Etela vs Bandi Sanjay: బీజేపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)పై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender)పరోక్ష విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా బండి చేసిన వ్యాఖ్యలకు ఈటల కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ(Modhi) కూడా మజీద్‌కు, చర్చికి వెళ్లారని ఈటల గుర్తుచేశారు. అలాంటిది తెలంగాణలో డివిజన్(హిందూ, ముస్లింలను విభజించి) పాలిటిక్స్‌తో అధికారంలోకి రాలేమని ఈటల హాట్ కామెంట్స్ చేశారు. కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడవని చురకలంటించారు. బీజేపీ అభివృద్ధి అజెండాగా రాజకీయాలు చేస్తుందని వివరించారు. కేంద్రం ఇచ్చే పథకాలు, అభివృద్ది పనుల లబ్ధిదారుల్లో ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఉన్నారని ఉదాహరణగా రాజేందర్ చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా తన వ్యక్తిగత అభిప్రాయమే అని చెబుతూనే సంచలన వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చనీయాశంగా మారింది.
ఈ వైఖరే బీజేపీ వెనుకబడేందుకు కారణం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. మొలతాడు ఉన్నవారికి లేని వారికి మధ్య జరుగుతున్న బై పోల్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ బై పోల్ ఫలితాల తరువాత ముస్లింలకు కొమ్ముకాసే దుస్థితి ఉందని కాపు కులస్తుల కార్తీక వన భోజన కార్యక్రమంలోనూ బండి అదే తరహా కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ ఫలితాల తరువాత హిందువుల్లో కసి పెరిగిందని, హిందువులను ఓటు బ్యాంకుగా మారాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణలో ఇతర మతాల్లో చేరిన హిందువులంతా ఘర్ వాపసీ రావాలని బండి పిలుపునిచ్చారు. కాగా ఈ వైఖరే బీజేపీ వెనుకబడేందుకు కారణంగా మారిందనేలా ఈటల పరోక్ష వ్యాఖ్యలు చేయడంతో వైరం మళ్లీ బయటపడింది. సంజయ్ కామెంట్స్ చేసిన మరుసటి రోజే రాజేందర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Also Read: Local Body Elections: స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కార్
బండి, ఈటల నడుమ ఆది నుంచే వర్గ పోరు
బండి సంజయ్, ఈటల రాజేందర్ నడుమ ఆది నుంచే వర్గ పోరు కొనసాగుతోందని చర్చించుకుంటున్నారు. ఈ వర్గ పోరు చిలికి చిలికి గాలివానగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఒకరు కేంద్ర మంత్రిగా.. ఒకరు ఎంపీగా ఉండటం, అందులోనూ ఇద్దరిదీ ఒకే జిల్లా కావడం.. వీరి మధ్య ఆధిపత్య పోరుకు కారణంగా తెలుస్తోంది. దీంతో నిత్యం ఇరువర్గాల నడుమ మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఈటల రాజేందర్ కౌంటర్ ఇవ్వడంతో ఇరువురి మధ్య వార్ మొదలైంది. ఈ అంశంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇద్దరూ కీలక నేతలే కావడంతో ఎవరికీ ఏమీ చెప్పలేని స్థితిలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఇష్యూను ఇలాగే వదిలేస్తే.. ఇరువురు నేతల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధంతో పార్టీకి నష్టం జరుగుతోందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. శ్రేణులు సైతం ఒకరిని కలిస్తే మరొకరికి దూరం కావాల్సి వస్తుందనే భయంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరి ఈ ఇష్యూకు రాష్ట్ర నాయకత్వం ఎలా చెక్ పెడుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: SS Rajamouli: రాజమౌళి పై కేసు నమోదు.. దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమన్న వానరసేన?
