Harish Rao: బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కాంగ్రెస్, బీజేపీలు డ్రామాలు చేస్తున్నాయని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish Rao) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ‘ఎక్స్’ వేదికగా ఆయన జాతీయ పార్టీల వైఖరిపై మండిపడ్డారు. ‘కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలు మద్దతు ఇస్తే, బీసీ రిజర్వేషన్ల పెంపును ఆపేదెవరు?’ అని హరీశ్ సూటిగా ప్రశ్నించారు. పార్లమెంట్‌లో బీజేపీకి 240 మంది, కాంగ్రెస్‌కు 99 మంది ఎంపీల బలం ఉన్నా, రిజర్వేషన్ల బిల్లు పెంపును అడ్డుకునేది ఎవరు? అంటూ ఆయన నిలదీశారు.
జన గణనను నాలుగేళ్లుగా వాయిదా..
రిజర్వేషన్ల పెంపుపై ఢిల్లీలో కొట్లాడాల్సిన జాతీయ పార్టీలు బీసీలను మభ్యపెడుతూ గల్లీలో డ్రామాలు చేస్తున్నాయని, బీసీలను అవమానిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుసార్లు జనాభా లెక్కింపు చేసిన కాంగ్రెస్ ఏనాడు బీసీ గణన చేపట్టలేదని మాజీ మంత్రి ఆరోపించారు. బీజేపీ ఏకంగా జన గణనను నాలుగేళ్లుగా వాయిదా వేస్తూ వస్తోందని మండిపడ్డారు. గడిచిన 35 ఏళ్లలో ఈ దేశాన్ని కాంగ్రెస్ 15 ఏళ్లు, బీజేపీ 17 ఏళ్లు పాలించినా బీసీలు గుర్తుకు రాలేదన్నారు. కానీ, ఇప్పుడు కపట ప్రేమ నటిస్తున్నాయని విమర్శించారు.
Also Read: US Obesity Study: అధిక బరువుతో అమెరికా బేజారు.. ఉబకాయంలో ఆల్‌టైమ్ రికార్డ్.. ఇలా అయితే కష్టమే!
బీఆర్ఎస్ పూర్తి మద్దతు
కేసీఆర్ 2005లోనే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరిన ఏకైక నేత అని హరీశ్ గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచాలని బీఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా, స్వయంగా ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసినా కేంద్రంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చలనం రాలేదన్నారు. రాహుల్ పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎందుకు పెట్టడం లేదని, కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) సహా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు.
గల్లీలో డ్రామాలు..
రాజకీయ లబ్ధి కోసం ఒకరిని మించి ఇంకొకరు నటిస్తూ, పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్ల పెంపు సాధించాల్సింది పోయి కాలయాపన చేస్తున్నాయని హరీశ్ ఆరోపించారు. ఏ పార్టీ బిల్లు పెట్టినా దానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని, ఎలాంటి పోరాటానికైనా కలిసి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా గల్లీలో డ్రామాలు కట్టిపెట్టి, ఢిల్లీ వేదికగా పోరాటం మొదలు పెట్టాలని కాంగ్రెస్, బీజేపీలను హరీశ్ డిమాండ్ చేశారు.
Also Read: PDS Rice Scam: కండ్లకోయలో భారీగా అక్రమ రేషన్ బియ్యం దందా.. వాటి విలువ ఎంతో తెలిస్తే షాక్..!
