి ఆవాసం(ఇల్లు) ఉంటుందన్న హమీ ఏమైంది?
10. దేశమంతటా 24 గంటలు విద్యుత్ ఇస్తామన్న హామీ ఏమైంది?
11. 2022 వరకే భారత్‌ను ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ చేస్తామన్న మాట ఏది?
12. నేను దేశాన్ని తలదించుకోనివ్వనని చెప్పిన మాట ఏది?(చైనా ఆక్రమణలే చేయలేదని క్లీన్ చిట్ ఇచ్చి చైనాకు ఫ్రీ పాస్ ఇస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది.)
13. 2022 వరకు 40 కోట్ల యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామన్న హామీ ఏమైంది?
14. మొదటి బుల్లెట్ ట్రైన్ ఇంకా కనిపించడం లేదేం?
అందుకే 2024లో ఈ బూటకపు మాటలు మాట్లాడేవారిని ప్రజలు ఓడిస్తారు.. ఇండియా మాత్రమే గెలుస్తుంది. న్యాయం పరివ్యాపిస్తుంది’ మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేశారు.
Also Read: డోంట్ వర్రీ.. ముస్తఫా..!! చిన్ననాటి మిత్రుడు వెంకట్రామిరెడ్డికి ఫుల్ సపోర్ట్
బీజేపీ సంకల్ప్ పత్ర్‌లో మరో ఐదేళ్లకు ఉచిత రేషన్ బియ్యం పథకాన్ని కొనసాగిస్తామని బీజేపీ ఈ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంది. ఆయుష్మాన్ భారత్ పథకం కిందికి ట్రాన్స్ జెండర్‌లను తెస్తామని, ముద్ర యోజన కింద రూ. 10 లక్షల లిమిట్‌ను రూ. 20 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చింది. కోట్ల కుటుంబాల కరెంట్ బిల్లు సున్నాం చేస్తామని, విద్యుత్ నుంచి గొప్ప అవకాశాలను సృష్టిస్తామని తెలిపింది. సోషల్, డిజిటల్, ఫిజికల్ విధానాల్లో 21వ శతాబ్దంలో భారత పునాదిని పటిష్టం చేస్తామని వివరించింది.
ఈ సమావేశానికై ప్రధాని మాట్లాడుతూ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని, ఒకే దేశం ఒకే ఎన్నికను అమల్లోకి తెస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. 75 ఏళ్ల వారిని ఆయుష్మాన్ భారత్ యోజనా కిందికి తీసుకువస్తామని వివరించింది.