Etela Rajender: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) పేరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో తన వర్గీయులను బరిలో నిలిపి, తన రాజకీయ ఉనికిని మరోసారి చాటుకునేందుకు ఆయన పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది. బీజేపీలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు, తన అనుచరులకు సరైన ప్రాధాన్యత లభించడం లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈటల నేరుగా కదన రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. నియోజకవర్గంలో తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలని ఆయన భావిస్తున్నారట.
ధాటిగా అభ్యర్థుల ఎంపిక
ఈ నెల 24, 25 తేదీల్లో హుజూరాబాద్, జమ్మికుంటల్లో పర్యటించనున్న ఈటల రాజేందర్, అక్కడ పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చలు జరపనున్నట్లు తెలియవచ్చింది. మున్సిపల్ ఎన్నికలకు తాను దూరంగా ఉంటానని జరుగుతున్న ప్రచారానికి స్వస్తి పలకాలని ఆయన నిశ్చయించుకున్నట్లు సమాచారం. రిజర్వేషన్ల మార్పులు, ఇతర పార్టీల నేతల చేరికల వల్ల సొంత క్యాడర్ అసహనంతో ఉన్న తరుణంలో, ఈటల రాక పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతోంది. ‘మీ సపోర్ట్ లేకపోతే గెలవడం కష్టం’ అంటూ నిత్యం వందలాది మంది ఈటలకు ఫోన్ చేసి అభ్యర్థిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
Also Read: Etela Rajender: నేను సీరియస్ పొలిటీషియన్.. ఎంపీ ఈటల హాట్ కామెంట్స్
మారనున్న ముఖచిత్రం
రోజు రోజుకూ మారుతున్న సమీకరణాల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల సమరంలో కాలుమోపాలని ఈటల తీసుకున్న నిర్ణయం హుజూరాబాద్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా కనిపిస్తోంది. పార్టీలు బీ-ఫామ్‌లు ఇచ్చినా, క్షేత్రస్థాయిలో ఈటల సపోర్ట్ ఉంటేనే గెలుస్తామనే ధీమాతో అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గోడు విన్న ‘సారు’ ఇక ఉపేక్షించకూడదని భావించడంతో, మున్సిపల్ పోరులో రాజేందర్ తనదైన మార్క్ చూపడం ఖాయంగా కనిపిస్తోంది. సారోస్తేనే తమకు ఢోకా లేదంటూ ఇప్పటికే అభ్యర్థులు సంబరాల్లో మునిగిపోతున్నారు.
Also Read: Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

