Mahesh Kumar Goud: ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్ రిజైన్ చేసి మళ్లీ పోటీ చేస్తానని పార్టీ దృష్టికి తీసుకువచ్చారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పేర్కొన్నారు. అయితే పార్టీ అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రస్తుతం కేవలం ఆయన ఆసక్తిని మాత్రమే పార్టీకి వివరించారని, తుది నిర్ణయం పార్టీదేనని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. కానీ దానం సభ్యత్వం పోతుందని తాను భావించడం లేదని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లోనూ రేవంత్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తామన్నారు. ఈ ఐదేళ్లు రేవంత్ రెడ్డి సీఎం గా కొనసాగుతారన్నారు. ఇక భవిష్యత్ లో బీసీ సీఎం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని వివరించారు. తనకు కులమంటే అభిమానమే కానీ పిచ్చికాదని నొక్కి చెప్పారు. ప్రస్తుత గవర్నమెంట్ లో తనకు మంత్రి పదవి ఇస్తానంటే తానే వద్దన్నానని చెప్పారు.
పది రోజల్లో పార్టీ కమిటీలు…
వారం, పది రోజుల్లో పార్టీలోని అన్ని కమిటీలు వేస్తామని పీసీసీ చీఫ్ చెప్పారు. కార్పొరేషన్ పదవులు వచ్చే నెలలో భర్తీ చేస్తామన్నారు. లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందే కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తామన్నారు. జిల్లా ప్రెసిడెంటు కోసం జాతీయ నాయకత్వం ఒక ప్రాసెస్ నిర్వహిస్తోందని, అందుకే డీసీసీ అధ్యక్షుల నియామకానికి కాస్త సమయం పడుతుందన్నారు. అక్టోబర్లో పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని మొదలు పెడతామన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో డీసీసీల పాత్ర పెంచబోతున్నామన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీపై పట్టు సాధించడంలో డీసీసీ లు క్రియా శీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు.
ఇద్దరికీ మంచి కెమెస్ట్రీ…
సీఎం రేవంత్ రెడ్డికి తనకు మంచి కెమిస్ట్రీ ఉన్నదని పీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. ఈ సంవత్సర కాలంలో సీఎం, మంత్రులు చాలా సహకరించారన్నారు. తన హయంలో ఇన్ని కార్యక్రమాలు జరగడం, దానిలో తాను భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ కు రిక్వెస్ట్ పెట్టామన్నారు. సామాజిక న్యాయం తమ పార్టీ మూల సిద్ధాంతం అని వివరించారు. తన జీవితంలో మహత్తర అవకాశం దొరికిందన్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన తనకు పీసీసీ చీఫ్ గా అవకాశం రావడం గొప్ప విషయమన్నారు. మంత్రులతో ముఖాముఖి దేశవ్యాప్తంగా తనకు మంచి పేరును తెచ్చిందన్నారు. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల్లో మొదలు పెడుతున్నాయన్నారు. మీనాక్షీ నటరాజన్ ఇంచార్జీగా రావడం స్టేట్ పార్టీ అదృష్టమన్నారు. పాదయాత్రకు మంచి స్పందన వస్తోందన్నారు.
రాజగోపాల్ రెడ్డి విషయంలో కన్ ప్యూజన్..
క్రమశిక్షణ విషయంలో నిక్కచ్చిగా వెళ్లగలిగామన్నారు. కాంగ్రెస్ పార్టీలో బ్రేకులే కాదు సడెన్ బ్రేకులు కూడా ఉంటాయని వెల్లడించారు. రాజ్ గోపాల్ రెడ్డి విషయంలో కొంత కొంత కన్ఫ్యూజన్ ఉన్నదన్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం కోమటిరెడ్డి బ్రదర్స్ కి అలవాటు అని వెల్లడించారు. ఇవన్నీ త్వరలోనే పరిష్కరించబడతాయన్నారు. ఇక సీబీఐలో అనేక లొసుగులు ఉన్నాయని, కానీ సీబీఐ కంటే మరో మార్గం లేదన్నారు. సీబీఐతో కాకుండా రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తే బద్నాం చేసేవారని వెల్లడించారు. కాళేశ్వరం విషయంలో సీబీఐ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. హరీష్ రావు,సంతోష్ రావులు ఎలా దోచుకున్నారో కవిత చెప్పిందన్నారు. ధనం, పవర్ కోసమే కవిత,కేటీఆర్ లు పంచాయితీ పెట్టుకున్నారన్నారు. ఇక బీసీ బిడ్డలకు నోటిదాక వచ్చిన ముద్దను తినకుండా చేసింది కిషన్ రెడ్డి, బండి సంజయ్ లేనని వెల్లడించారు.
Also Read: Hydra: పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా.. 4400 గజాల్లో ఫెన్సింగ్ బోర్డు ఏర్పాటు