Pawan Kalyan: సీఎం చంద్రబాబు నాయుడు వద్ద తాను పాలనకు సంబంధించిన విషయాలను నేర్చుకుంటున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కర్నూలు జిల్లా పుడిచర్ల గ్రామంలో పర్యటించిన పవన్ కళ్యాణ్.. 1.55 లక్షల ఇంకుడు గుంతల నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ.. జై పవన్ జై జై పవన్ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నేడు పల్లె పండుగ వాతావరణం నెలకొందని, అందుకు ప్రధాన కారణం జాతీయ ఉపాధి హామీ పథకాల అమలు, రోడ్ల నిర్మాణాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలే అన్నారు. ఇంతటి పండుగ వాతావరణం పల్లెలకు అందించిన ఐఏఎస్ అధికారులు శశి భూషణ్, కృష్ణ తేజలను పవన్ అభినందించారు.
తాను మనుషులను గెలుపు సమయం లో లెక్కించనని, కానీ కష్ట సమయంలో ఎలా ఉన్నారని తప్పక చూస్తానన్నారు. కష్టాల సమయంలో ప్రజలు అండగా ఉండి కూటమి పార్టీకి అఖండ మెజారిటీ అందించాలన్నారు. తెగించి రోడ్లమీదకు నాయకులు వస్తే.. వెనక ప్రజాబలంతో 164 సీట్లు, 21 ఎంపీ సీట్లు గెలిచినట్లు తెలిపారు. సామాన్య విజయం కాదని, దేశం మొత్తం తలవిప్పి ఏపీ వైపు చూసిన అఖండ విజయం అంటూ పవన్ పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాలో 75 కోట్ల రూపాయలతో 117 కిలోమీటర్ల సిసి రోడ్ల నిర్మాణం సాధ్యమైందని, జాతీయ ఉపాధి హామీ పథకంలో 98 శాతం రోడ్ల నిర్మాణం పూర్తి చేయడంపై జిల్లా కలెక్టర్ రంజిత్ భాషను పవన్ కళ్యాణ్ అభినందించారు. గ్రామ పంచాయతీలకు ఇప్పటివరకు చాలా తక్కువ నిధులు ఇచ్చేవారని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి వ్యవస్థను బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
అనుభవజ్ఞులైన సీఎం చంద్రబాబు నాయుడు వద్ద తాను ఎన్నో నేర్చుకుంటున్నానని, మనకంటే అనుభవజ్ఞుల వద్ద నేర్చుకోవడానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానంటూ పవన్ అన్నారు. పవన్ ఈ మాట చెప్పగానే నాయకులు, కార్యకర్తలు, ప్రజలు చప్పట్లతో మారు మ్రోగించారు.
పిఠాపురం వేదికగా పార్టీ ఆవిర్భావ సభలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టింది తానేనంటూ పవన్ చేసిన కామెంట్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా కర్నూలు వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు వద్ద తాను రాజకీయాలు నేర్చుకుంటున్నానని, అలాగే పాలనాపరమైన అంశాలపై నిత్యం నేర్చుకునేందుకు తాను ఎప్పుడూ సిద్ధమని పవన్ చెప్పడం విశేషం.
Also Read: YS Sharmila: చంద్రబాబు, జగన్, పవన్.. ఒక్కటి కావాలి.. షర్మిల సంచలన ట్వీట్..
ఆవిర్భావ సభలో పవన్ చేసిన కామెంట్స్ కు.. టిడిపికి చెందిన కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ సాగించారు. ఏది ఏమైనా కూటమిలో గల తాము ఎప్పటికీ ఐక్యంగా ఉంటామని, ఎవరి పన్నాగాలు తమ వద్ద చెల్లవని పవన్ మరో మారు బహిరంగ సభ ద్వారా చెప్పినట్లు చెప్పవచ్చు.