– డిజైన్ ఎప్పుడు చేశావ్ పెగ్గు వేసినప్పుడా.. దిగినప్పుడా?
– మేం కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చూడు
– కేసీఆర్, హరీశ్ తోకలు తెగిన బల్లులా ఎగురుతున్నారు
– పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తాం.. హరీశ్ రాజీనామా సిద్ధం చేసుకో
– ఆనాడు పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టె దొరకలేదన్నట్టు మాట మార్చకూడదు
– వరంగల్‌కు మహర్దశ తెచ్చే బాధ్యత నాది
– అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం
– ఉత్తర తెలంగాణను వైద్య కేంద్రంగా తీర్చిదిద్దుతాం
– కడియం శ్రీహరిని పార్టీలోకి రావాలని నేనే అడిగించా
– ఓరుగల్లు జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి
వరంగల్, స్వేచ్ఛ: అసెంబ్లీకి రానోళ్లు.. బడి ఎగ్గొట్టిన బడి దొంగలాంటోళ్లని కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో తమ కళ్లలో చూసే ధైర్యం లేక టీవీ ఛానల్‌కు పోయి కూర్చున్నాడని విరుచుకుపడ్డారు. చర్చ చేద్దామంటే డుమ్మా కొట్టి పారిపోతాడని, కానీ, ఛానల్‌లో ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం కోసం కష్టపడ్డాడని చెబుతున్న కేసీఆర్, పెగ్గు వేసినప్పుడు డిజైన్ చేశారా? దిగినప్పుడు చేవారా? అని ప్రశ్నించారు. ఆయన చెబుతున్నట్టు కాళేశ్వరం అద్భుతమైతే అదే ప్రాజెక్టు వద్దకు చర్చకు రావాలని సవాల్ విసిరారు సీఎం. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు మేధావులు, నిపుణులను తీసుకెళ్లి చర్చ చేద్దామని, అన్ని ఖర్చులు ప్రభుత్వమే చూసుకుంటుందని అన్నారు. అలా కట్టారో లేదో ఇలా కూలిపోతున్నాయని, అదే కాంగ్రెస్ హయాంలో నిర్మాణమైన ప్రాజెక్టులు చూడు ఎలా చెక్కుచెదరకుండా నిలబడి ఉన్నాయో అని తెలిపారు. మేడిగడ్డ మేడిపండు, సుందిళ్ల సున్నా, అన్నారం ఆకాశంలో కలిసిందని అన్నారు రేవంత్ రెడ్డి.
వరంగల్ డెవలప్‌మెంట్ అజెండా
రాష్ట్రానికి రెండో రాజధాని అయ్యే అర్హతలన్నీ వరంగల్‌కు ఉన్నాయని, స్మార్ట్ సిటీని కేవలం పేరుకే పరిమితం చేయరాదని సీఎం అన్నారు. వరంగల్‌కు మహర్దశ తెచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మిస్తామని చెప్పారు. కాకతీయ యూనివర్సిటీకి కొత్త వైస్ చాన్సిలర్ నియమిస్తామని, అధ్యాపక పోస్టులనూ భర్తీ చేసి పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. వరంగల్‌లో పెండింగ్‌లో ఉన్న హాస్పిటళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని, ఉత్తర తెలంగాణ వైద్యం నిమిత్తం హైదరాబాద్ కాకుండా వరంగల్‌కు వచ్చేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. వరంగల్ యువతకు ఉపాధి లభించేలా ఇక్కడికి ఇండస్ట్రియల్ కారిడార్ తెస్తామని వివరించారు. టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి చేస్తామని, ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తామని చెప్పారు. వరంగల్ అభివృద్ధికి కడియం శ్రీహరి అనుభవాన్ని ఉపయోగించుకుంటామని తెలిపారు. పదేళ్లపాటు చెత్త ఎత్తలేని దిక్కుమాలిన ప్రభుత్వం అధికారంలో ఉందని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌లలో కొత్త డంపింగ్ యార్డులు నిర్మిస్తామని హమీ ఇచ్చారు. హైదరాబాద్‌లా వరంగల్‌ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా నిధులు కేటాయించి అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని అన్నారు.
Also Read: అబ్బే.. నమ్మశక్యంగా లేదే..! రిజల్ట్ చూసుకుని మూర్ఛపోయిన విద్యార్థి
మాట మీద నిలబడు
మామ అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగురుతున్నారని కేసీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తాను రుణమాఫీ చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా ప్రకటిస్తానని హరీశ్ రావు అన్నారని గుర్తు చేస్తూ, రామప్ప శివుడి సాక్షిగా, వేయి స్తంభాల గుడి సాక్షిగా, భద్రకాళి అమ్మవారి సాక్షిగా పంద్రాగస్టులోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇస్తున్నా అని చెప్పారు. హరీశ్ రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండాలని ఛాలెంజ్ చేశారు. మాట మీద నిలబడాలని, ఆనాడు పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టె దొరకలేదని చెప్పినట్టు కాదని చురకలంటించారు.
కడియంను పార్టీలోకి నేనే ఆహ్వానించా!
కడియం శ్రీహరి తనకు తాను కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసే నాయకుడు తమ పార్టీలో ఉండాలని అనుకున్నట్టు వివరించారు. తాను కొందరు సీనియర్లను కడియం శ్రీహరి వద్దకు పంపానని, ఆయనను పార్టీలోకి ఆహ్వానించి కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఆఫర్ చేశానని తెలిపారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తున్నదని, ఈ పరిణామాన్ని ఆపడానికి గాంధీ కుటుంబ నాయకత్వంలో పని చేయాలని కడియం శ్రీహరి నిర్ణయించుకుని ఉంటారని రేవంత్ రెడ్డి వివరించారు. ఆయన పార్టీలోకి రావాలని ముందుగా తానే ప్రతిపాదించానని పేర్కొన్నారు.
భూములు మింగిన అనకొండ.. ఆరూరి
మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు కొల్లగొట్టాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదని, వారి ప్రయత్నాలను వమ్ము చేసి చైతన్యవంతమైన ప్రజలుగా వరంగల్ ప్రజలు తీర్పు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. ఒకవైపు చదువుకుని, సమస్యలపై అవగాహన కలిగిన, పేద ప్రజలకు వైద్య సేవలు అందించిన కడియం కావ్య ఉన్నారని, మరో వైపు భూములు మింగిన అనకొండ ఆరూరి రమేశ్ ఉన్నారని అన్నారు. పేద ప్రజల భూములు మింగిన అనకొండ ఆరూరిని బండకేసి కొట్టాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.