Telangana: రాష్ట్రంలో పులులకు రక్షణ లేకుండా పోతోంది. నిరంతరం పర్యవేక్షించాల్సిన అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే పులులు హతమవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. అంతేకాదు సీసీ కెమెరాలతోనూ అనుక్షణం గమనిస్తూ ఉండాలి. అటవీ ప్రాంతంలో వేటగాళ్లను పోనీయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని, కేవలం ప్రకటనలు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది.
ప్రకటనలు చేస్తున్నప్పటికీ అవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే పులులు హతమవుతున్నట్టు వన్యప్రేమికులు పేర్కొంటున్నారు. ఈఏడాదిలోనే కాగజ్ నగర్ డివిజన్ లోనే మూడు పులులు హతం అవుతుండటం హాట్ టాపిక్ గా మారింది.తెలంగాణలో పులుల సంఖ్య ఏటా పెరుగుతుందని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
Also read: Hyderabad: భాగ్యనగర ప్రజలకు షాకింగ్ న్యూస్.. రోడ్డే కదా అని చెత్త వేస్తే?
కానీ అందుకు అనుగుణంగా సంరక్షణ చర్యలు చేపట్టడంలో మాత్రం అధికారులు ఫెయిల్ అవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిరంతరం మానిటరింగ్ చేయకపోవడంలో వైఫల్యంతో ఇప్పుడు వేటగాళ్లకు బలిఅవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో పులుల మరణాలు ముఖ్యంగా మానవ-జంతు ఘర్షణలు, విద్యుత్ షాక్‌లు, రైలు ఢీకొనడం, మరియు కొన్నిసార్లు వేటగాళ్ల చేతిలోనే సంభవిస్తున్నాయని స్పష్టమవుతుంది.
ప్రధానంగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ప్రస్తుత కాగజ్‌నగర్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలు పులుల కరిడార్ ప్రాంతం. ఈ ప్రాంతం వేటగాళ్లకు ప్రధాన లక్ష్యంగా మారింది. 2021లో మూడు పులులు మరణించాయి. వీటిలో ఒకటి ములుగు జిల్లాలో వేటగాళ్ల ఉచ్చులతో మృతి చెందినట్లు సమాచారం. 2016లో తెలంగాణలో పులుల మరణాలు 25% పెరిగాయని, ఇవీ ప్రధానంగా వేటగాళ్ల ఉచ్చులు, విద్యుత్ షాక్‌ల కారణంగా మృతి చెందాయని ప్రభుత్వానికి అధికారులు సమాచారం ఇచ్చినట్లు సమాచారం.
2023లో తెలంగాణలో పులుల మరణాలు నమోదు చేయబడలేదని సమాచారం. ఇది పులుల సంరక్షణలో అధికారుల పనితీరుకు నిదర్శమని పలువురు బహిరంగంగానే పేర్కొంటున్నారు. అయితే 2024లో మూడు పులులు మరణించాయి. వీటిలో రెండు విషపూరితమైన పశువుల మాంసం ద్వారా మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు రైతులు, ఒక బాలుడు అరెస్టు చేశారు. ఈ నెల 15న వేటగాళ్ల ఉచ్చుకు మరో పులి బలైంది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్ పెంచికల్ పేట రేంజ్ లో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న అధికారులు ఈ నెల 17న పులికి పోస్టుమార్టం నిర్వహించి కళేబరాన్ని పూడ్చి పెట్టారు.
గోర్లకు, పళ్లకు డిమాండ్
పులికి దేశంతో పాటు విదేశాల్లోని డిమాండ్ ఉంది. పులి గోళ్లకు, పండ్లకు మంచి డిమాండ్ తో వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చి, ఉచ్చులు వేసి హతమార్చుతున్నట్లు సమాచారం. పులికి 16 గోర్లు ఉంటాయి. నాలుగు పెద్దదంతాలు భారీ డిమాండ్. పులి చర్మానికి సైతం కొంతమంది ఫ్రిస్టేజ్ తో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈజీగా మనిసంపాదించవచ్చనే లక్ష్యంతో ఈ మార్గం ఎంచుకున్న వేటగాళ్లు ఉచ్చులు అమర్చడంతో అవి మృత్యువాత పడుతున్నాయి.
