Harish Rao on KTR: కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పక పాటిస్తానన్నారు.
పార్టీ మారుతానని.. జరుగుతోన్న చిల్లర ప్రచారాన్ని బంద్ చేయాలని విజ్ఞప్తి చేశారు. మాపార్టీలో ఎలాంటి పంచాయితీ లేదన్నారు. కేసీఆర్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని, గీత దాటే వ్యక్తిని కాదన్నారు.
కేటీఆర్ నాయకత్వంపై అనేక సార్లు నా అభిప్రాయాన్ని చెప్పానన్నారు. నాపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రాచారాన్ని అప్పుడే ఖండించానన్నారు. వచ్చిన వార్తలపై డీజీపీకి ఫిర్యాదు చేశానన్నారు. నాపై ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు అని కోరారు. ‘మై లీడర్ ఈజ్ కేసీఆర్.. వాటెవర్ కేసీఆర్ సే హరీష్ రావు విల్ ఫాలో..’ అని పేర్కొన్నారు.
అందాల పోటీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడని విమర్శించారు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతు కష్టం తీర్చడానికి ఈ ముఖ్యమంత్రికి సమయం లేకపోవడం దురదృష్టకరం అన్నారు. ఈ ప్రభుత్వానికి రైతులపై ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతున్నదన్నారు.
Also read: Chiranjeevi: షూటింగ్ గ్యాప్ లో శ్రీదేవి, నేను ఆ ఆట ఆడేవాళ్ళం.. మధ్యలో డిస్టర్బ్ చేసేవాళ్ళు..
ధాన్యపు రాశులను గాలికి వదిలేసి, అందాల పోటీలతో అందాల రాశుల చుట్టూ ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం తిరుగుతున్నదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో రైతులను అరిగోస పెడుతోందని, ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు.
ఈ యాసంగికి 70 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొంటామని ప్రభుత్వం చెప్పింది కానీ 40 లక్షల మెట్రిక్ టన్నులు కూడా దాటలేదన్నారు. కొన్న వడ్లకు 4 వేల కోట్లు బకాయి పడిందన్నారు. 48 గంటల్లో కొన్న ధాన్యానికి రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రగల్బాలు పలికారని, పది రోజులైనా కొన్న పంటకు డబ్బులు దిక్కులేదన్నారు.
బోనస్ ఊసే లేదన్నారు. యాసంగి పంటకు 512 కోట్ల రూపాయలు సన్నాలకు బోనస్ చెల్లించాల్సి ఉందని, కానీ ప్రభుత్వం ఐదు పైసలు కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నదని, లారీలు లేక కొన్న లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులోకి పోకుండా మిగిలిపోయిందన్నారు.
గన్నీ బ్యాగులను సమకూర్చడంలో వైఫల్యం అనిధ్వజమెత్తారు. తాలు, తరుగు పేరుతో రైతులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ధాన్యపు రాశులే సాక్షంగా, కొనుగోలు కేంద్రాల్లోనే జరుగుతున్న ఈ రైతు మరణాలు ప్రభుత్వం హత్యలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి సహజ మరణాలు కావు, ముమ్మాటికీ కాంగ్రెస్ నిర్లక్ష్యంతో జరిగినవే హత్యలే నని, దీనికి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షం మీద బురదజల్లబోయి నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావు రేవంత్ రెడ్డి అని అన్నారు.
Also read: LRS Extension: ఫలించని మంత్రం.. మూడోసారి ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగింపు..
ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోసినంత సులువు కాదని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి పాలనపై దృష్టి సారించి, రైతుల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేశారు. మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు నష్టం జరగకుండా చూడాలన్నారు.
సీఎం అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు.. తరుగు, తాలు పేరు మీద ఐదు నుండి పది కిలోలు తరుగు తీస్తున్నారు కాబట్టి తరుగు లేకుండా కొనుగోలు చేయాలన్నారు. రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.