Naveen Yadav: ఏదైనా ఒక ఎన్నికలో గెలుపోటముల ఫలితాలు పక్కనపెడితే, ముందుగా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ తరపున టికెట్ దక్కించుకోవడం ఒక పెద్ద ఛాలెంజ్. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ వంటి విచ్చలవిడి అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న రాజకీయ పార్టీలో బీ-ఫామ్ చేజిక్కించుకోవడం అంత ఆషామాషీ విషయం కానేకాదు. అందునా, ఉపఎన్నిక వంటి ప్రత్యేక సందర్భం, పైగా అధికార పార్టీ నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగడమంటే ప్రహసనమనే చెప్పాలి. టికెట్ కోసం లాబీయింగ్‌లు, తెరచాటు మంతనాలు, పైకి కనిపించని కుస్తీలు.. ఇవన్నీ అధిగమించి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను దక్కించుకోవడంలో యువనేత నవీన్ యాదవ్ (Naveen Yadav) సఫలీకృతమయ్యారు.
జూబ్లీహిల్స్ సీటు కోసం అధికార పార్టీకి చెందిన పలువురు హేమాహేమీ నేతలు శతవిధాలా ప్రయత్నించారు. ఢిల్లీ స్థాయిలో మంత్రాంగాలు నడిపారు. ఈ జాబితాలో అజహరుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్ వంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల పేర్లు జోరుగా వినిపించాయి. అంతేకాదు, బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత బరిలోకి దిగడంతో, తమకు అవకాశం ఇవ్వాలంటూ పలువురు ప్రముఖ మహిళా నేతలు కూడా హస్తం పార్టీ పెద్దలకు విజ్ఞప్తులు చేసుకున్నారు. టికెట్ ఆశించినవారు అరడజన్ వరకు ఉన్నారు. కానీ, వీరందరినీ పక్కనపెట్టి మరీ కాంగ్రెస్ అధిష్టానం నవీన్ యాదవ్‌కు జైకొట్టింది. నవంబర్ 11న జరగనున్న ఉపఎన్నిక పోరు కోసం బరిలో నిలిపింది. నవీన్ యాదవ్ ఎంపిక అంత తేలికగా జరగలేదు. చాలా వడపోతలు, ఎన్నో సమీకరణలను పరిగణించిన తర్వాత ఈ ఎంపిక జరిగింది.
గల్లీగల్లీ తెలుసినోడు.. స్థానిక పరిచయాలు
నిజానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరుని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయడం ఏమంత ఆశ్చర్యం కలిగించలేదు. పోటీ ఉన్నప్పటికీ యువనేత వైపు పార్టీ అధిష్టానం మొగ్గుచూపడం, ఎంపిక చేయడం వెనుక పలు బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున నవీన్ యాదవ్ పోటీ చేయడం ఇదే తొలిసారి కావొచ్చు, కానీ, జూబ్లీహిల్స్‌పై ఆయనకు గట్టి పట్టు ఉంది. అక్కడి సమస్యలే కాదు, జనాలతో కూడా ఆయనకు బలమైన పరిచయాలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఆయన తిరగని గల్లీ, తొక్కని గడప దాదాపుగా లేదంటే అతిశయోక్తి కాదేమో.
నియోజకవర్గంలో సంప్రదాయక కార్యక్రమాలు, ఫంక్షన్లకు ఎవరూ ఆహ్వానించినా ఆయన తప్పకుండా హాజరై, అక్కడివారిని పలకరిస్తుంటారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు నవీన్ యాదవ్ 2014 నుంచి అలుపెరుగని ప్రయత్నాలు చేస్తున్నారు. 2014లో ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా, ఆ తర్వాత 2018లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపు కోసం పోరాడారు, కానీ, విజయం దక్కలేదు. అయినప్పటికీ నియోజకవర్గాన్నే అట్టిపెట్టుకొని ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టికెట్ ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ, ఆశాభంగమే జరిగింది. అయినప్పటికీ, నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా ఉండడంతో స్థానిక ప్రజల్లో సదాభిప్రాయం ఏర్పడింది. సత్సంబధాలను ఆయన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో నవీన్ యాదవ్‌కు అనూహ్యంగా అవకాశం లభించింది.
