deputy cm bhatti vikramarka counters kcr tweet of power cut ఎంట్రీ ఇచ్చాడో లేదో సోషల్ వార్ మొదలైందిగా..!
Political News

Power: ఎంట్రీ ఇచ్చాడో లేదో సోషల్ వార్ మొదలైందిగా..!

KCR: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న సోషల్ మీడియా ఎక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వచ్చీరాగానే ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంట్ పోయిందని కేసీఆర్ తన ఎక్స్ హ్యాండిల్‌లో పోస్టు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంలు కరెంట్ పోవడం లేదని చెబుతున్నారని, కానీ, రోజుకు పది సార్లు కరెంట్ పోతున్నదని తనతో పాటే ఉన్న మాజీ ఎమ్మెల్యేలు చెప్పారని వివరించారు. కేసీఆర్ అలా ఎక్స్‌లోకి వచ్చారో లేదో.. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎటాక్ చేయడం మొదలు పెట్టారే అని అందరూ అనుకుంటున్నారు. కానీ, అది విమర్శ కాదని.. వట్టి అబద్ధపు ఆరోపణ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తేల్చేశారు.

Also Read: రూట్ మార్చిన కేసీఆర్.. అంతలోనే ఇంత మార్పా?

ఎక్స్‌లోనే కేసీఆర్‌ ట్వీట్‌కు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. మహబూబ్‌నగర్ టీఎస్ఎస్‌పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ నిర్దారించిన పత్రాన్ని పోస్టు చేసి మరీ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలని కొట్టిపారేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు కరెంట్ పోయిందని కేసీఆర్ ట్విట్టర్‌లో చేసిన ప్రకటన పూర్తిగా అవాస్తవం అని తేల్చేశారు. కరెంట్ కట్ అయినప్పుడు సబ్ స్టేషన్ ట్రాన్స్‌ఫార్మర్ల మీటర్‌లు వాటంతట అవే రికార్డ్ చేస్తాయని, ఆ మీటర్‌లో చెక్ చేసినప్పుడు మహబూబ్‌నగర్‌లో కరెంట్ కట్ అయినట్టు లేదని ఎస్‌ఈ వెల్లడించారు. కేసీఆర్ ప్రస్తావించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసానికి కరెంట్ నిరంతరాయంగా అందిందని స్పష్టం చేశారు. శ్రీనివాస్ గౌడ్ నివాసానికి విద్యుత్ అందించే సబ్‌స్టేషన్‌లో తనిఖీ చేసినా.. కరెంట్ కట్ అయినట్టు లేదని తెలిపారు. ఆ చుట్టుపక్కలా చూసినా కరెంట్ కోత జరగలేదని డిజిటల్ రికార్డు రీడింగ్ ద్వారా స్పష్టమవుతున్నదని వివరించారు.

ఇదే లెటర్‌ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్టు చేశారు. కేసీఆర్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు అవాస్తవాలని తేల్చారు. కేసీఆర్ నిద్రలేచింది మొదలు అవాస్తవాలు, అభూత కల్పనలతో కాలం గడిపేస్తున్నారని అన్నారు. పార్లమెంటు ఎన్నికల ముందర రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సూర్యాపేట పట్టణంలోనూ ఆయన ఇటీవలే ఇదే తరహా వ్యాఖ్యలు చేశారని, విద్యుత్ శాఖను అప్రతిష్టపాలు చేసే యత్నం చేసి అబాసుపాలయ్యారని విమర్శించారు. అధికారం చేజారడంతో అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేసి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?