MLA Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ జాతీయ నాయకత్వం ఆమోదించడంతో ఆయన పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ (Raja Singh) స్పందించారు. ఈ మేరకుఓ వీడియో రిలీజ్ చేశారు. తాను బీఆర్ఎస్ (BRS) లేదా కాంగ్రెస్‌లో చేరుతారని కొన్ని మీడియా ఛానల్స్‌లో వార్తలు వస్తున్నాయని, కానీ, తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత ఏం చేయాలనేది నిర్ణయిస్తానన్నారు. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయవద్దని ఆయన అభ్యర్థించారు.
Also Read: Hyderabad Commissioner: లాల్ దర్వాజాకు సీపీ.. బోనాలకు పటిష్ట బందోబస్తు
కార్యకర్తల కృషి
తెలంగాణలో బీజేపీ (BJP) అధికారంలోకి రావడానికి రాత్రి, పగలు తేడాలేకుండా కష్టపడుతున్న లక్షలాది మంది కార్యకర్తల కృషిని ఢిల్లీకి తెలియజేయడంలో తాను విఫలమయ్యానని తెలిపారు. 11 ఏండ్ల క్రితం జూలైలోనే తాను బీజేపీలో చేరినట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రజలకు, దేశానికి సేవ చేసేందుకే బీజేపీలో చేరినట్లు వెల్లడించారు. పార్టీ నమ్మి తనకు వరుసగా మూడుసార్లు టికెట్ ఇచ్చిందన్నారు. ఇన్నిరోజులు తనకు సహకరించిన ప్రతి కార్యకర్తకు రాజాసింగ్ (Raja Singh) ధన్యవాదాలు తెలిపారు.
ఆలోచన చేయలేదు
తాను పార్టీలో ఎలాంటి పదవి, అధికారాన్ని ఆశించలేదని, వ్యక్తిగతంగా పేరు కోసం కూడా ప్రయత్నించలేదన్నారు. తన చివరి శ్వాస వరకు హిందుత్వవాదం, సనాతన ధర్మం, జాతీయవాదం కోసం పనిచేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తన రాజీనామా వెనుక ఉన్న ఆవేదన గురించి ఢిల్లీ పెద్దలు ఆలోచన చేయలేదన్నారు. ఏ పదవులు లేనప్పుడే దేశద్రోహులపై పోరాటం చేశానని, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా దేశద్రోహుల కోసం పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు. ఇకముందు కూడా దేశద్రోహులు, ధర్మ ద్రోహులపై పోరాటం చేస్తానని వెల్లడించారు. బీజేపీలో ఉన్న హిందుత్వవాదులు, ధర్మకర్తలు ఎవరు భయపడొద్దని, వారి మద్దతు ఇలాగే ఉండాలని రాజాసింగ్ (Raja Singh) కోరారు.
Also Read: Ujjaini Mahankali: అమ్మవారికి బోనం సమర్పించిన గవర్నర్ దంపతులు