Shivraj Singh Chouhan: దేశానికి హాని తలపెడితే వదిలిపెట్టబోమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఆదివారం వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈనేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నేషనల్ కో ఆర్డినేషన్ అనిల్ ఆంథోనీ, స్టేట్ కో ఆర్డినేషన్ మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివరాజ్ సింగ్ చౌహాన్ రావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఆయన హాజరవ్వలేకపోయారు.
దీంతో వర్చువల్ గా ఈ సదస్సుకు ఆయన హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. భారత్.. ఎవరికీ హాని చేయదని, కానీ భారత్ కు ఎవరైనా హాని చేస్తే వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. పహల్ గావ్ లో టెర్రరిస్టులు మతం పేరు అడిగి మరీ చంపారని, వారు ఇంత దుర్మార్గం చేయాల్సింది కాదని పేర్కొన్నారు. వారు భారత ఆడపడుచుల సింధూరం తుడిస్తే.. భారత్.. వారి దేశానికి వెళ్లి.. వారి స్థావరాలు లేకుండా నేలమట్టం చేశారని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ కు నాగరికత, రాజనీతి లేదని విమర్శలు చేశారు. పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేసిందని, వారు ఇది కొత్త భారత్ అని మర్చిపోయినట్లున్నారని చురకలంటించారు.
Also read: CM Revanth Reddy: రైతులకు అండగా.. ఇందిరా సౌర గిరి జల వికాసం..
దేశంలో ఎన్నికల కోసం 365 రోజులు రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయని, తద్వారా అభివృద్ధి కుంటుపడుతోందని ఆయన పేర్కొన్నారు. దేశంలో ప్రతి ప్రతి నాలుగు లేదా ఆరు నెలలకోసారి ఏదో ఎన్నిక జరుగుతోందన్నారు. దీనివల్ల దేశానికి ఎంతో నష్టమని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడూ ఎన్నికల పనే ఉంటే.. అభివృద్ధిపై దృష్టిపెట్టేదెన్నడని ఆయన ప్రశ్నించారు. నిత్యం ఎన్నికల ద్వారా అధికారులు ప్రతి రాష్ట్రం తిరగాల్సి వస్తోందని, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, పోలీసులు, సైనికులు సైతం ఈ ఎన్నికల్లో పాల్గొంటారని శివరాజ్ సింగ్ చౌహాన్ వివరించారు.
చివరకు వైద్యులు కూడా ఆసుపత్రి వదిలి ఎన్నికల డ్యూటీ చేస్తారని పేర్కొన్నారు. 1951-1952 ఎన్నికల్లో ఎలక్షన్ కు రూ.11 వేల కోట్లు ఖర్చు అయ్యిందని, 2019 లోక్ సభ ఎన్నికల్లో రూ.60 వేల కోట్లు ఖర్చయినట్లు ఆయన చెప్పారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో రూ.1.35 లక్షల కోట్లు ఖర్చయినట్లు శివరాజ్ సింగ్ చెప్పారు. ఎన్నిసార్లు ఎలక్షన్లు జరిగితే.. అంత ఖర్చు పెరుగుతుందని ఆయన వివరించారు.
అందుకే వన్ నేషన్, వన్ అగ్రికల్చర్, వన్ టీం సంకల్పంగా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఒకే ప్రచార రథంపై ఎంపీ, ఎమ్మెల్యే ప్రచారం చేసుకుంటే ఎంత లబ్ధి జరుగుతుందో ఆలోచించాలని కోరారు. అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రతి 5 ఏండ్లకు ఒకేసారి ఎన్నికలు జరగాలని ఆయన స్పష్టంచేశారు.
Also read: Gold Rate Today: మహిళలకు బిగ్ షాక్ .. నేడు భారీగా పెరిగిన గోల్డ్ ధరలు?
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం సిద్ధించి 76 ఏండ్లు పూర్తిచేసుకున్నా ఇంకా బ్రిటీష్ విధానాల్ని అవలంభిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వర్తమాన రాజకీయ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్ని మార్చుకోవాలని ప్రధాని మోడీ చెబుతుంటారని గుర్తుచేశారు. దానికి అనుగుణంగా మార్చే క్రమంలో వాటికి అడ్డంపడే ప్రయత్నం జరుగుతూ ఉంటుందన్నారు. అందుకే వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పై ప్రజల్లో చైతన్యం నింపాలని చూస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
దీన్ని వ్యతిరేకించే రాజకీయ పార్టీలపై మేధావులు, ఒత్తిడి తీసుకురావాలని, ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారాలని కోరారు. దేశంలో సంస్కరణలు తీసుకురావడం కేవలం మోడీ ప్రభుత్వానికే సాధ్యమని చెప్పుకొచ్చారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ వస్తే ఎంతో లబ్ధి జరుగుతుందని, దీనిపై ప్రజలందరూ ఆలోచించాలని కిషన్ రెడ్డి కోరారు.