Hyderabad: రోడ్డే కదా? అనుకుని మీ ఇంట్లో పోగైన చెత్తను, మీ ఇంటి మరమ్మతుల్లో మిగిలిపోయిన నిర్మాణ వ్యర్థాలను వేద్దామనుకుంటే ఇకపై పొరపాటే. రోడ్లపై, నాలాల్లో చెత్తాచెదారంతో పాటు భవన నిర్మాణ వ్యర్థాలు, ఇంట్లోని పాతకాలపు సోఫాలు, కుర్చీలు, బల్లలు వంటివి ఎక్కడబడితే అక్కడ వేస్తే, క్షణాల్లోనే మీరు అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఆహ్లాదకరంగా ఉంచటంలో జీహెచ్ఎంసీ ఒక్కటే పని చేస్తే సరిపోదని, ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమన్న విషయాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ, ప్రజల నుంచి కావల్సిన సహకారాన్ని పొందేందుకు కాస్త కఠినంగానే వ్యవహారించేందుకు సిద్దమైంది. రోడ్లపై చెత్తా, నిర్మాణ వ్యర్థాలను వేసే వారి నుంచి జరిమానాలు వసూలు చేసేందుకు జీహెచ్ఎంసీ నెల రోజుల నుంచి స్పెషల్ యాప్‌ను అమల్లోకి తెచ్చిన సంగతి తెల్సిందే. తొలుత కొద్దిరోజుల పాటు చెత్త, భవన నిర్మాణ, ఇతర వ్యర్థాలను వేసేవారికి అడపాదడపా జరిమానాలు విధించి ఆ తర్వాత కొంత కఠినంగా వ్యవహారించాలని భావించిన నేపథ్యంలో జరిమానాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది. చెత్త వేసేవారిని గుర్తించి జరిమానాలు వేసేందుకు వీలుగా శానిటేషన్ విభాగం సిబ్బందితో, అలాగే భవన నిర్మాణ వ్యర్థాలను వేసే వారిని గుర్తించేందుకు టౌన్ ప్లానింగ్ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఫీల్డుకు పంపి, ఈ ప్రక్రియను ముమ్మరం చేయనుంది.
Read Also- Vishnu Manchu: ప్రభాస్‌ను పొగుడుతూ.. మంచు మనోజ్‌పై విమర్శలు!
ఎలా గుర్తిస్తారు?
ఎవరైనా రోడ్డుపై చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలను ఎలా గుర్తిస్తారని భావించి చాలా మంది ఎంతో నిర్లక్ష్యంగా రోడ్లపైనే పారవేస్తుంటారు. కానీ మీరు చెత్త వేసిన మరుక్షణంలోనే స్థానికంగా విధులు నిర్వహిస్తున్న శానిటేషన్ సిబ్బంది అక్కడకు చేరుకుని తొలుత చెత్త ఏ రకమైందో నిర్థారిస్తారు. ఆ తర్వాత సమీపంలోని ఇంటి నుంచి గానీ, షాపు నుంచి సీసీ ఫుటేజీనీ సేకరించి వేసిన వారిని గుర్తిస్తారు. లేదంటే చెత్తను బట్టి స్థానికంగా ఏదైనా హోటల్ గానీ, రెస్టారెంట్ గానీ వేసినట్లు నిర్థారిస్తారు. ఆ తర్వాత వారికి జరిమానాలు విధిస్తారు. ఇదే రకంగా భవన నిర్మాణ వ్యర్థాలను వేసే వారిని కూడా ఫీల్డు లెవల్‌లో విధులు నిర్వహించే టౌన్ ప్లానింగ్ సిబ్బంది గుర్తిస్తుంది. ముఖ్యంగా నిర్మాణ వ్యర్థాలు పడిన చుట్టు పక్కల ప్రాంతంలో ఎక్కడ కొత్త నిర్మాణం జరుగుతున్న విషయాన్ని గుర్తిస్తారు. నిర్మాణం జరుగుతున్నట్లయితే నిర్మాణ అనుమతుల తనిఖీ చేసి, లేని పక్షంలో ఆ నిర్మాణాన్ని ప్రాథమిక దశలోనే అడ్డుకోవటంతో పాటు వ్యర్థాలు వేసినందుకు భారీగా జరిమానాలు విధించనున్నారు.

ఇప్పటి వరకు గ్రేటర్‌లోని 30 సర్కిళ్లలో చెత్త వేసినందుకు అధికారులు మొత్తం 2027 జరిమానాలు విధించారు. విధించిన జరిమానా విలువ మొత్తం రూ.44 లక్షల 25 వేలు కాగా, వీటిలో ఇప్పటి వరకు 1437 జరిమానాలకు సంబంధించిన 15లక్షల 8 వేల రూపాయలను వసూలు చేశారు. మరో 590 విధించిన జరిమానాలకు సంబంధించి రూ.29 లక్షల 16 వేలు వసూలు చేయాల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు. శనివారం ఒక్కరోజే 30 సర్కిళ్లలో సుమారు 86 జరిమానాలను జనరేట్ చేసి, వాటి నుంచి రూ. రూ.96 లక్షలను వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలకు సంబంధించి ఇప్పటి వరకు సిటీలోని 30 సర్కిళ్లలో టౌన్ ప్లానింగ్ బృందాలు 407 జరిమానాలను జనరేట్ చేసి, వాటి జరిమానాల విలువ రూ.37 లక్షల 85 వేలుగా లెక్క కట్టారు. వీటిలో 185 జరిమానాలకు చెందిన రూ.11 లక్షల 10 వేల నుంచి వసూలు చేయగా, ఇంకా మిగిలిన 222 జరిమానాలకు సంబంధించి విధించిన రూ. 26 లక్షల 75 వేలను వసూలు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. అలాగే శనివారం ఒక్క రోజే టౌన్ ప్లానింగ్ బృందాలు సుమారు 5 జరిమానాలను విధించి, రూ.70 వేలను ఆపరాధ రుసుము కింద వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.
Read Also- KCR: కేసీఆర్ స్కెచ్.. కేటీఆర్ అమలు.. ఫైనల్‌గా ఏమైంది?