Harish Rao: టిమ్స్ ఆసుపత్రుల ప్రారంభంపై రెండేళ్లుగా డేట్లు, డెడ్‌లైన్లు మార్చడం తప్ప చేస్తున్నదేమీ లేదని రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) విమర్శలు గుప్పించారు. నెల రోజుల్లోగా సనత్ నగర్ టిమ్స్(Sanath Nagar Tims)లో రోగులకు వైద్య సేవలు ప్రారంభమవుతాయని అక్టోబర్ 23న ప్రభుత్వం ప్రకటించి ఆదివారంతో నెల పూర్తయిందని, ప్రారంభిస్తున్నట్లా?, లేక ఎప్పటిలాగే మరో తేదీ ప్రకటిస్తారా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘కోతల ప్రభుత్వం దీనికి సమాధానం ఏమిటి?’ అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో గప్పాలు కొట్టడం తప్ప, టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి శూన్యమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తే తనికెళ్ల భరణి చెప్పే కవిత్వం లాగా ‘చెల్లికి పెళ్లి.. జరగాలి మళ్ళీ మళ్ళీ’ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూములను తెగనమ్మడంపై ఉన్న శ్రద్ధ, ప్రజలకు వైద్య సేవలు అందించే ఆసుపత్రుల మీద లేకపోవడం సిగ్గుచేటు అని హరీష్ ఆరోపించారు. సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనుల విషయంలో ప్రభుత్వ తీరు చూస్తే నత్త కూడా ఆత్మహత్య చేసుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు.
Also Read: CP Sai Chaitanya: మహిళా వేధింపుల కేసులో.. మరోసారి సీపీ సాయి చైతన్య సీరియస్
శంకుస్థాపన చేసి రికార్డు
కాంగ్రెస్ మంత్రుల మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప కూడా దాటదని చెప్పడానికి నగరానికి నలువైపులా పూర్తికాకుండా ఉన్న టిమ్స్ ఆస్పత్రులే నిదర్శనమని హరీష్ రావు విమర్శించారు. ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేయకుండా, పేదలకు వైద్యం అందించకుండా క్రిమినల్ నెగ్లిజెన్స్‌కు ప్రభుత్వం పాల్పడుతున్నదని మండిపడ్డారు. కరోనా తర్వాత వందేళ్ల ముందు చూపుతో హైదరాబాద్ నలువైపులా టిమ్స్ ఆసుపత్రులకు కేసీఆర్ రూపకల్పన చేశారని చెప్పారు. 2022 ఏప్రిల్ 26న నాడు దేశ చరిత్రలోనే తొలిసారి ఒకే రోజు మూడు ప్రభుత్వ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులకు శంకుస్థాపన చేసి రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు శరవేగంగా జరిగిన ఆసుపత్రుల నిర్మాణ పనులు, కాంగ్రెస్ రాగానే నత్తనడకన సాగుతున్నాయన్నారు. ఆసుపత్రులు పూర్తయితే కేసీఆర్(KCR)కు ఎక్కడ పేరు వస్తుందోన్న కురుచ బుద్దితో, ఉద్దేశ్యపూర్వకంగానే టిమ్స్ ఆసుపత్రులను పూర్తి చేయడం లేదన్నారు. కమీషన్ల కోసం రెండేళ్లుగా పనులు పూర్తి చేయకుండా, వైద్య సేవలు అందకుండా ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని దుయ్యబట్టారు. అక్టోబర్ 3న బీఆర్ఎస్ పార్టీ తరపున కొత్తపేట టిమ్స్ ఆసుపత్రి సందర్శించి, ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేయడంతో ప్రభుత్వ పైఫల్యాన్ని నిలదీస్తే హడావుడిగా సమీక్షలు నిర్వహించి, ఆసుపత్రి ప్రారంభ తేదీలను ప్రకటించారన్నారు. ప్రజల తరుపున ప్రశ్నించినందుకు బీఆర్ఎస్‌పై మంత్రులు విమర్శలు గుప్పించారంటూ హరీష్ రావు ప్రస్తావించారు. పనులు త్వరితగతిన చేపడుతామని సాక్షాత్తూ మంత్రి చెప్పిన మాటలకే విలువ లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పై నోరుపారేసుకోవడం మానేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలను పక్కనపెట్టి టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు వైద్య సేవలు అందించాలని హరీష్ రావు కోరారు.
Also Read: Weather Update: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాలకు రానున్న రెండు రోజులు భారీ వర్ష సూచన..!

