BRS Party: బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ ఎక్స్(ట్విట్టర్)లోకి ఎంట్రీ ఇచ్చారు. కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అని ఖాతా పేరు పెట్టుకున్నారు. ఫస్ట్ డేనే పలు ట్వీట్లతో దూకుడు పెంచారు. తెలంగాణ ఆవిర్భావించిన రోజునే ఆయన ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. ఆయన తొలి ట్వీట్ కూడా దాని గురించే ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, క్యాడర్, అభిమానులకు, రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆ వెంటే మరికొన్ని ట్వీట్లు చేశారు. ఇవి ఆయన ప్రచారానికి సంబంధించిన అప్‌డేట్లు, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలతో ఉన్నాయి. ఇది ఆయన ఎక్స్ ఎంట్రీకి సంబంధించిన విషయం. కానీ, ఇక్కడ మరో విషయాన్ని గమనించవచ్చు. కేసీఆర్ అధికారం పోగానే ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలను పెంచారు.
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కనిపించేవారు కాదు. ఎక్కువ కాలం ఫామ్‌హౌజ్‌లోనే గడిపారు. పార్టీ నాయకులు కాదు కదా.. చాలా సార్లు మంత్రులకు కూడా ఆయన అపాయింట్‌మెంట్ దొరికేది కాదని చెప్పేవారు. సచివాలయానికి వాస్తు వంక చెప్పి.. అక్కడికి రాలేదు. కొత్త సచివాలయం నిర్మితమయ్యాక అప్పుడు వచ్చారు. ప్రెస్‌మీట్‌లు తప్పితే బయట ప్రజలకు ఆయన చేరువలో ఉన్నది అరుదు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన కేవలం కొన్ని సభలకే పరిమితం అయ్యారు. కానీ, బీఆర్ఎస్ అధికారం పోగానే ఆయన తన శైలి మార్చుకున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది.
బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! pic.twitter.com/X1FxmEugmN
— KCR (@KCRBRSPresident) April 27, 2024
Also Read: కవరింగ్ కింగ్.. మల్కాజ్‌గిరి మీదేనంటవ్!
కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడి చేయడానికి ఆయన మొదట ఎంచుకున్నది రైతులను. పంట నష్టపోయిన రైతులను కలుస్తూ.. పొలాలు తిరుగుతూ మళ్లీ ప్రజల వద్దకు వెళ్లారు. ఈ సారి లోక్ సభ ఎన్నికలకు బస్సు యాత్ర చేపడుతున్నారు. దీనికితోడు ఆయన చాలా కాలం తర్వాత ఒక టీవీ చానెల్ స్టూడియోలో కనిపించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు టీవీ చానెల్ గడప తొక్కలేదు. అసలు ఒక దశలో మీడియాపైనే ఆంక్షలు విధించే స్థాయికి వెళ్లారు. ఆ ఇంటర్వ్యూ కనీసం మూడున్నర గంటలపాటు సాగింది.
ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఆయన యాక్టివ్ కావాలని అనుకుంటున్నట్టు తెలుస్తున్నది. అందుకే ఎక్స్‌లోనూ ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన రోజే దూకుడుగా ట్వీట్లు పెడుతున్నారు. పార్టీని గాడిలో పెట్టే ఆయన ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయనేది కాలమే చెబుతుంది.