YS Sharmila: జగన్ నోరు విప్పితే కదా.. జగన్ మాట్లాడడు.. ఏకంగా కేంద్రంలో ఉన్న బిజెపికి మద్దతు తెలిపినట్లు వ్యవహరిస్తారు.. వారేమో అలా.. జగన్ ఏమో ఇలా.. ఇది న్యాయమా అంటూ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీరియస్ కామెంట్స్ చేశారు. ఇంతకు వైయస్ షర్మిల సీరియస్ కామెంట్స్ వెనుక అసలు అంతరార్థం ఏమిటో తెలుసుకుందాం.
ఇటీవల డీలిమిటేషన్ పేరుతో కేంద్రం నియోజకవర్గాల పునర్విభజనకు శ్రీకారం చుట్టనుంది. ఈ ప్రక్రియపై రాజకీయ విశ్లేషకులు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేకూర్చేందుకే కేంద్రం డీలిమిటేషన్ పేరుతో నియోజకవర్గాల పునర్విభజనకు పూనుకుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అంశం లక్ష్యంగా వైఎస్ షర్మిల ఓ ట్వీట్ చేశారు.
షర్మిల ఏమన్నారంటే.. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదు. ప్రజల హక్కుల కోసం చేసే పోరాటం. జనాభా ప్రాతిపదికన సీట్లను విభజిస్తే దక్షిణాదికి జరిగేది తీరని నష్టమే. ఉత్తరాది ప్రాబల్యం మరింతగా పెరిగి.. సౌత్ రాష్ట్రాల ప్రాధాన్యతతో పనిలేకుండా పోతుందన్నారు. సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది అనే పరిస్థితి ఎదురుకాక తప్పదని, డీలిమిటేషన్ పేరుతో లిమిటేషన్ ఫర్ సౌత్‌లా చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజనను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత విధానంతో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 143 సీట్లకు పెరిగితే.. దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ లాంటి ప్రధాన రాష్ట్రాల్లో పెరిగే సీట్లు 144 మాత్రమేనని, ఇది కాదా వివక్ష చూపడం అంటే ? యూపీ,బీహార్ రెండు రాష్ట్రాలు కలిపితే 222 సీట్లు పెరిగితే.. సౌత్ మొత్తం తిప్పి కొట్టినా 192 సీట్లకే పరిమితమన్నారు. ఇది కాదా దక్షిణ భారతంకి జరిగే అన్యాయం అంటూ ఆమె ప్రశ్నించారు.
డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరాటానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. ఐక్యంగా పోరాటం చేస్తే తప్పా నియంత మోడీకి బుద్ధి రాదని, ఏపీలో మోడీ పక్షంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనం వహించడం రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్లేనని తెలిపారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సైతం నోరు విప్పకపోవడం మోడీకి పరోక్ష మద్దతని ఒప్పుకున్నట్లేనని విమర్శించారు. డీలిమిటేషన్ పై రాజకీయాలు పక్కన పెట్టి టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు ముందుకు రావాలని కోరారు. మూడు పార్టీల అధినేతలు తమ వాణి వినిపించాలని డిమాండ్ చేశారు.
Also Read: AP Fee Reimbursement: విద్యార్థులకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్స్ చెక్ చేయండి
షర్మిల చేసిన ట్వీట్ కి పలువురు నెటిజన్స్.. ఇది నిజమే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, దీనిని అందరూ అడ్డుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం కేంద్రం తీరుకు మద్దతు తెలుపుతున్నారు.