CM Revanth Reddy: 2 లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా..ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదంటే బీఆర్ ఎస్ నిర్లక్ష్యమేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ నిధులు ఎవరికి జేబులోకి వెళ్లాయి? అంటూ ప్రశ్నించారు. మేధావులు, ఉద్యోగులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. 80 వేల పుస్తకాలు చదవిన వ్యక్తి ఇంజినీర్ గా మారి కాళేశ్వరం కడితే ఎలా ఉంటుందో? ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైందన్నారు. ఇక గ్రూప్ వన్ నియామకాలను అడ్డుకోవడం వెనక ఉన్న రాజకీయ నాయకులు ఎవరో తెలుసునని స్పష్టం చేశారు.
త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామన్నారు. ఆయన హైదరాబాద్ జల సౌధలో ఇరిగేషన్ శాఖ లో కొత్తగా ఎంపికైన ఏఈఈ, జేటీవోలకు ఆయన నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..నీళ్ల కోసం మొదలైన ఆకాంక్షనే రాష్ట్రాన్ని సాధించి పెట్టిందన్నారు. ఉద్యోగంగా పనిచేసే కంటే భావోద్వేగంతో వర్క్ చేయాలని సూచించారు. రాజకీయ పార్టీలు లబ్ధి పొందాలని చూస్తాయని, కానీ ఉద్యోగులుగా న్యాయం చేయాలని సూచించారు.
Also Read: Miss World Contestants: కట్టు బొట్టుతో ఆకట్టుకున్న అందాల భామలు
ప్రాజెక్టులు పూర్తి చేయాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అందుకే నీటి పారుదల శాఖలోని ఖాళీలను భర్తీ చేస్తున్నామన్నారు. గతంలో కట్టిన సాగునీటి ప్రాజెక్టులకు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా…ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నారు. కానీ కాళేశ్వరం మూడేళ్లలోనే కట్టడం, కూలడం రెండూ జరిగిపోయాయని గుర్తు చేశారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో 50 వేల ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేదన్నారు. కట్టిన మూడేళ్లలో కుప్పకూలిన ప్రాజెక్టు భూ ప్రపంచంలో కాళేశ్వరం మాత్రమే అని వివరించారు.
ఎలా కట్టకూడదో ?ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో అనే దానికి ఉదాహరణ కాళేశ్వరం అని వెల్లడించారు.మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కట్టిన చోట కనీసం సాయిల్ టెస్ట్ చేయలేదన్నారు. ఎవరి నిర్లక్ష్యంతో ఎస్ ఎల్ బీసీ పూర్తి కాలేదో అందరికీ తెలుసునని చెప్పారు. తమ ప్రభుత్వం ఎస్ ఎల్ బీసీ, సీతారామ, దేవాదుల, నెట్టెంపాడు, సమ్మక్క సారక్క ను మొదటి ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులుఉన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com లింక్ క్లిక్ చేయగలరు