Also read: KCR: కేసీఆర్ స్కెచ్.. కేటీఆర్ అమలు.. ఫైనల్‌గా ఏమైంది?
తాజాగా కాగజ్నగర్ డివిజన్ పెంచికల్ పేట రేంజ్ లో వేటగాళ్ల ఉచ్చుకు బలైన పులి చర్మ, గోర్లు, పండ్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో అనుమానితులుగా భావించి అధికారులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు విషప్రయోగాలు సైతం చేస్తున్నట్లు సమాచారం. గతేడాది జనవరిలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం దరిగాం సమీపంలోని షెర్కేపల్లి అటవీ ప్రాంతంలో పులులు మృతి చెందాయి.
ఆడ పులి మృతి చెందడంతో మరో పులి జాడ కోసం అటవీ అధికారులు ట్రాకింగ్ బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ప్రారంభించగా, ఈ క్రమంలో మృతి చెందిన పెద్ద పులి మృతదేహం లభించింది. ఆడ పులి మృత దేహం లభించిన ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే మరో పులి మృత దేహం లభించింది. పులుల మధ్య జరిగిన ఘర్షణలో పులి పిల్ల చనిపోయిందని మొదట అధికారులు భావించినప్పటికీ.. ఆ వెంటనే మగపులి చనిపోవటం దానికి ఉచ్చు బిగిసి ఉండడం, విషప్రయోగం జరిగినట్లు తేలింది.
ఫండ్ ఏర్పాటు చేసినా?
ప్రభుత్వం జంతువుల పరిరక్షణకు సీక్రెట్ సర్వీస్ ఫండ్ ఏర్పాటు చేసింది. ఈ ఫండ్ కు రూ.4.06కోట్లు కేటాయించింది. వేటగాళ్లను పట్టుకునేందుకు సమాచారాన్ని అందించే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి నిధి ఉంది. అయినప్పటికీ పులులను వేటగాళ్ల బారి నుంచి రక్షించలేపోతుంది. ఇది అధికారుల వైఫల్యమేననే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు యాంటీ-పోచింగ్ స్క్వాడ్లు సైతం ఏర్పాటు చేసింది.
హైదరాబాద్, అమ్రాబాద్, నిర్మల్ జిల్లాల్లో ప్రత్యేకంగా పనిచేసే స్క్వాడ్లు ఏర్పాటు చేసి, పులుల సంరక్షణను బలోపేతం చేసింది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేగాకుండా పులుల కదలికలను ట్రాక్ చేయడానికి కెమెరా ట్రాప్‌లను ఉపయోగిస్తోంది. లోపం ఎక్కడుందో తెలియదుకానీ పులులు మాత్రం వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి.
ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారిస్తేనే..
రాష్ట్రంలో పులుల సంఖ్యగణనీయంగా పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. సుమారు 42కు పైగా ఉన్నట్లు గుర్తించినట్లు ప్రభుత్వానికి నివేదిక సైతం ఇచ్చినట్లు సమాచారం. అయితే వాటి సంరక్షణకు మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పులులు పెరుగుతున్న స్థాయిలోనేమృతి చెందుతుండటం ఆందోళన కలిగిస్తుంది.
దీంతో ప్రభుత్వం పటిష్టమైన నిఘా, అలసత్వం వహించే అధికారులపైనా చర్యలతోపాటు మరింత కఠిన చట్టాలు వస్తే తప్ప పులుల సంరక్షణ సాధ్యం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మంత్రి కొండా సురేఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also read: Tirupati: పవిత్ర పుణ్యక్షేత్రంలో మహా పాపం.. ఏం జరిగిందంటే?