Congress: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు (KVP Ramachandra Rao) ప్రమేయం ఎక్కువ అవుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. టీ కాంగ్రెస్‌కు ఇప్పటికీ తన సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు స్వయంగా ఆ పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతున్నది. అయితే, ఏపీకి చెందిన ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడంపై సొంత పార్టీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లు తర్వాత పవర్‌లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ఏపీ నేతలకు ప్రయారిటీ ఇవ్వడం సరికాదని టీ కాంగ్రెస్ (T Congress) నేతలు తేల్చి చెప్తున్నారు. టీపీసీసీ నిర్వహించే కార్యక్రమాలకు కేవీపీని ఆహ్వానించడం వలన ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ (YSR) సీఎంగా ఉన్న సమయంలో కేవీపీ కీలకంగా వ్యవహరించారు. షాడో సీఎంగా ఉండేవారని సీనియర్ కాంగ్రెస్ నేతలు వివరిస్తున్నారు. అయితే, ఆంధ్రాకే అధిక ప్రయారిటీ ఇచ్చే ఆ నేతను తెలంగాణ కాంగ్రెస్ కార్యక్రమాలకు ఎందుకు పిలవాలి అనే ప్రశ్న ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నది. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారని, వీ హనుమంతరావు, జగ్గారెడ్డి, జానారెడ్డి, గీతారెడ్డి తదితర నేతలు ఎందరో ఉండగా, కేవీపీకి ప్రయారిటీ ఇవ్వడం సరికాదని తెలంగాణ ప్రాంతానికి చెందిన హస్తం నేతలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Read Also- Andhra Pradesh: ట్రాన్స్‌ఫర్ ఆపాలంటే టీడీపీ ఎమ్మెల్యే కాళ్లు పట్టుకోవాల్సిందే!
కార్యక్రమాల్లో అవసరమా?
తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యక్రమాల్లో కేవీపీకి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. దీంతో పాటు సాగునీటి రంగానికి సలహాదారుడిగా ఏపీ ప్రాంతానికి చెందిన ఓ అధికారిని నియమించారు. ఆ తర్వాతనే బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacharla Project) ముందుకు వెళ్లిందని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. పైగా, ఆ అధికారి గత పదేళ్లుగా తెలంగాణకు వ్యతిరేకంగా పోరాడినట్లు వివరిస్తున్నారు. ఇక, గద్దర్ అవార్డులలో ఏపీ ప్రాంతానికి చెందిన ఫిల్మ్ స్టార్లకే అత్యధిక అవార్డులు వచ్చినట్లు ప్రచారం ఉన్నది. ఏపీకి ప్లస్ చేసే ఇలాంటి నిర్ణయాలన్నీ కేవీపీ లాంటి నేతలే ఇస్తుంటారని పార్టీ నేతలు వాపోతున్నారు.
విమర్శనాస్త్రాలు!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ (BRS) మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నది. ప్రభుత్వంలో తాజాగా జరిగిన పరిణామాలపై మేధావులు, కళాకారులు, నిపుణులు కూడా తెలంగాణ నినాదం వైపే మొగ్గు చూపుతున్నారు. రోశయ్య విగ్రహం ఏర్పాటుపై కూడా తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ఏపీకి అనుకూలంగా ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదనే విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం, పార్టీ కార్యక్రమాలలో కేవీపీ ప్రత్యక్షం కావడం ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చినట్టే అవుతున్నదని సొంత పార్టీ నేతలే అభ్యంతరం చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన కేవీపీ లాంటి నేతలకు ప్రాధాన్యత ఇవ్వకూడదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్‌లు ఈ అంశాన్ని సీరియస్‌గా దృష్టిలో పెట్టుకోవాలని పలువురు ఆఫ్‌ది రికార్డులో చెప్తున్నారు. మరోవైపు, రీసెంట్‌గా ఓ ఎమ్మెల్యే సైతం చంద్రబాబు కోవర్డులు తెలంగాణలో ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. వాళ్లకు చెక్ పెడితేనే బనకచర్ల ఆగిపోతుందని నొక్కి చెప్పారు. ఇలాంటి ఆరోపణల తర్వాత మళ్లీ కేవీపీ లాంటి నేతలు గాంధీ భవన్‌లో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది.
Read Also- Kiran Abbavaram: హీరో కిరణ్ అబ్బవరం సంచలన నిర్ణయం