GHMC: జీహెచ్ఎంసీ పరిధిలోకి 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో గ్రేటర్ హైదరాబాద్ పుర పాలనలో ప్రభుత్వం ఒక నూతన దశకు శ్రీకారం చుట్టిందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. ఈ విలీనంతో జీహెచ్ఎంసీ పరిధి 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2,053 చదరపు కిలోమీటర్లకు విస్తరించగా, విస్తీర్ణం, జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా జీహెచ్ఎంసీ అవతరించిందన్నారు. ఉప్పల్, ఎల్బీనగర్ , రాజేందర్ నగర్ లో జోనల్ ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డుల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 300కు వార్డులుగా పునర్విభజించినట్లు ఆయన వెల్లడించారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా, గెజిట్‌లో నోటిఫై చేసిన సమగ్ర డీలిమిటేషన్ ప్రక్రియ అనంతరం జీహెచ్ఎంసీ వార్డుల సంఖ్య 300కు సర్కారు పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Also Read: GHMC: జీహెచ్ఎంసీసీకి కొత్త జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. జరిగే మార్పులివే..!
ప్రజలకు మరింత చేరువ
దీని ద్వారా ప్రజాప్రాతినిధ్యాన్ని మరింత బలోపేతం చేయడం, పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించడం తద్వారా విస్తరించిన పట్టణ ప్రాంతాల్లో పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వికేంద్రీకృత పాలనకు జోన్లు, సర్కిళ్ల పునర్నిర్మాణం కూడా చేసినట్లు వెల్లడించారు. విలీనంతో పెరిగిన పరిపాలనా బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు, జీహెచ్ఎంసీలోని గత 6 జోన్లు, 30 సర్కిళ్లను 12 జోన్లు, 60 సర్కిల్లకు పెంచినట్లు, ఇందుకు సర్కారు కూడా ఆమోదం తెలిపినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం రూపాంతరం చెందిన జీహెచ్ఎంసీ జనాభా మొత్తం కోటి 34 లక్షలకు మంచి ఉండటంతో ఈ మార్పులు వికేంద్రీకరణ, పరిపాలనా సమానత్వం, మెరుగైన సేవలందించేందుకు దోహదపడుతాయన్నారు.
జీహెచ్ఎంసీకి 12 మంది జోనల్ కమిషనర్లు
నూతన పరిపాలనా నిర్మాణానికి అనుగుణంగా, జీహెచ్ఎంసీకి 12 మంది జోనల్ కమిషనర్లను ప్రభుత్వం నియమించిందని తెలిపారు. వీరంతా డిసెంబరు 26 న బాధ్యతలు స్వీకరించడంతో, పునర్వ్యవస్థీకరించిన జోన్లలో పరిపాలన తక్షణమే అమల్లోకి తెచ్చామని వెల్లడించారు. దీని వల్ల క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పాలన మరింత బలోపేతమవుతుందని ఆయన వివరించారు. విస్తరించిన జీహెచ్ఎంసీ పరిధితో సరిపడా భూలభ్యత, రవాణా, నివాసం, వర్షపు నీటి పారుదల, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో సమగ్ర మెట్రోపాలిటన్ ప్రణాళికలు అమలు చేసే అవకాశం లభించిందని, కొత్తగా విలీనమైన ప్రాంతాలకు జీహెచ్ఎంసీ నిధులు, సాంకేతిక నైపుణ్యం, పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రజారోగ్యం, దోమల నివారణ, అత్యవసర సేవలు మరింత వేగవంతంగా అందనున్నట్లు వివరించారు.
Also Read: GHMC: డీలిమిటేషన్ పై ముగిసిన స్టడీ.. సర్కారుకు నివేదిక సమర్పించిన జీహెచ్ఎంసీ!