నవీన్ యాదవ్‌పై సానుభూతి
యువనేత నవీన్ యాదవ్‌పై జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సానుభూతి కూడా కనిపిస్తోంది. 2014లో ఎంఐఎం పార్టీ తరపున పోటీ చేసిన ఆయన రెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో 41 వేలకు పైగా ఓట్లు ఆయనకు పడ్డాయి. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఎవరూ ఊహించని విధంగా దాదాపు 19 వేల ఓట్లు సాధించారు. గెలవకపోయినప్పటికీ ఆ ఎన్నిక బరిలో అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు. 2023లో కూడా పోటీ చేయడానికి కాంగ్రెస్ టికెట్ కోసం చివరి వరకు ముమ్మరంగా ప్రయత్నించారు. కానీ, టికెట్ లభించలేదు. దాదాపు 12 ఏళ్లుగా ఎమ్మెల్యే కావాలనే లక్ష్యంతో నవీన్ యాదవ్ ప్రయత్నించే క్రమంలో నియోజకవర్గ జనాలకు ఆయన దగ్గరయ్యారు. వరుస ఓటములు, ఆ గత ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా, నియోజకవర్గాన్ని వీడకపోవడంతో ఒక అవకాశం ఇస్తే బాగుంటుందనే సానుభూతి జనాల్లో కనిపిస్తోంది.
Read Also- Tech Nationalism: ‘జోహో’కు మారిపోదాం రండి.. గూగుల్, మైక్రోసాఫ్ట్‌లను ఎందుకు వదిలేయాలంటే?
ఎంఐఎం మద్దతుపై ఆశలు!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఎంఐఎం పార్టీ మొదటి నుంచి పెద్దగా ఆసక్తిచూపడం లేదు. దీంతో, గతంలో ఈ పార్టీలో పనిచేసిన నవీన్ యాదవ్‌కు ఎంఐఎం నేతల మద్దతు ఉండొచ్చనే టాక్ మొదటి నుంచీ వినిపిస్తోంది. ఎంఐఎం అభ్యర్థిని బరిలోకి దింపకపోతే మాత్రం కచ్చితంగా నవీన్ యాదవ్‌కు సానుకూలత పెరుగుతుందనే అంచనాలు నెలకొన్నాయి.
యాదవ్ బిడ్డ.. బీసీ నినాదం
అధికార కాంగ్రెస్ పార్టీ బలమైన ‘బీసీ’ నినాదంతో ముందుకెళుతోంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో బీసీలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సమీకరణం నవీన్ యాదవ్‌కు బాగా కలిసొచ్చింది. అందులోనూ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం బాగా ప్లస్ పాయింట్ అయింది. నియోజకవర్గంలో ఈ సామాజికవర్గ ఓటు బ్యాంక్ ప్రాబల్యంగానే ఉంది. స్థానిక సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, ప్రజాసమస్యలకు పరిష్కారంలో చొరవ, వ్యక్తిగత సాయాలు చేసి ఉండడంతో సామాజికవర్గం పరంగా ఆయన జనాలకు బాగా చేరువయ్యారు.
టికెట్ దక్కడంలో యువతది కీలక పాత్ర
జూబ్లీహిల్స్ నియోజకవర్గ యువతకు నవీన్ యాదవ్ నిత్యం టచ్‌లో ఉంటుంటారు. నవీన్ యాదవ్‌కు టికెట్ దక్కడంలో యువత కీలక పాత్ర పోషించారని చెప్పాల్సిందే. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక ఖరారైన నాటినుంచి నవీన్ యాదవ్‌కు మద్దతుగా, సానుభూతి చూపుతూ చాలామంది నెటిజన్లు పోస్టులు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించినా, లేదా ఏ సర్వేలోనైనా నవీన్ యాదవ్ పేరుని యువత చెప్పారు. ఆయనకు టికెట్ ఇస్తే మద్దతు ఉంటుందని పలు సర్వేల్లో చెప్పారు. తాను ఎమ్మెల్యే కాలేకపోయినప్పటికీ, అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కావడంతో నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు అమలు చేయడంలో నవీన్ యాదవ్ ముందున్నారు. దీంతో, యువతతో ఆయనకు పరిచయాలు, వారిలో ఫాలోయింగ్ పెరిగి కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో పడేలా చేశాయి. ఈ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ మొత్తం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నవీన్ యాదవ్‌ను జూబ్లీహిల్స్ బరిలో నిలిపింది.
