Harish Rao on CM Revanth: సీఎం రేవంత్ రెడ్డి కి చిత్తశుద్ది ఉంటే, మీ 18 నెలల పాలనలో కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ కు నియామక పత్రాలు అందించి, తమ ఘనతగా చెప్పుకునేందుకు సీఎం తంటాలు పడ్డారన్నారు.
ఉద్యోగాల్లో చేరుతున్న వారిలో ఉత్సాహాన్ని నింపాల్సింది పోయి, వార్నింగ్ ఇచ్చి, భయబ్రాంతులకు గురి చేశారన్నారు. అధికారులను ఉరి తీయాలని విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలు చెబుతాయా? ఇది ప్రజాస్వామ్యమా లేక రేవంత్ రాచరిక రాజ్యమా? అని ప్రశ్నించారు.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్..సెక్రటేరియట్ లో సమావేశానికి రైతులకు పిలుపు!
ఇంతకంటే అజ్ఞానం ఉన్న వ్యక్తి సోమాలియా నుంచి అమెరికా వరకు ఎక్కడ వెతికినా కనిపించడు కావొచ్చు అన్నారు. రాజకీయ నాయకుల సూచనలు పాటిస్తే, ఊచలు లెక్కపెడుతారని ఇంజినీర్లను హెచ్చరిస్తున్న రేవంత్ రెడ్డి, ఏ జ్నానంతో కాళేశ్వరం కూలిందని దుష్ప్రచారం చేస్తున్నావు అని మండిపడ్డారు. నువ్వేమన్నా ఇంజినీర్ వా?, ఇరిగేషన్ నిపుణుడివా?అన్నారు.
కాళేశ్వరంపై మేము చేసిన ఖర్చు ఓసారి లక్ష 50వేల కోట్లు అంటవు, ఓసారి లక్ష కోట్లు అంటవు, ఓ సారి ఒక్క గుంటకు నీళ్లు ఇవ్వలేదంటవు, మరోసారి 50వేల ఎకరాలకే నీళ్లు ఇచ్చినవు అంటడు.. నీది నోరేనా రేవంత్ రెడ్డి? అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20లక్షల ఎకరాలకు (కొత్త, స్థిరీకరణ) సాగునీరు అందించినట్లు అసెంబ్లీ సాక్షిగా మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలోనే ప్రకటించారని, మళ్లీ ఇప్పుడు 50వేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని గోబెల్స్ ప్రచారం చేస్తున్నావని మండిపడ్డారు.
Alos Read: CM Revanth Reddy: ఆ నిధులు ఎవరి జేబులోకి వెళ్లాయి? జల సౌధలో సీఎం సంచలన కామెంట్స్!
లక్ష కోట్లు కొట్టుకుపోయాయని, ప్రాజెక్టు కుప్ప కూలిందనే దుష్ర్పచారం పూర్తి అబద్దమని ఎన్డీఎస్ ఏ రిపోర్టు తేటతెల్లం చేసిందన్నారు. 99శాతం ప్రాజెక్టు బాగుండి, ఒక్క శాతం మాత్రమే మరమ్మతుకు గురి కావడం వాస్తవం కాదా? అన్నారు. ఎస్ ఎల్ బీ సీ విషయంలో సీఎం మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. మూడు నెలలు కావొస్తున్నా సొరంగంలో కూరుకుపోయిన వారి జీవితాలు గుర్తుకురావడం లేదా?అన్నారు.రాజకీయాలు మాట్లాడటమే తప్ప, కుప్ప కూలిన ఎస్ ఎల్ బీ సీ భవితవ్యం గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదన్నారు. 9 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో 3900 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 12 కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తి చేసింది వాస్తవం కాదా? అన్నారు.
తప్పుడు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. రేవంత్ పాలనలో పెరిగింది ఇరిగేషన్ కాదు, ఇరిటేషన్ అన్నారు. ఏడాదిన్నర పాటు ఇరిగేషన్ రంగాన్ని పూర్తి నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు ప్రాధాన్య రంగమని మాటలు చెబుతుండటం హాస్యాస్పదం అన్నారు. ఆరు ప్రాజెక్టులు పూర్తి చేసి, ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తమని అసెంబ్లీ సాక్షిగా చెప్పి మాట తప్పారన్నారు.
మీ నిర్లక్ష్యం వల్ల పెద్దవాగు తెగిపోయింది, ఎస్ఎల్బీసీ కుప్ప కూలింది.. వట్టెం పంపు హౌజ్ మునిగిపోయిందన్నారు. పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ కింద, 17.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు క్రియేట్ చేశాం.. 31.50 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేశాం.. మొత్తంగా 48 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించి, సాగును బాగు చేశామన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు